హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చింతపట్ల క్విక్‌బాక్సింగ్: అమ్మో! మనిషి!!

|
Google Oneindia TeluguNews

పొద్దుగూట్లో పడింది.. ఊరంతా తిరిగి నానా రకాల కాగితలు కరిచి ఊరిచివర కూలిన కొంప అరుగు మీదకి చేరి చీకట్లో తడుముకుంటూ తన జాగాలో చతికిలబడ్డది గాడిద. అప్పుడు వినపడ్డది దాని పెద్ద చెవులకు ఓ చప్పుడు అదో మూలుగు. మొదట్లో ఎంతో దూరం నించి వినపడ్డట్టనిపించింది గానీ వినగా వినగా తనకు అతి దగ్గర్నించి వినపడ్డది మూలుగు పెద్దదయి స్పష్టంగా.

ఎవరది? డాగీ మై ఫ్రెండ్ నువ్వేనా? వాట్ హేపెండ్. ఎందుకా సుదీర్ఘ మూలుగు అనడిగింది.

‘కాబోలూ దోస్త్! ఆం సూభరీ ఎ జీవన్ కి రాహే కొఈ ఉన్ సె కహదే హమేభూల్ జాయే' అన్నది డాగీ.

నీకు బాధొచ్చినప్పుడు పాత హిందీ సిన్మా పాటల్తో బాత్తావు గానీ విషయం చెప్పరాదూ అంది యాసీ.

రోజూ మాంసం కొట్టు ముందర షాపువాడు విసిరేసిన మాంసరహిత ఎముకలు నమిలి దవుడలు దగ్గర పడుతున్నాయని, ఇవేళ ఆదివారం కనక స్పెషల్‌గా తిందామని ధైర్యే సాహసే మాంసంగా శునకమా అనుకుని కళకళలాడే మాంసపు ముద్ద ఒకటి అందుకుని దౌడ్ తీశా రన్ రాజా రన్ అంటూ.

ఇంకేం అంతలావు ముక్కా ఆబగా ఆదరాబాదరా మెక్కడం వల్ల ఆయాసం రావడం వల్లనా ఈ మూలుగు అన్నది గాడిద.

కుక్క తోకతో దోమల్ని ఇసురుకుంటూ గాడిద జోకులొద్దు. ఆ షాపువాడు కర్ర పుచ్చుకుని వెంట పడి నా నడ్డి విరగొట్టి మరీ కక్కించాడా మటన్ పీసుని ఆడి జిమ్మడిపోను ఆడి షాపు తగలడిపోను అని శాపనార్థాలు పెట్టింది.

ఆరెరే అయాం సారీ! ఆడుకొడ్తుంటే ఎందుకూరుకున్నావ్ ఎదురుతిరిగి పిక్క పట్టుకోలేదూ. బొడ్డు చుట్టూ ఇంజక్షన్లు గుచ్చుకునేవాడు చావు భయంతో.

వాడి చేతిలో కర్ర వుంది కదా ఏం చేయను. అయినా దేవుడ్ననాలి. ఈ మనిషిని మనలాంటి జంతువుల మీద దౌర్జన్యానికి పుట్టించాడు అని విచారపడ్డది కుక్క.

ఇది టీవీల్లో చర్చించదగ్గ పాయింటు. నేను వయస్సులో వున్నప్పుడు నా వెనక కాళ్లల్లో ఎంత బలముండేదో. ఏం లాభం? నా యజమాని నాతో ఎంతెంత బరువులు మోయించేవాడో. ఏదో ఒక రోజు నా వెనక కాళ్లతో లాగిపెట్టి తన్నివాడి రెండు పదహార్ల పళ్లూ రాలగొడ్దా మనుకునే వాడ్ని కానీ ఆ కోరిక తీరనే లేదు. అసలు ఈ మనిషి జబర్దస్తీ ఏమిటి దాదాగిరీ ఏమిటి మన మీద అని అడిగాను నాతోపాటు వుండే గుర్రాన్ని.

నీతోపాటు మీ యజమాని దగ్గర ఓ గుర్రం కూడా వుండేదా? అది అచ్చం నీలాగే వుండేదనుకుంటా?

పోలీకలున్నంత మాత్రాన ఏం లాభం. గాడిద గాడిదే గుర్రం గుర్రమే కదా. మా యజమాని దాని మీద ఎక్కి సవారీ చేసేవాడు. తిండి కూడా పెట్టేవాడనుకో. దాని పొజిషన్ క్లాస్ వన్ ఆఫీసర్దాయె.

మరి మీ ఇద్దరికీ ఫ్రెండ్ షిప్ ఎలా వీలయింది అనడిగింది కుతూహలంగా కుక్క.

కామన్ ప్రాబ్లమ్. మనిషి చేతిలో హింస పడుతున్న వాళ్లం. అందుకే కష్టాలు చెప్పుకునేవాళ్లం. అసలు మై డియర్ హార్స్, నీకింత హార్స్ పవరుంది కదా నువ్వా మనిషిని నీ మీద ఎక్కించుకు తిప్పడం దేనికి, వాడంటే నీకెందుకు భయం అని అడిగా.

కుక్క ఓ పొడుగాటి మూలుగు మూల్గి అసలీ మనిషి గొప్పేమిటో అర్థం కాదు. కుక్క, గాడిద, గుర్రమేమిటి అంత పెద్ద ఏనుగు, పంజా విసిరే పులీ, మృగరాజు సింహమూ కూడా వీడికి లొంగిపోవడం ఎందుకో? దేవుడ్ననాలి అన్నది.

అవును మిగితా జంతువులన్నింటినీ నాలుక్కాళ్ల మీద వంగో బెట్టి వీణ్ణి మాత్రం తన ఆకారంతో తయారు చేసి చేతులిచ్చి నిలబెట్టాడు. వీడికి మనకున్న బలం లేకపోయినా మన బుర్రలో మట్టి కూరి వీడి బుర్రలో మరేదో కూరాడు. ఆదాంతో మన్నివీడు సాధించి వేధించి వేపుకుతింటున్నాడు అంటూ నిట్టూర్చింది గాడిద.

ఇంతకీ నీ గుర్రం ఫ్రెండ్ తనకు మనిషంటే భయమెందుకో చెప్పిందా.

చెప్పింది. తనకు వాళ్ల తాతో ముత్తాతో చెప్పిన కథ చెప్పింది. గుర్రపు జాతి మనిషిని తమ వీపుల మీద మోస్తూ తిరిగాల్సిన ఖర్మం ఎందుకు కలిగిందో డీటెయిల్‌గా టెయిల్ వూపుతూ చెప్పింది.

అదేమిటో నాకూ చెప్పవా. ఈ మూలుగుళ్లు ఆపి శ్రద్దగా వింటాను. మన దగ్గర సీపింగ్ పిల్సువుండవు కనక నిద్దరెట్లాగూ పట్టదు కదా అంది డాగీ.

సరే విను గుర్రం చెప్పిన కథ అంటూ బిగిన్ చేసింది గాడిద.

Chintapatla quick boxing: satire on human beings

అనగనగా చాలా అనేకం యేళ్ల కింద దేవుడనే వాడు మొదట్లో భూమినీ ఆకాశాన్నీ సృష్టించేడు ఆ తరవ్ాత చెట్టూ చేమల్నీ గొడ్డూ గోదల్నీ సృష్టించేడు. ఆ పిదప తనలాగే వుండే మనిషిని లోకంలోకి ప్రవేశ పెట్టేడు. వాడికి జంతువులకి వున్న బలంలో సగమూ పావూ కూడా లేవు కానీ నక్కను మించిన జిత్తులు వాడి సొత్తు. పులులూ సింహాలని మించిన క్రూరత్వం వాడి ఆస్తిపాస్తులు. అయితే యివేవీ పైకి కనిపించని దొంగనా కొడుకు వాడు.

దేవుడు సృష్టించిన వాటిల్లో గుర్రం ఒకటి. మొదట్లో తనెందుకు పుట్టిందీ, ఏం చేయాల్సిందీ అర్థం అవలేదు. అంత ఎత్తూ ఒడ్డు పొడుగూ వున్నప్పటికీ తనకు దేవుడిచ్చిన మెనూ కార్డులో గడ్డీ గాదమూ గుగ్గిళ్లూ నీళ్లు తప్ప మాంసం లేనేలేదు. సరే పచ్చని గడ్డి మైదానాల్లో గడ్డిన ముత్తావుంటే తెలిసొచ్చిన తన కాళ్లల్లో ఎంతో పవరుందని ఎంత దూరమైనా అవలీలగా వీజీగా ‘రన్' చెయ్యగలదనీ. ఇంకేం గ్యాలపింగ్ చేస్తూ రన్నింగ్ చేస్తూ అడివంతా కలియతిరగేది. అలా జాలీగా జిందగీని ఎంజాయ్ చేస్తున్న గుర్రం ఓ నాడు ఓ భయంకరమైన శబ్ధం విని అలా బొమ్మలా నిలబడిపోయింది. చుట్టూ వున్న చెట్ల మీది పక్షులు ఎగిరిపోయినయి. చిన్నా చితకా జంతువులు పత్తా లేకుండా పోయేయి. గుర్రం ఎదురుగ్గా నుంచున్న జంతువు మళ్లీ గర్జించింది. గుర్రం వంట్లో వొణుకొచ్చింది. నేను సింహాన్ని. ఈ అడవికి రాజుని. నేను నాన్ వెజిటేరియన్ని. ఈ అడవిలోని అన్ని ప్రాణుల్నీ రుచి చూశాను కానీ నిన్నిప్పుడే చూస్తున్నా. బాగాకండ పట్టి వున్నావు. కడుపునిండా తింటాను అన్నది సింహం.

నేనా నేను గుర్రాన్ని. నీ ఆకారమూ ఆర్భాటమూ గర్జనా చూస్తుంటే నన్ను తింటావన్నది అర్థమవుతున్నది. అయితే నా లెగ్ పవర్ నీకు తెలీదు. నేన్నీకు చిక్కను దొరకను అంటూ పరుగుతీసింది గుర్రం.

పంజావేటు దగ్గరకు వచ్చి చిక్కకుండా పోతున్న గుర్రాన్ని పట్టుదలగా వెంటాడ సాగింది తన భారీ బాడీతో ‘ద లయన్'.

అడివంతా తిరిగిందే తిరిగి అలుపొచ్చింది గుర్రానికి ఈ సింహం తన్ని స్వాహా చేయకుండా వొదిలేట్టు లేదు అనుకుంటున్న టైంలో ఎదురుగా నిలబడి కనపడ్డాడు మనిషి.

ఎవర్నువ్వు అన్నది గుర్రం సింహం ఏ పక్కనించైనా వస్తున్నదేమోనని రెండు వైపులావున్న కళ్లతో రెండు పక్కల్నీ గమనిస్తూ.

మనిషి చిరునవ్వు నవ్వుతూ సుతిమెత్తగా చెప్పాడు నేను మనిషిని. నన్ను పరోపకారి పాపన్న అని కూడా అంటారు. ఆపదలో వున్న వాళ్లను ఆదుకోవడం నా రుచీ అభిరుచీ అన్నాడు మనిషి, అని ఆగకుండా తనే మళ్లీ. ఇంత పెద్ద పర్సనాలిటీ వున్న నువ్వు చెమట్లు కక్కుతున్నావంటే నీకేదో ఆపదొచ్చింది. అదేంటో చెప్తే నేను నిన్ను గట్టిక్కిస్తాను అన్నాడు.

అదేదో సింహం అట. నన్ను నిమిలితినేస్తానంటూ వెంట పడ్డది. దానికంట పడితే నిన్నూ నాతోపాటు ‘లంచ్'లో మంచింగ్ చేస్తుంది. నా ముందరి కాళ్లతో ఒక్క కిక్కిస్తే లుక్కుకి లేకుండా పోతావు అనిపిస్తుంది నువ్వేం చెయ్యగలవు అంది గుర్రం.

అలా గనుక నన్ను అండర్ ఎస్టిమేట్ చెయ్యకు. పైకి కనిపించేలా వుండను నేను. దేవుడు తనకు మారుగా మనిషిని పుట్టించింది నీలాంటి వారిని ఆపదలో ఆదుకోవడం కోసమే. నువ్వు ఎంత ఉరికినా ఈ అడవిలో ‘సేఫ్టీ' లేదు. ఎప్పటికైనా సింహానికి చిక్కిపోతావు. రా! నాతో వస్తే నిన్నమావూరికి తీసుకుపోతా. తిన్నంత గడ్డీ తినిపిస్తా! అక్కడికి సింహం రాలేదు. నీ ఎంజాయ్‌మెంట్‌కి ఢోకా లేదు అన్నాడు మనిషి కళ్లల్లో ప్రేమా జాలీదయా ఉట్టి పడుతుంటే.

దగ్గర్లో సింహగర్జన వినపడింది. ఉలిక్కి పడ్డది గుర్రం. నన్నేం చెయ్యమంటావు అన్నది గుర్రం భయం భయంగా.

నీకేం భయం లేదు. కాస్త ఒంగో నేను నీ వీపు మీద కూచుని నీ చెవులు పట్టుకుంటాను. వాయువేగంతో పరుగెత్తు అడవిదాటి మా ఊళ్లో మా ఇంటికి చేరేదాకా ఆగకుండా పరుగెత్తు అంటూ గుర్రం వీపెక్కి దర్జాగా కూచుని దానిడొక్కలో ఒక్క తన్ను తన్నాడు. గుర్రం ఊరి వైపు ‘దౌడు' తీసింది. అలా గుర్రాల వీపుల మీద ఎక్కి మనిషి ఈ నాటికీ దిగకుండా స్వారీ చేస్తూనే వున్నాడుట.

వింటున్నావా అన్నది గాడిద. ఊఊ అన్నది కుక్క. నా యజమాని గుర్రం చెప్పిన కథ విన్నాక నాకు మనిషంటే అసహ్యం వేసింది. అప్పటికే వయసైపోయిన నేను బరువులు మోయలేకపోవడంతో యజమాని నన్ను నాలుగు పీకి బయటకు గెంటేశాడు. మనిషంతే ఓడ ఎక్కేటప్పుడు ఓడ మల్లన్నంటాడు ఒడ్డు చేరాక బోడి మల్లన్నంటాడు పడుకో పోద్దు పోయింది అని గురక మొదలెట్టింది ఏఎస్ఎస్.

- చింతపట్ల సుదర్శన్

English summary
Prominent columnist Chintapatla Sudarshan in his quick boxing heckled the attitude of human being.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X