ఆత్మ బలిదానాలు మన సంస్కృతి కాదు

మంగళవారం, జూలై 26, 2011, 17:34 [IST]
Telangana People
తెలంగాణ పోరాటాల గడ్డ అని, మనది వీరుల గన్న నేల అని ఎంత గర్వంగా చెప్పుకుంటాము.నిజమే మనది పోరాటాల గడ్డనే. మనది వీరుల గన్న నేలనే. మరి ఏమిటీ ఈ వైపరీత్యం. ఏందుకీ ఏ ఆత్మ బలిదానాల పరంపర. యుగాల నుండి ఈనేల మేద మహత్తర పోరాటాలు జరిగినయ్.ఈ పోరాటాలలో ఎందరో వీరులు నేలకొరిగిండ్రు. సమ్మక్క సారక్కలు కాకతీయ సామ్రాజ్యాన్ని ఎదిరించి పోరాటంలో అమరులైయిండ్రు. తుర్రెబాజ్ ఖాన్, మౌల్వీ అల్లావుద్దిన్, రాంజీ గోండు బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని ఎదిరించి అమరులైయిండ్రు.సర్వాయి పాపన్న గోలకొండ సర్కారుతో పోరాడి నేలకొరిగిండు. కొమురం భీం ,.దొడ్డి కొమరయ్య , షోయబుల్లా ఖాన్ , 3000 ల మంది తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులు నిజాం సర్కారుతో పోరాడి అమరులైండ్రు. అంతకు మించి 5000 మంది సామాన్య ప్రజలను కమ్యూనిస్టుల పేరు మీద, ముస్లింలను రజాకార్ల పేరు మీద నెహౄ సర్కారు బలితీసుకున్నది. 1952 " గైర్ ముల్కి గో బ్యాక్ " ఉద్యమంలో 7గురు విద్యార్తులను బూర్గుల సర్కారు బలితీసుకున్నది. 1969 ఉద్యమంలో 370 మంది తెలంగాన విద్యార్థి యువజనులను కాసు కర్కోటక సర్కారు బలితీసుకున్నది.

ఆ తర్వాత తెలంగాణ రైతాంగ పోరాటంలో సీమాంధ్ర సర్కారు అమలు చేసిన అనిచివేతకు , బూటకపు ఎన్ కౌంటర్లకు సుమారు 40 వేల మంది అమరులైనట్టు సమాచారం ఉన్నది. ఈ వర్తమాన తెలంగాణ ఉద్యమంలో కూడా బెల్లి లలిత , ఐలయ్య లాంటి వారిని సీమాంధ్ర సర్కారు బలితీసుకున్నది. ఇవ్వాల పరిస్థితిని చూస్తే అందుకు భిన్నంగా కనిపిస్తున్నది. శ్రీకాంతాచారి ఆత్మబలిదానం నుండి నేటి యాదిరెడ్డి ఆత్మ బలిదానం దాక లెక్కగడితే 620 కి పైగానే విద్యార్థి యువజనులు ఆత్మ బలిదానాలకు పాల్పడినట్లు తెలుస్తున్నది. ఇది మన యువకులలో వచ్చిన అసాధారణ మానసిక వైకల్యంగా చెప్పక తప్పదు. ఇది మన పోరాట సాంప్రదాయం కానేకాదు.ఇంత మంది అమరుల రక్తంతో తడిసిన తెలంగాణ నేలపై ఆత్మబలిదానాలు జరగడం ఎంత అవమానం ! వారి అమరత్వాలు చిన్నబోవా? కిరోసిన్ పోసుకొని తగులబెట్టుకుంటున్న , ఉరి పోసుకుని చావడానికి సిద్దపడుతున్న మీ సాహాసాన్ని పోరాటంలో చూపాలి కదా ! అయితే పోరాటంలో అమరులు కావాల్సిన వీరు ఆత్మబలిదానాలకు ఎందుకు పాల్పడుతున్నట్లు? ఇది మనందరం నిజాయితిగా విశ్లేషించుకోవాల్సిన అంశం.

అమరవీరులను తలచుకుంటూ గానం చెయ్యడం ప్రజలు యుగాలుగా చేస్తున్నదే. యుద్ధంలో మరణించినవారే అమరులవుతారుగాని పోరాడకుండా ఆత్మబలిదానాలు చేసుకున్నవారు అమరులెట్లా అవుతారు? ఆత్మ హత్య ఎవరు చేసుకున్నా అది పిరికి చర్యనే. అటువంటి పిరికి చర్యను మనం అమరత్వంగా కీర్తించి గ్లోరిఫై చేసినమా?మితిమీరిన గ్లోరిఫికేషన్ ద్వారా విద్యార్థి యువజనులని మనం ఆత్మబలిదానాలవైపు నెట్టేసినామా? నిరంతర పోరాట కార్యక్రమాలని రూపొందించుకోకుండా యువకులను నిరాశా నిస్పౄహలకు లోను చేసినామా? సీమాంధ్రుల కుట్రలను , సీమాంధ్ర మీడియా దుర్మార్గపు ప్రచారాలను నిలువరించడంలో మన నేతల వైఫల్యం ఈ మానసిక వైకల్యానికి కారణం కాదా? 9 డిసెంబరు ప్రకటనను నిలుపుకొవడంలో మన వైఫల్యం మన యువజనుల మానసిక స్థితిలో తీవ్రమైన మార్పులను తీసుకవచ్చింది. 9 డిసెంబరు నుండి 23 డిసెంబరు వరకు మనం పోరాటాన్ని విరమించాము. సీమాంధ్రులు మన మౌనాన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని వచ్చిన తెలంగాణని వెనక్కు పొయ్యేలాగా చెయ్యగలిగినారు. ఇది ఒక చారిత్రిక తప్పిదమని చెప్పక తప్పదు. ఈ చారిత్రిక తప్పిదానికి మనం 600 మంది విద్యార్థి యువజనులను కోల్పోయాం. ఇవ్వాల్ల పోరాటం ఉదృతంగా ఉన్నప్పటికీ ఆత్మబలిదానాల మానసిక స్థితి మన యువకులను వదలలేదు.

ఈ పరిస్థితుల్లో మనమేమి చెయ్యగలం? విధ్యార్థి యువజనులకు ఆత్మబలిదానాలు వంటి పిరికి చర్యలకు పాల్పడవద్దని కోరుదాం. ఆత్మ బలిదానం అమరత్వం కాదని, అది వీరులు చేసే పని కాదని చెబుదాం. అటువంటి వారిని అమరుల సరసన చేర్చి కీర్తించడం పోరాటంలో చనిపోయిన అమరులకు అవమానం అని ప్రచారం చేద్దాం. తెలంగాణ కోసమే అయినా ఆత్మబలిదానాలకు పాల్పడినవాల్లు తెలంగాణ అమరవీరులు కాలేరని ప్రకటిద్దాం. తనదే చివరి ఆత్మ త్యాగం కావాలని యాదిరెడ్డి కోరిక. ఆ కోరికను నిజం చేద్దామని యువకులకు పిలుపునిద్దాం. ఇవ్వాల్టి నుంచి పోరాటంలో చనిపోయినవాడే అమరుడని చాటింపు వేద్దాం. ఆత్మబలిదానాలతో తెలంగాణ రాదని ఇప్పటికే తేలిపోయింది కనుక ఇక ఎవ్వరు అటువంటి వృధా త్యాగాలకు పాల్పడవద్దని చెబుదాం. మిమ్ములని కన్న తల్లిదండ్రులకు , తెలంగాణ తల్లికి కడుపు కోత మిగిల్చవద్దని కోరుదాం. ఫొరాడి తెలంగాణను సాధించుకుందాము. అందరం కలిసి ఇక్యంగా పోరాటంలో ముందుకు కదులుదాం. విడిగా ఉంటే ఓడిపోతాం కలిసి ఉంటే బలపడతాం. మన ఇక్య పోరాటాలే మన యువకుల ప్రాణా లను కాపాడుతాయి. ఆచార్య జయశంకర్ కూడా కోరుకున్నది ఇదే.

బిడ్డలారా !
తెలంగాణ ఎవరి కోసం ? మీ కోసం. మీ సుందరమైన భవిష్యత్తు కోసం.మీ కోసం తీసుకురావాలనుకుంటున్న తెలంగాణలో మీరే లేకుంటే ఎట్లా? 141 మంది ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేసిన తర్వాత ఆత్మబలిదానాలు ఆగిపోతాయనుకొంటే తిరిగి యాదిరెద్ది రూపంలో ప్రారంభం కావడం ఎంత విషాదం ! ఇవ్వాల తెలంగాణని అడ్డుకొనే శక్తి ఈ భూమ్మీద ఎవరికీ లేదు.అడ్డుకున్న ధ్రోహిని ఏం చెయ్యాలో మనకు తెలుసు. ఇంటి దొంగని బయటి శత్రువుని ఏం చెయ్యాలో మన కాళోజీ చెప్పనే చెప్పిండు.ఆ మహాకవి మాటలని మల్లొకసారి యాది చేసుకుందాము.

ప్రాంతేతరుడు దోపిడి చేస్తే ప్రాంతందాకా తరిమి కొడదాం
ప్రాంతంవాడే మోసం చేస్తే ప్రాంతంలోనే పాతర వేద్దాం.

భిడ్డలారా !
రాబోయే కాలం మనది.రాబోయే రాజ్యం మీది.,మనందరిది.మీ రాజ్జం మేరేలుండ్రి.బతుకుని ప్రేమించే గడ్డ మనది. బతుకుని దైవంగ మార్చుకున్న గడ్డ మనది. బతుకు మీద ఆన - బతుకమ్మ మీద ఆన . ఇగ తెలంగాణలో ఆత్మబలిదానాలు జరుగవద్దు. ఇది బతుకమ్మకు మా మొక్కు. మా బిడ్డలుగా మా మొక్కుని తీర్చుతారుగదా !

- శ్రీధరరావు దేశ్ పాండే

రచయిత అభిప్రాయాలతో దట్స్ తెలుగు డాట్ కామ్‌కు ఏ విధమైన సంబంధం లేదు.
English summary
Writer and Telangana activist Srifhar rao Deshpande says in his article that suicides is not Telangana culture.
User Comments
Madhu Eadara 26 Jul 2011 11:38 pm
This is hate speech!! You speak like Nazis. You are Xenophobic and full of hate. To say that you have to drive the non-telangana people away is anti constitutional. Its is inability to accept that you failed as politicians and instead pointing fingers on Andhra and Rayala seema people for your troubles. Grow up!!
[ మీ వ్యాఖ్య రాయండి ]
IPL, Wankhede Stadium, Mumbai
Kolkata Knight Riders won by 32 runs
1st Test , Lord's Cricket Ground, St John's Wood
Match starts at 03:30 pm IST  
IPL, Himachal Pradesh Cricket Association Stadium, Dharmasala
Match starts at 04:00 pm IST