వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చింతపట్ల క్విక్ బాక్సింగ్: ‘ట్వంటీఫోర్ అవర్స్’

|
Google Oneindia TeluguNews

ప్రతి కాలవకీ ఓ పేరు ఉన్నట్టుగానే ప్రతి టీవీ ఛానల్‌కీ ఓ నేమ్ వుంటుంది. ఇప్పుడు మనం వీక్షించబోయే ఛానల్ ‘ట్వంటీఫోర్ అవర్స్' ఇదో సరికొత్త ఛానల్. దీంట్లో ఇరవై నాలుగ్గంటలూ లోకంలో వున్న అన్ని అనేక విషయాల మీద పైన గురించిన నిర్విరామ చర్చలు ప్రసారమవుతయి. అడ్వర్టయిజుమెంట్లు వుండవు. అడపాదడపా అప్పుడో ఇప్పుడో వివిధ రకాల తల నెప్పి మాత్రలు, బామ్‌లకు సంబంధించినవి మాత్రం వుంటాయి.

‘ఈ ట్వంటీఫోర్ అవర్స్' ఛానల్‌లో చర్చలు వివిధ హెడ్డింగ్‌ల కింద ప్రసారం అవుతాయి. ‘నాన్‌స్టాప్ హెడ్‌ఏక్', ‘కొట్టుకు చావండి', ‘ఒకటి నువ్వంటే పది నేనంటా', ‘పారిపోండి.. పారిపోండి', ‘కుర్చీక్కట్టేస్తాం', ‘వింటారా ఛస్తారా', ‘బ్రతికుంటే వినండి' వంటివి బాగా పాపులరైనవి.

చర్చలు.. చర్చలు.. చర్చలు.. చర్చలకు అర్హం కాని సంగతనేదే వుండదు. చర్చలకు పనికి రాని చెత్తా చెదారమనేదే వుండదు. మరి ఇరవై నాలుగ్గంటలూ చర్చించుకోవడానికి ఎన్నెన్ని సంగతులు కావాలి. ఎన్ని పోగు చెయ్యాలి. ఎన్ని తగులబెట్టాలి. ఎన్ని వండి వర్చాలి. ఆషామాషీ వ్యవహారం కానేకాదు కదా.

చర్చించడానికి సంగతులు సరే ఒత్తుగా నెత్తిమీద జుత్తున్న వాడి వెంట్రుకలన్ని వున్నవే అనుకుందాం. అయితే చర్చించే వాళ్లుండద్దూ. చర్చించడానికి ఒకటో అరో బట్ట తలల వాళ్లు వుండలి కదా. కాస్తాకూస్తా తలపండిన వాళ్లు నలుగురూ గుర్తుపట్టే ముక్కూ ముహం వున్నవాళ్లు అవసరం కదా. మళ్లీ వీళ్లల్లో కొందరు మొండి ఘటాలూ, కొందరు గాండ్రించే వాళ్లూ, కుందేలుకి మూడే కాళ్లని ఒప్పించే వాళ్లూ, నోరు నెత్తిన పెట్టుకునే వాళ్లూ, గయ్యిమనే వాళ్లూ, అవతలివాళ్ల నోళ్లు మూయగలిగే వాళ్లూ, కస్సుబుస్సుల వాళ్లు అలిగి అవోఇవో పగలేసే వాళ్లూ అవుసరం కదా. ముఖ్యంగా వీళ్లందరికీ ‘ఫేస్ వాల్యూ' వుండి తీరాలి. టీవీ తెరపై కనపడగానే వీడా వెధవ జిడ్డుగాడు, వీడో పోరంబోకు, మందు మీదున్నట్టున్నాడు, వీడో ఓవరాక్షన్ అని అనుకునేట్టు వుండాలి.

Chintapatla Quick Boxing: twenty four hours

‘ట్వంటీ ఫోర్ అవర్స్' ఛానల్‌లో అప్పుడప్పుడూ ప్రేక్షకుల్ని పరీక్షించే ప్రశ్నలు మెరుస్తుంటయి. యస్ ఆర్ నో అని అడిగి చంపుతయి. యస్ ఎంత శాతం మంది అన్నారో, ‘నో' ఎంతశాతం మంది వప్పుకున్నారో గింగిరాలు తిర్గుతుంటయి. ప్రస్తుతం ‘రోజుకి ఇరవై నాలుగ్గంటలు వుండాలా?' అన్న ప్రశ్నికి ఏభయి శాతం మంది ‘యస్' అన్నారు. మిగిలిన యాభయి శాతం ‘నో' అన్నారు. ఇలాగే గంటకు అరవై నిమిషాలే వుండాలా? నిమిషానికి అరవై సెకన్లు వుండాలా? వంటి ప్రశ్నలకు ఎంతమంది ‘యస్' అంటారు. తుమ్మితే ఇల్లు కదలాలా?, పిల్లి ఎదురయితే ఏం చేయాలి? లాంటి ప్రశ్నలకి ఎంత మంది ‘నో' అంటారు లాంటి ప్రశ్నలు ఎన్నో ప్రసారమవుతయి. సగం మంది జనం ఇటు లాగుతారు. సగం మంది అటు లాగుతారు. ఇట్లా చొప్పదంటు ప్రశ్నలు వేసి జనంచేత యస్ నో లాగుళ్లు లాగించడం ఈ ట్వంటీఫోర్ అవర్ష్ ఛానల్‌కి ఓ సరదా ఓ తమాషా హమేషా. రోజుకు ఇరవై నాలుగ్గంటలు వుండాలా అన్నదానికి తొంభై శాతం మంది ‘నో' అన్నారే అనుకుందాం. అప్పుడేమవుతుంది ఏమీకాదు. రోజుకు ఇరవై నాలుగ్గంటలే వుంటయి మార్పేమీ వుండదు.

సంచలనాల ఛానల్ ‘ట్వంటీఫోర్ అవర్స్' చర్చలకు పెద్ద పీట ఛానల్ ‘ట్వంటీఫోర్ అవర్స్'లో ఓ పెద్ద చర్చ జరుగుతున్నది. ఓ ముఖ్య చర్చ జరుగుతున్నది. ఓ తలలు బద్దలయ్యే చర్చ జరుగుతున్నది. వింటూ ఇంట్లో చెలరేగిపోయేటటువంటి తింటూ వుండే పళ్లాల్ని విసిరేసి పోయే టటువంటి రియాక్షన్లు సాధించే ఛానల్‌లో జరుగుతున్న చర్చ ఇప్పుడు దేవుడు వున్నాడా? అన్న గంభీరమైన అగాధమైన, ఆగమ్యగోచరమైన విషయమ్మీద అనర్ధవంతమయిన చర్చ కొనసాగుతున్నది. చర్చలో పాల్గొనడానికి పిలవబడ్డ నలుగురు ఉద్దండ ప్రచండ ప్రకాండులు ఇద్దరు రాకపోవడంతో, స్టూడియో గేటు ముందే తచ్చాడుతూ, ఏదో ఓ సమయంలో తమ అవసరం వచ్చుద్ది గదా, ఏ విషయమైనా సారే పీకీపాకం పెట్టే చర్చ చేయడం తెల్సిన వాళ్లల్లోంచి ఇద్దర్ని స్టూడియోలోకి లాక్కు వచ్చారు. లాక్కు వచ్చిన వాళ్లల్లో ఒకరికి కాషాయం లుంగీ చుట్టారు ‘ఎఫెక్టు' కోసం. దేవుడున్నాడా అన్న దానికి ఉన్నాడున్నాడని ఓ జత లేడుగాక లేడు అండానికి ఓ జత లంకించుకున్నారు.

దిక్కులేని వాడికి దేవుడే దిక్కు అన్నారు. లోకంలో దిక్కులు నాలుగయితే అయిదో దిక్కు దేవుడు, అన్నాడు దేవుడి కోసం దేవుళ్లాడ్తున్న వాడు. దేవుడా? దేవుడనగా నెవవు? ఎవడో తెలియని వాడి కోసం దేవుళ్లాడ్డ మెందుకు అన్నాడు దేవుడి పొడగిట్టనివాడు. దేవుడు లేడన్న వాడి కళ్లు పోతయి కాళ్లు పోతయి అని శాపనార్థాలు పెట్టాడు కాషాయం టెంపరరీగా చుట్టుకున్నవాడు. పిల్లి శాపానికి ఉట్టి తెగిపడుద్దా? అని వెక్కిరించాడు ఈ సైడు పుచ్చుకున్నవాడు. పైగా అసలు దేవుణ్ని నువ్వు చూశావా అని కౌంటర్ క్వశ్చన్ వేశాడు. ఫ్యాన్ వేస్తే గాలి రావడం లేదా? విసినికర్ర విరిగితే గాలి వీయడం లేదా? రావడం వస్తుంది వీయడం వీస్తుంది గానీ గాలి కనిపిస్తుందా? దేవుడూ అంతే! అన్నాడు. ఈలోపున యాంకర్ అందిపుచ్చుకుని ఫోన్లో దేవుడ్ని బాగా దేవులాడిన భక్తుడిని వినిపించాడు.

హలో! అక్కడున్న వాళ్లందరికీ నమస్కారం. నా పేరు రామదాసు. ఖచ్చితంగా దేవుడున్నాడన్న నమ్మకంతోనే కదా గుడికట్టాను అన్నాడు. కట్టావులే మున్సిపల్ పర్మిషన్ వుందా అసలు, ప్రభుత్వం సొమ్ము ఎంతకట్టావ్ ఎంతమింగావ్ అని గయ్యిమన్నారు దేవుడి పేరువింటే అగ్గినిప్పయ్యేవాళ్లు. అస్సలు మమ్మల్ని మాట్లాడనివ్వండి మీరుమాట్లాడింది విన్నాం కదా మేం మాట్లాడింది వినండి అని మండిపడ్డారు దేవుడి వకాల్తా పుచ్చుకున్నవారు. అసలు సంగతి అడుగుదాం రామదాసు గారూ మీకు దేవుడు కనిపించాడా సూటిగా చెప్పండి అనడిగాడు యాంకర్. కనిపించాడు నాకు బందిఖానాలో కొరడా దెబ్బల్లో. కానీ నిజంగా తానీషాకు కనిపించి లోన్ క్లియర్ చేశాట్ట అన్నాడు రామదాసు.

చూశారా ఎవరికి కనిపించాలో కూడదో కూడా తెలీనివాడు దేవుడా అని లాగి బల్లను కొట్టాడు ‘గాడ్'కి ఆగినిస్టుగాడు. అసలు ఉండాలి కదా కనపడ్డానికి అన్నాడింకో గొట్టంగాడు. చర్చ తారాస్థాయిని అందుకుంది. రాందాసు సందుచూసుకుని ‘గాయబ్' అయ్యాడు. మరో ఒకరిద్దరు దేవుడ్ని చూసినవాళ్లూ చూడని వాళ్లూ ఫోన్లో వూగులాడి వూడిపోయారు. లైన్లు కట్ అయ్యాయి. చర్చించుకునే వాళ్ల దగ్గర మాటలు అయిపోయేయి. చేతులు యాక్షన్‌లోకి దిగే సమయం వచ్చింది. యాంకర్‌కి దడపుట్టుకొచ్చింది. సమయం అయిపోయింది అరేరే! దేవుడు వున్నాడో లేదో తేలనే లేదు. తేలినా తేలకపోయినా ఇలాంటి చర్చలే ట్వంటీఫోర్ అవర్స్‌లో ప్రసారం చేస్తాం పున:ప్రసారం చేస్తూనే వుంటాం అంటూ ముగించాడు. ‘ట్వంటీఫోర్ అవర్స్' ఇదో సరికొత్త ఛానల్ అంటూ తెరమీద ఉరుములు ఉరిమేయి. మెరుపులు మెరిసేయి. మరో చర్చా కార్యక్రమం మొదలవబోతున్నదని ‘బాక్స్'లు బద్దలయ్యేయి.

- చింతపట్ల సుదర్శన్

English summary
A prominent columnist Chintapatla Sudarshan has heckled Telugu news chennels in his column Quick Boxing.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X