వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

క్విక్ బాక్సింగ్: లక్ష్మీ విలాసం

|
Google Oneindia TeluguNews

పొద్దున్నే నిద్దరలేచి బద్ధకంగా ఆవలిస్తూ పిలిచాడు హజ్బెండు. ‘లక్ష్మీ! లక్ష్మీ!' అంటూ..

సమాధానం రాలేదు. అప్పుడు కళ్లు పూర్తిగా తెరిచిన భర్తకు గుర్తొచ్చింది భార్య ఇంట్లో లేదని. అసలు ఇంటికి రాక చానాళ్లయ్యిందనీ.

ఏమిటో అప్పట్లో మోజుపడి చేసుకున్నాడు గానీ ఈ లక్ష్మిందేవి గారికి ఇరువయినాలుగ్గంటలూ డ్యూటీ వుంటుందని తెలీదు కదా. ఏ భర్త అయినా ఉజ్జోగం చేసే భార్య సాయంత్రానికో రాత్రికో తిరిగొస్తుందని ఎదురు చూస్తాడు గానీ ఇలా రోజుల తరబడీ గంటల కొద్దీ ఒక్క సెకను కూడా తీరిక లేకుండా ఒక్క చోట ఉండకుండా ఉన్న చోట నిలవకుండా ఉరుకులూ పరుగులూ పెట్టే పెళ్లాంని ఏ మొగుడయినా ఎక్కడ పట్టుకోగలడు.

ఏవైనా సరే ఇవాళ లక్ష్మిని చూసి తీరాల్సిందే. ఎన్నాళ్లయ్యిందో. కూచున్న చోట పిలిస్తే పలక్కపోతే వైఫ్ ఎక్కడుందో అక్కడికే వెళ్లి కళ్లారా చూసుకోవడటమే మంచి మార్గం అనుకున్నాడు హజ్బెండు. అంతే ఆవిడ గార్ని వెదుక్కుంటూ రోడ్లు పట్టుకు తిరగసాగాడు.

quick boxing chitntapatla sudarsan on cash transactions

లక్ష్మీ! లక్ష్మీ! అని అరుస్తూ వెళ్తుంటే ‘ఓయ్' అని వినిపించింది ఎక్కడ్నించో.

హమ్మయ్యా! ఇక్కడే ఎక్కడో వుంది. నా పిలుపు వినిపించింది. లక్ష్మీ లక్ష్మీ అని ఆనందంగా గావుకేక పెట్టాడు.

‘ఓయ్' అని మళ్లీ జవాబు వచ్చింది కానీ మనిషి అజాపజా లేదు.

ఓయ్ ఓయ్ అని అనకపోతే ఎక్కడున్నావో చెప్పరాదోయ్.

ఇక్కడేనండీ ఈ బైక్ వెనక పిజ్జా డెలివరీ చేసే డబ్బాలోవున్నా.

రయ్యిమని దూసుకుపోతున్నాడి పిజ్జా డోర్ డెలివరీ బాయ్ వాడి బండికి తగిలించి వున్నది నీలి రంగు డబ్బా. ఈ డబ్బాలో వుందా నా బెటరాఫ్. ఎంతకష్టం వచ్చింది నీకు అనుకుంటూ ఆ డబ్బా వెనకాలే పరుగెత్తాడు పాపం పతి దేవుడు.

చాలా దూరం పరుగెత్తాక అనుమానం వచ్చింది. లక్ష్మిదసలే చంచల స్వభావం. కుదురుగ్గా ఒక్క చోట వుండదు కదా ఎందుకేనా మంచిదని మళ్లీ పిల్చాడు లక్ష్మీ! లక్ష్మీ! అని.

‘ఏమండీ' అని జవాబు వచ్చింది. కానీ పిజ్జా బోషాణంలోంచి కాదు.

ఎక్కడున్నావు లక్ష్మీ అనడిగాడు.

ఇదిగో ఈ అంబులెన్స్‌లో వున్నానండీ అంది లక్ష్మి నీరసంగా.

కుంయ్ కుంయ్ మంటూ వెళ్తున్నది అంబులెన్స్.

దాంట్లో ఏం చేస్తున్నావు లక్ష్మీ ‘ఆర్‌యూ‌ఓకే' అన్నాడు ఆదుర్దాపడుతూ.

అయామ్ ఆల్‌రైట్ నన్ను ఓ చోట్నించి మరో చోటుకి పంపడానికి రకరకాల ఉపాయాలు వీళ్లకి. ఇదుగో ఇలా అంబులెన్స్‌లో పడేశారు అంది లక్ష్మి.

ఏమైనా సరే లక్ష్మిని యివ్వాళ చూసి తీరాల్సిందేనంటూ పరుగుతీశాడు పతి.

కాస్సేపయ్యాక పారేనీరూ లక్ష్మిందేవి ఒక్కటే కనుక వున్నచోటే వుందో లేదో కనుక్కుందామని మళ్లీ కేకేశాడు లక్ష్మీ! లక్ష్మీ! అని.

‘క్షేమంగానే వున్నా డియర్' అన్నది లక్ష్మి. కానీ జవాబు వచ్చింది అంబులెన్స్‌లో నించి కాదు.

ఎక్కడున్నావు లక్ష్మీ అనడిగాడు ఏదో వాసన ముక్కపుటాల్ని అదరగొడ్తుంటే.

వాసన గుప్పుమంటుంది కదూ! ఇదిగో ఈ మందు కార్టన్‌ల వ్యానులో వున్నాను. బీర్ బ్రాండీ విస్కీ రమ్ము జిన్ను అట్టపెట్టెల మధ్య. సీసాలకు సీళ్లు సరిగ్గాలేవో, నిఖార్సయిన సరుకు కాదోమరి ఎక్కడ ఏ బాటిల్ లీకో కానీ వాసనతో వుక్కిరిబిక్కిరి అవుతున్నా అంది లక్ష్మి మైకంగా.

తన ముక్కుని అదరగొడ్తూ వెళ్తున్న మందు డబ్బాల వ్యాన్‌ని కొంచెం దూరం నుంచి ఫాలో అయ్యాడు పూర్ ఫెలోవ్.

ఆ రోజంతా అలా లక్ష్మీ లక్ష్మీ అని పిలుస్తూ ఫాలో అయిపోయేడు.

ఒకసారి అయిక్రీంల బండీలోంచి ఓయ్ అంది ఒకసారి శవపేటికలోంచి ఓయ్ అంది ఓసారి బేకరీనించి బయటకు వచ్చిన ‘కేక్' డబ్బాలోంచి ఓయ్ అంది. ఓసారి ఆకు కూరల గంప అడుగునుంచి ఓయ్ అంది. కారు డిక్కీలోంచి స్కూటర్ డిక్కీలోంచి లారీ కడుపులోంచి నీళ్ల టాంక్ లోంచి ఎక్కడెక్కడ్నించో వోయనీ ఏమండోయనీ, ఏమిటండీ అని జవాబు ఇస్తూనే వుంది. ఇందుగలదందు లేదు ఎందెందు వెదికిన అందందే గలదు అనిపిస్తూనే వుంది. కనిపించినట్టే కనిపించి మాయమై పోతూనే వుంది.

చివరకు విసుగొచ్చి వచ్చిన్నాడే వచ్చును. చూసిన్నాడే చూడవచ్చును అనుకుంటూ ఆఖరుసారిగా ఆశగా కేకేశాడు లక్ష్మీ! లక్ష్మీ! అని.

ఏమండోయ్ శ్రీవారూ అని జవాబిచ్చింది లక్ష్మి. ఎంతో లోతునుంచి వచ్చిన శబ్దం అది భయం భయంగా బిక్కుబిక్కుమంటూ వచ్చిన ధ్వని అది.

ఎక్కడున్నావ్ లక్ష్మీ ఎక్కడ అనడిగాడు.

ఇంకెక్కడండీ! ఇక్కడే! మీ జన్మ స్థలమే. శ్రీకృష్ణ జన్మస్థాన మంటారు గదా! అంటే? క్లియర్‌గా చెప్పు లక్ష్మీ. పోలీసోళ్లు పట్టుకున్నారు స్వామీ. ఇక్కడ స్టేషన్లో టేబిల్ మీద కట్టలు కట్టలుగా బొత్తులు బొత్తులు అరలు అరలుగా పరిచారు లాకప్ రూంలో పెట్టి తాళం వేశారు అన్నది లక్ష్మి.

కిటికీలోంచి తొంగిచూశాడు భర్తా పతీ హజ్బెండు ఆయన వాళ్లాయన.

నిన్ను ఇక్కడ ఇలా చూస్తాననుకోలేదు లక్ష్మీ అన్నాడు లక్ష్మి మొగుడు విష్ణు మొగుడూ విష్ణు దేవుడూ కాబట్టి ఏడవడం బాగోదని కన్నీళ్లు ఆపుకుంటూ.

బాధపడకండి. ఎలెక్షనన్నాక ఎక్‌స్ట్రా డ్యూటీలు, ఎమర్జెన్సీ డ్యూటీలూ, అడ్డమైన డ్యూటీలు, అడ్డగోలు డ్యూటీలు ఎవరికీ తప్పవండీ పోలీసుల కయితేనేం గజిటెడ్ అధికారుల కయితేనేం, స్కూల్ మాస్టర్ల కయితేనేం ఆఖరుకి మీ అర్ధాంగినైన నాకు అంటే లక్ష్మీ దేవికీ అయితేనేం ‘డ్యూటీ ఈజ్ డ్యూటీ' అంది లక్ష్మి.

ఆయనగారేమో కైలాసంలో పార్వతీ మేడమ్‌తో హాయిగా డాన్స్ ప్రాక్టీసు చేస్తుంటాడు. ఈయన గారేమో బ్రహ్మ లోకంలో బొమ్మల తయారీలో బిజీ బిజీగా వున్నా సరస్వతీ టీచర్ వీణాగానం వింటూ ఎంజాయ్ చేస్తుంటాడు. వైకుంఠంలో వుండే నాకే నా ఈ ‘ఎలెక్షన్ దెబ్బ' అనుకుంటూ ‘సెవన్ ఎవన్యూ' వైపు వెళ్లిపోయాడు విష్ణువు.

-చింతపట్ల సుదర్శన్

English summary
Prominent columnist Chintapatla Sudarshan writes about cash transactions on election time.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X