వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చింతపట్ల క్విక్‌బాక్సింగ్: ఒక ఐడియా స్టోరీనే..

|
Google Oneindia TeluguNews

ఎక్కడి కన్నయ్యా హడావిడిగా వెళ్తున్నావ్?

నాన్నగారు ఎందుకో అర్జంటుగా రమ్మన్నార్ట తమ్మూడూ అన్నాడన్నయ్య.

నేనూ వస్తాను అన్నాడు ఫాలో అయ్యాడు తమ్ముడు.

అన్నయ్య సెల్లురింగయ్యింది. ఆగి ఫోన్ చెవికి ఆనించాడు అన్నయ్య.

హలో.. హలో.. పిన తల్లిగారా. ప్రణామం తల్లీ. నాన్నగారు రమ్మన్నారట. వస్తున్నా

రాక్కర్లేదు. వారు మీతో చెప్పమన్నదే చెప్పడానికి నేను ఫోన్ చేశా.

చెప్పండి మాతా.

వారికీ మాకూ వున్న పర్సనల్ ఒప్పందం ప్రకారం మీరు పధ్నాలుగేళ్లు అడవుల్లో గడపాలి.

Chintapatla quick boxing on mobile calls

తండ్రి గారి ఆజ్ఞ శిరస్సునధరిస్తాను తల్లీ. వారినొక్కసారి దర్శించి పాదాలను స్పర్శించి..

అవసరం లేదు. వారు మీ ముఖం చూచి చెప్పలేననన్నారు కనకే ఈ సెల్‌ఫోన్‌లో చెప్పాల్సి వచ్చింది. ఇక బయల్దేరండి.

హలో హలో..
హోల హలో..

ఏంటో ఈ కారడవిలో సిగ్నల్సు సరిగ్గాలేక వినిపించడం లేదు. మళ్లీ రింగయితే తప్ప లాభం లేదు. అనుకుంటుంటే మళ్లీ రింగయింది.

హలో హలో.. అన్నయ్యా ఫరవాలేదిప్పుడు వినపడుతున్నది.

హలో తమ్ముడూ జాగ్రత్తగా విను. ఇక్కడ ఓ అయిటెమ్ గర్ల్ వచ్చి ఆడిపాడి నన్ను నానా హింస పెడ్తున్నది.

అదేంటన్నయ్యా! ఈ అడవిలో ఏ ఎంటర్నయిన్‌మెంటూ లేక అల్లాడుతున్నంగాదా.. కాస్సేపు ఎంజాయ్ చెయ్యచ్చు కదా

ఒరేయ్ తమ్ముడు ఊరికే ఆటాపాటా కాదు పెళ్లాడమంటోంది.

వామ్మోవ్ వదిన పక్కనుండగానే..

అందుకే నీ దగ్గరికి పంపుతున్నా సాంగూ డ్యాన్సూ ఎంజాయ్ చేస్తావో మళ్లీ మనం వున్న చోటికీ రాకుండా చేస్తావో.. నీ ఇష్టం వుంటా..

అన్నయ్యా! హలో హలో! అన్నయ్యా..

ఈ సముద్రపు ఘోషలో వినపడట్లేదమ్మా. కాస్త ఆగు. గదిలోకి వచ్చాయిప్పుడు చెప్పు. ఎక్కడున్నావమ్మా చెల్లెమ్మా.

ఇంకెక్కడన్నా ఇది కేర్ హాస్పిటలో ఆపోలోనో కూడా తెలీట్లేదు. మన వాళ్లెవ్వరో తెచ్చిపడేశారు.

హాస్పిటలా ఏమయ్యిందమ్మా.. ఏం జరిగింది తల్లీ.

ఏం చెప్పనన్నయ్యా ఆడ దాన్ననీ, అందులో అందమైన దాన్ననీ కూడా పట్టించుకోకుండా, నా పాటని చెవి నెక్కించుకోకుండా ఓ దుర్మార్గుడు నా చెవులూ ముక్కూ కోసిపారేశాడు.

ఎవడారాస్కెల్. వాడి అంతుచూస్తా అయినా చెవులు లేకుండా ఎలా వినపడ్తున్నదమ్మా.

ప్లాస్టిక్ సర్జరీ చేశారన్నయ్యా. నాకేం ఫరవా లేదు. నాల్రోజుల్లో డిశ్చార్జ్ చేస్తారు. కానీ ఒక ముఖ్య విషయం.

చెప్పు తల్లీ చెప్పు.

నా ముక్కూ చెవులూ కోసినవాడి కో అన్నా ఆ అన్నకో పెళ్లామూవున్నారు.

ఆ..ఆ.. చెప్పు చెప్పు

ఆ పెళ్లాం మూమూలు పెళ్లాం కాదు. చక్కని చుక్క.. అతిలోక సుందరి.. మిసెస్ యూనివర్స్. ఆవిడ్ని చూసుకునే ఆ మొగుడికంత హైటెక్కు. అందం సంగతి చెప్పినన్ను టెంప్టు చెయ్యకు నేనేం చెయ్యాలో చెప్పు.. హలో.. హలో..

హలో.. హలో.. పెద్ద అరవకన్నయ్యా చెవులింకా పచ్చిగావున్నయి. ప్లాస్టిక్ గట్టిపళ్లేదు.

నన్నేం చెయ్యమంటావ్ చెల్లీ ఆ సుందరిని కిడ్నాప్ చేసుకొచ్చేయనా?

అందుకే గదా ఈ ఫోను. ఆమెని ఎత్తుకొచ్చేస్తే గాని ఆ అన్నదమ్ముల పొగరు అణగదు.

నా కాట్టే టైం లేదు. నువ్వు ఫోన్ పెట్టేస్తే నేను బయలుదేరి నీ కోసం, నీకు జరిగిన అవమానానికి తగిన ప్రతీకారం చేస్తాను.

మా అన్నయ్య మంచివాడు.. బై.. అన్నయ్యా.

వీడెవడో నన్ను ఎత్తుకుపోతున్నాడు నన్ను రక్షించండి అని భర్తకి ఫోన్ చేద్దామనుకుంది భార్య. సమయం చూసుకుని రహస్యంగా సెల్లు మీద నంబరు కొట్టింది. ముందు సౌండు గల్లుగిల్లుమంది. తర్వాత గుర్రుగర్రంది. ఆ తర్వాత ఈ కాల్ చేయుటకు సరిపడా బ్యాలెన్స్ లేదు అని గొణిగింది.

ఛ. సరిగ్గా ఇప్పుడే బ్యాలెన్స్ లేకుండా పోవాలా. సరిగ్గా టైమ్‌కి టాప్ అప్ కార్డు వేయించవయ్యా మగడా అంటే ఆయన పట్టించుకోడు మరిదికి అన్న చెప్తే తప్ప వినిపించుకోడు అని ఉసూరుమంది మరిదికి వదినా మొగుడికి పెళ్లాం.

చెట్టుచాటున నిలబడున్నారు అన్నాతమ్మూడూ ఆ పక్కనే అన్నను దైవంగా భావించే నమ్మినబంటూ. అల్లంత దూరాన మరో అన్నాతమ్ముడూ కొట్టుకుంటున్నారు. క్రిందటిసారి ఆ ఇద్దరిలో ఎవరు అన్నో ఎవరు తమ్ముడో తెలీక కన్‌ఫ్యూజయ్యాను అన్నాడు అన్న. సార్! ఈసారి అలాంటి ప్రాబ్లమ్ ఏమీరాదు. వాళ్లిద్దరిలో మనకు కావాల్సిన తమ్ముడి మెళ్లో వేళ్లాడుతున్న సెల్‌ఫోన్ వుంది.. అన్నాడు బంటు. మెళ్లో సెల్ ఫోన్ లేనివాడ్ని గురిచూసి కొట్టాడు అన్నయ్య.

ఏం అన్నయ్య ఏం చేస్తున్నారు అనడిగాడు దిగులుగా తమ్ముడు.

మీ వదినమ్మ నంబర్‌కి రింగుచేస్తున్నా తమ్మూడు అన్నాడు అన్నయ్య అంతకంటే ఎక్కువగా దిగులుపడుతూ.

రెస్పాన్సేమన్నావుందా అన్నయ్యా లేదు తమ్మూడూ. ఈ నంబర్‌తో ఏ ఫోనూ పని చేయడం లేదని వోసారి, అన్ని లైన్లూ బిజీగా వున్నాయని ఇంకోసారి ఇలా రకరకాలుగా వినవస్తున్నది తప్ప మీ వదిన కమ్మటి గొంతు వినిపించడం లేదు అన్నాడు అన్నయ్య.

ఇంకెక్కడి ఫోన్ అన్నయ్యా ఎప్పుడోలాగేసుకుని సిమ్ కార్డు లేపేసే వుంటారు. అయినా మన వాళ్లందరూ నాలుగు దిక్కులూ వెళ్లారు కదా వదిన్ని వెతకడానికి. ఎవరో ఒకరు ఫోన్ చెయ్యక పోరు. నా నంబర్ కూడా యిచ్చాను అన్నాడు తమ్ముడు. సెల్లు మోగనే మోగింది. అన్నయ్య నీ ఫోనే మోగుతున్నది ఎత్తు.. అన్నాడు.

ఫోన్‌లో వింటున్నది అన్నయ్య మొహంలో తెస్తున్న మార్పులు గమనించాడు తమ్ముడు. ఫోన్ పెట్టేక చెప్పాడు అన్నయ్య మనవాడు మీ వదిన్ని చూశాట్ట చూసిరమ్మన్నాం కాదా కాల్చి వస్తున్నాట్ట యిక మనం యుద్ధానికి రడీ అయిపోవాలి అన్నయ్య ఆవేశంగా అన్నాడు.

ఇక ఈ సముద్రం మనకి దారియిచ్చేట్టు లేదు సార్. మీరొక్క ‘కాల్' చేసి సముద్రుడికి వార్నింగ్ యివ్వండి అన్నాడు బంటు. మరినంబరో అన్నాడు తమ్ముడు. అడగ్గా అడగ్గా ఎవరో ఒకరి దగ్గర నంబరు దొరికింది. సముద్రుడు సెల్ దెబ్బకి ఠా అని దారికొచ్చాడు.

మామూలు యుద్ధం కాదు. మహాయుద్ధం జరిగింది. ధర్మం జయించే టయం వచ్చింది. పోవల్సిన వాళ్లందరూ పైకి పోయేక వచ్చాడు పరాయి వాడి పెళ్లాన్ని ఎత్తుకొచ్చినవాడు. ఇన్నాళ్ల కోపాన్నీ తన యుద్ధంలో ప్రదర్శించాడు అన్నయ్య. అన్నయ్యకు సహకరిస్తూ వున్నాడు తమ్ముడు. అయితే ఎంత కొట్టినా దుర్మార్గుడు చావడే. నేలక్కరచుకుంటున్నాడు మళ్లీ లేచి నుంచుని ‘రఢీ' అంటున్నాడు. ఏంచెయ్యాలో ఎక్కడ కొట్టాలో అర్థం కాలేదు అన్నయ్యకు. అప్పుడొచ్చింది ఫోను. బైకు మీద వెళ్లేవాడు ఫోను చెవికి తలతోవొత్తిపనట్టు పట్టి యుద్ధం కంటిన్యూ చేశాడు అన్నయ్య. హలో.. హలో.. హలో.. అవతలి పక్క ఎవరు? ఈ టైంలో అన్నాడు అన్న. నేను బాస్ మీరు చావ గొట్టినా చావకుండాలే లేచినించున్న వాడి తమ్ముడ్ని.. అన్నని, వొదిలి మీవైపు వచ్చినవాడ్ని ‘ఓ నువ్వా! చెప్పు చెప్పు' మీ అన్నయ్యని ఎలా చంపాలో నేనే స్వయంగా చెబుదును కానీ చూశాడంటే నిన్నొదిలి ముందు నా బుర్రబద్దలు కొడ్తాడు అందునే ఫోన్ చేస్తున్నా. సరే సరే చెప్పు.. చెప్పు వినిపించడం లేదు గట్టిగా చెప్పు.. అవతలి పక్క నించి దుర్మార్గుణ్ని చంపడానికేం చెయ్యాలో వినిపించింది. అంతే దుర్మార్గుడి పొట్టలో బాంబు పేలింది.

ఆకాశంలో నిలబడి వున్న దేవతలు సెల్ ఫోన్లల్లో ‘కంగ్రాచ్యులేషన్స్' వర్షం కురిపించారు.

-చింతపట్ల సుదర్శన్

English summary
Prominent columnist Chintapatla Sudarshan in quick boxing mocked at mobile calls.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X