వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

క్విక్‌ బాక్సింగ్: బద్ధకం బహుపరాక్

|
Google Oneindia TeluguNews

అబ్భ బద్ధకంగా వుంది అనుకున్నాడు సూర్య ప్రతాప్. ఏమిటో యేళ్ళనుంచీ ఒకే డ్యూటీ చేసి చేసి విసుగొస్తున్నది అని కూడా అనుకున్నాడు. కిటికీలోంచి తొంగి చూస్తూ అవుపడ్డాడు కొలిగ్ వరుణ్.

హాయ్! వరుణ! బద్ధకంగా వుంది. డ్యూటీకి రాబుద్ధి పుట్టటం లేదు. నువ్వు కాస్త ముందు వెళ్లి నల్లషాంపూతో మెఘాలకి తలంటి ఉతికి ఆరేసి పెట్టు తర్వాత నేనొచ్చి ఇస్త్రీ చేస్తాలే అన్నాడు.

వర్షం మొదలయ్యింది. పొద్దున్నే తగులుకుంది పాడు వర్షం. ఈ హోరు గాలిలో వాన నీటిలో ఆఫీసుకేం వెళ్తాం లెద్దూ పనేం చేస్తాం వద్దూ అని లోలోపల మురిసిపోతూ కిటికీలోంచి దారప్పోగుల్లా పడుతున్న వర్షం కేసి చూడ్డం ఆపేసి మళ్లీ ముసుగుతున్నాడు కశ్యప్. అసలు పేరు కశ్యపే కానీ అతని బద్ధకాన్ని నిధానాన్ని నింపాది తనాన్ని వాయిదాకోరు తత్వాన్ని పనులు చెయ్యడానికి తొయ్యెయ్ తొయ్యెయ్ అన్నట్టు సాగే నడకని దృష్టిలో పెట్టుకుని అతని గురించి తెల్సిన వాళ్లు ముద్దుగా, మురిపెంగా, కోపంగా, విసుగ్గా చిరాగ్గా కచ్ఛప్ అనగా తాబేలు అని పిలుచుకుంటారు.

Chintapatla quick boxing on Sloth

ఈ లోకంలో అతని కిష్టమైన జంతువూ, పక్షీ, ప్రాణీ ఏదైతేనేం అది ఒక నత్త మాత్రమే. క్యాట్ వాకింగ్ కంటే నత్తనడక అందమైనదని అతని స్ట్రాంగ్ ఫీలింగ్. అతగాడికి హాబీలంటూ ఏవిలేవు ఒక్క బద్ధకం తప్ప. అతనికి ఇష్టమైన పదాలేవీ డిక్షనరీలో లేవు ఒక్క బద్ధకం తప్ప. ఖచ్చితంగా చెప్పాలంటే అతనొక మూర్తీభవించిన బద్ధకం.

బద్ధకం అనే ఈ సుగుణం అందరికీ అబ్బేది కాదు అచ్చివచ్చేదీ కాదు. కొందరికి తప్ప. బద్ధకం అనే ఈ అదృష్టం అందరికీ కల్సివచ్చేది కాదు కొందరికి తప్ప. అసలు బద్ధకం అనే ఈ సుగుణం పుట్టీ పెరిగాక వచ్చేది కాదు. పుట్టుకతోనే కవచ కుండలంలా ఒంటికి అతుక్కుని వచ్చేది అని అనిపించక మానదు ఈ ఇన్సిడెంట్ చిత్తగిస్తే.

‘డాక్టర్! డాక్టర్! ఇప్పుడే పైలోకం నుంచి భూమ్మీదకి డెలివరీ చెయ్యబడ్డ ఈ మేల్ బేబీ ఏడవడం లేదు' అన్నది నర్సు పసివాడు తలకిందులుగా వేలాడేసి పట్టుకున్నా ఉలుకూ పలుకూ లేకుండా పులుకూ పులుకూ చూస్తుంటే.

‘అదే మాయరోగం. లాగి పెట్టి కొట్టు' అన్నది డాక్టరమ్మ.

అప్పటి దాకా అబ్భ బద్ధకంగా వుంది యేం యేడుద్దాం లెద్దూ అనుకున్న కాబోయే కచ్ఛప్ బద్ధకం వదిలి కెవ్వుకేక లంకించుకోపోతే అదేదో మాయరోగమని చెప్పి లావుపాటి నర్సు మందపాటి హస్తవాసి రుచి చూడాల్సి వస్తుందని భయపడి, తప్పనిసరి పరిస్థితిలో ముక్కుతో మూలిగాడు. అలా మొదలయ్యింది అతని నిదాన జీవనయానం.

పూవు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్టు చిన్న నాటి నుంచే పరమ బద్ధకిస్టు లక్షణాలు పరిమళించాయి కచ్ఛప్ బయోగ్రఫీలో. బడికి వెళ్లవలసిన రోజుల్లోనే అతని బద్ధకపు ప్రతిభ వెలుగులోకి వచ్చింది. బడి ఎగ్గొట్టడంలో, పంతుళ్ళ నుంచి తప్పించుకోవడంలో వాడి శౌర్య సాహసాలు ఫినైలు వాసనలా వ్యాపించేయి. ఏ బడీ అతన్ని కుదురుగ్గా ఒక్క ఏడయినా సరిగ్గా ఉంచుకోలేకపోయింది.

తల్లీదండ్రీ చచ్చుచూ చెడుచూ పడి లేస్తూ బడి అయిందనిపించారు. బడిలో అతని లీలలు రాస్తే వో పెద్ద గ్రంథమే అవుతుంది. హోంవర్కు తల్లి చేయాలి. నోట్సు ఇంకొకళ్లు రాసి పెట్టాలి. పరీక్షలు మరొకళ్లు రాయకూడదు కనక ఆ నాల్రోజులు బద్ధకాన్ని సముదాయించక తప్పేది కాదు. అయినా అతను తప్పని పరీక్ష లేదు. మళ్లీ మళ్లీ రాస్తుంటే పరీక్షకులు యిక నిరీక్షించలేక పాసు చేసి బరువు దించేసుకునే వారు.

చట్టుబండలు కాకుండా చదువు అయ్యిందనిపించాడు కానీ ఉద్యోగం అనేది ఒకటి చెయ్యాలి కదా. ఊళ్లేలాలన్నాబద్ధకంగా ఆ ఏం ఏలడం లెద్దూ అనుకునే వాడికి ఉద్యోగం చెయ్యక తప్పలేదు. ఓసారి ఓ ఇంటర్వ్యూలో సెలెక్టయ్యాక నా బదులు మా ఫ్రెండు ఉద్యోగం చెయ్యచ్చా అన్నాడు. ఓ భేషుగ్గా చెయ్యచ్చు కానీ జీతం వాడికే యివ్వవచ్చు మేం అని తన్నకపోయినా తగలేశారుతన్ని.

ఎంత నిష్ణాతుడయిన బద్ధకస్తుడయినా ఈ ధూర్తలోకంలో బ్రతుకు తెరువు కోసం ఓ పనికిమాలిన ఉజ్జోగమూ సద్యోగం కోసం పెటాకులు కాకుండా పెళ్లాడి ఓ సంసారమూ వెలగబెట్టి తీరాలికదా. జీవితమంతా నత్తనడకన నడవాలనే ఆశయం వున్న కచ్ఛప్‌కీ తప్పలేదు మరి. అయితే పుట్టుకతో వచ్చిన మాయరోగం పుడకల్తో తప్ప బూడిదవ దన్నారు కదా. అంచేత ఆఫీసులో ఈ పక్కా ఆ పక్కా వాళ్లని బతిమాలీ బామాలీ అదిరించీ బెదిరించీ పని అప్పజెప్పి కుర్చీలో కళ్లు తెర్చుకునే నిద్దరపోయేవాడు చూపరులకి ఎలాంటి అనుమానం రాకుండా. ఇక ఇంట్లో కూడా తన సహజ సంపదకు ఎలాంటి విపత్తూ రానిచ్చేవాడు కాదు. బల్ల మీద తన పక్కనేవున్న మంచినీళ్ల గళాసు కనిపించేది కాదు. కాళ్ల దగ్గర పడున్న రగ్గు కప్పుకోడానికి చేతులు కలిసొచ్చేవి కాదు. ముఖానికి షెవింగ్ క్రీం రాయడం దగ్గర్నుంచి ఆఫీసు బ్యాగు అందించి కాళ్లావేళ్లా పడి బయటకు తోసేసే పని చేసేది ఆ ఇల్లాలు. ఎవరయినా ఇంటికి వచ్చినప్పుడు మాట్లాడితే దవడలు నెప్పెడతాయని మొగుడు కోపగిస్తాడని తనే మానేజ్ చేసేది. బజారుకెళ్లి ఏదైనా తీసుకు రావాలని ఆవిడ అఘాయిత్యంగా మాట్లాడినా తిట్టడానికి కూడా బద్ధకమేసి అలా బెల్లం కొట్టిన రాయిలా నిలబడివుండే మొగుడ్ని ఆ యిల్లాలు ఏమీ చేయలేకపోయింది.

బద్ధకం కోసం, బ్రతుకంతా బద్దకమే తింటూ తాగుతూ బద్ధకంగా జీవిస్తున్న కచ్ఛప్‌కి నత్తా బద్ధకమూ కాక మరొక ఆసక్తి కలిగించే విషయం వుంది. అదే రాజకీయం, అసలు ఆ రోజుల్లో రాజకీయం తెలియని వాడూ, రాజకీయం మాట్లాడని వాడూ, రాజకీయం నవలని వాడు, రాజకీయం చర్చించని వాడూ రాజకీయం వూహించని వాడు ఎవడున్నాడు? అందువల్ల బద్ధకం శిఖారాగ్రాన నిలిచిన కచ్ఛప్ కూడా రాజకీయం అంటే చెవికోసుకుంటాడు. బద్ధకాన్ని త్యాగం చెయ్యడానికి కూడా వెనకాడ్డు. ప్రతి రాజకీయ నాయకుడి చరిత్రను పురావస్తు శాస్త్రజ్ఞుడిలా తవ్విపోస్తాడు. ప్రతి రాజకీయ నాయకుడి మాటలను ఒక భాషా శాస్త్రవేత్తలా నానార్థాలు విశదీకరిస్తాడు. ప్రతి బ్రేకింగ్ వార్తను రేడియాలజిస్టులా ‘ఎక్స్‌రే' తీస్తాడు. మొత్తం మీద రాజకీయాల్ని చీల్చి చెండాడి వుప్పూ మిరియాల పొడి అద్ది నిమ్మరసం పిండుతాడు. ఈ ఒక్క సందర్భంలో అతని బద్ధకం ముఖం చాటేస్తుంది. ఈ ఒక్క అవసరార్థం అతని నవరంధ్రాలూ చురుకెత్తుతవి.

లోకంలో అనేక మంది మనుషుల్ని అనేక రకాలయిన సుగుణాలతో పుట్టిస్తాడు సృష్టికర్త. అలాంటి సుగుణాల్లో ఒకటైన ఈ బద్ధకాన్ని స్వంతం చేసుకున్న కచ్ఛప్‌లు మనలో ఎందరోవున్నారు. లోకంలో నలుపూ తెలుపూ ఆడామగా ఆ జాతి ఈ మతం ఆ భాషా ఈ భాషా వంటి వర్గాలతో పాటు బద్ధకస్తులది కూడా ఓ వర్గమేనని వొప్పుకోవాలి. అన్ని వర్గాల వారికి వున్నట్టే వీరికి సంక్షేమ పథకాలు వుండాలి. బద్ధకస్తుల వర్గానికి రాజకీయ రిజర్వేషన్లు ఉండటం ఉత్తమం. పరిపాలించి హింసించే వాళ్లకంటే బద్ధకించి పరిపాలించకుండా వుండే వాళ్లు పుణ్య పురుషులు కాదా?

ఇక ఈ బద్ధకిస్టు వర్గాన్ని గురించి ఓ ముఖ్య విషయం చెప్పాలి. వీళ్లు రాజకీయాల గురించి తెగవాగు తారు కానీ, విమర్శలు విస్తారంగా విసిరేస్తారు కానీ ఎప్పుడూ పోలింగ్ బూత్‌కి వెళ్లరు. ఏం చేస్తాం? బద్ధకం. బూత్ దాకా వీళ్లని మోసుకుపోయే వాళ్లెవరున్నారీ కాలంలో. ఎన్నికల కమిషన్‌లో ఓ ప్రసిద్ధ భద్ధకస్తుడుంటే కదా వాళ్ల బద్ధకాన్ని అర్థం చేసుకోగల్గుతాడు. మన విశుద్ధ పరిశుద్ధ బద్ధకిస్టు కచ్ఛప్ కూడా ఎన్నడూ ఓటు అనేది వేయనే లేదు.

కచ్ఛప్ లాంటి పరమ బద్ధకిస్టులు ఓటు వేయకపోవడం వల్ల మంచి వాళ్లూ ప్రజలకు పనికి వచ్చేవాళ్లు ఎన్నిక కావడం లేదని బద్ధకిస్టులు పవిత్రమైన ఓటు వేసే కార్యాన్ని నిషేధించడం వల్ల ప్రజాస్వామ్యానికి నష్టం కల్గుతున్నదని, ఇలాంటి వాళ్లంతా సమాజ ద్రోహులని ప్రజా స్వామ్య విద్రోహులని ఫిజీ, చిలీ, ఈజిప్టు వంటి దేశాల్లో ఓటు వేయని వాళ్లని జైల్లో పెట్టినట్టు వీళ్లనీ జైలు పాలు చెయ్యాలని గిట్టని వాళ్లు అన్నప్పటికీ కచ్ఛప్ లాంటి బద్ధకస్తులు మారాతారా?

-చింతపట్ల సుదర్శన్

English summary
Prominent columnist Chintapatla Sudarshan in his quick boxing writes about Sloth.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X