వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చింతపట్ల క్విక్ బాక్సింగ్: నీవే రాజువట!

By Pratap
|
Google Oneindia TeluguNews

ఎవరమ్మా ఇంట్లో?
బాబూ ఎవరండీ లోపల!
తలుపు బాదుతున్నారెవరో అరిచేత్తో. కరెంటు కోతకి నిద్ర పట్టక దొర్లుతున్న ఓటరు విసుక్కుంటూ తలుపు తీశాడు.

లోపల్కిదూరి మూసుకున్న ముక్కు తెరిచాడు వచ్చినవాడు.

ఎవరు? తమరెవరు? అన్నట్టు చూస్తున్న ఇంటాయనతో..
మీ ఇంటికి ఆనుకుని వున్న మురిక్కాలువ కంపుకి ఊపిరాడక తలుపు ఇరగ బాదినా. ఏమి అనుకోకు. అన్నాడు వచ్చినవాడు.

ఏమి అనుకోనులే చెప్పు వచ్చిన సంగతేమిటో అన్నాడు తలుపు తీసినవాడు.

ఉన్నట్టుండి
‘ఓటు వెయ్యి సామిదేముడా
నన్నేలు సామి
ఓటు వెయ్యి సామిదేవుడా'
అని ఆటాపాటాలంకించుకున్నాడు. లోపలి గదుల్లోకి చూస్తూ ఆటాపాటకు బ్రేకిచ్చి యింకా ఎన్ని ఓట్లు వున్నాయిలోపల అని అడిగాడు.

ఓట్లు అడుక్కోవడానికి వచ్చినోడివా. వార్నీ నేనెవరో అనుకున్నా. ఒక్కడివే వచ్చావేం. మందని వెంటేసుకురాలేదా? అన్నాడు ఇంటి వోనరూ వోటరూ.

ఇంటిముందు మురిక్కాల జూసి ఆగిపోయినారు. ప్రాణాలకి తెగించి నేనొచ్చేశా!
అబ్భా! ఆశ్చర్యపడ్డాడు ఓటరు. లోపల్కి తొంగిచూడక్కర్లేదు. ఇంట్లో వున్న డజన్ వోట్లూ వూళ్లో పన్లు చేసుకుందుకు పోయేయి.

Quick boxing: Chitntapatla Sudarsan on politicians

ఆ! డజనోట్లా అని నోరు తెరిచాడు వచ్చివాడు ఓటడగవచ్చిన వాడు.

అవునయితే యేం. మేమీతూరి ఓట్లే ఎయ్యం! అని బాంబు వేశాడు ఓటరు.

అంతమాటనకు అంటూ గడ్డం పుచ్చుకు బతిమాలసాగాడు లీడరు.

పోయినసారి వొచ్చినప్పుడు మురిక్కాలువ మూసేయిస్తానన్నారే. మళ్లీ ముక్కు మూసుకునే కదా లోపలికొచ్చారు.. వల్ల కాదు.. మా వోట్లు మురిక్కాలువలో వేస్తాం కానీ మీకెయ్యం అన్నాడు ఇంటి ఓటరూ వోనరు.

అలాగనకు నువ్వులేంది మేం లేం! నువ్వు నాకు కావాలి అంటూ వోటరుని వాటేసుకుని..
‘ఓటేరా అన్నిటికీ మూలం
ఆ ఓటు విలువ తెలుసుకొనుట ఓటరు ధర్మం' అని సీరియస్‌గా పాడసాగాడు.

పాడావులే పాట. ఓటేపిచ్చుకోడానికికొచ్చినప్పుడల్లా ఇలా జోల పాటలు పాడ్డం నేర్చారు. ఇంక దయ చెయ్యండి అన్నాడు ఓటరు.

ఈసారి ఓటేసి జూడు. ఇంటి ముందు కాలువ కాదు గార్డెన్ వుంటది. అందులో పూలు అమ్ముకుని నువ్వీ కొంప కూలగొట్టవచ్చు.

ఏంటీ వున్న కొంప కూడా కూలదోస్తావా! నడుస్తావా బయటకి గెంటేయనా? కోప్పడ్డాడు వోటరు.

కోప్పడద్దు! కొత్త బంగాళ కట్టుకోవచ్చని. చల్ల కొచ్చి మగ్గు దాచడం దేనికి మీ ఓట్లన్నీ, నాకే ఎయ్యాలి అని చేతిలో చెయ్యి వేపిచ్చుకుని కానీ వెళ్లకు అన్నాడు లీడరు.

ఏస్తాం అన్ని ఓట్లూ నీకే వేస్తాం అన్నాడు ఓటరు జేబులోంచి ఓ లిస్టు తీసిస్తూ. మీరగడడం మేం వెయ్యడం యియ్యన్నీ వద్దు. ఒక అండర్ స్టాండింగ్ చేసుకుందాం. లిస్టులో వున్నవన్నీ పంపించు. ఓట్లు పుచ్చుకో అని కాబోయే నాయకుడ్ని తలుపు దాటించాడు వోటరు.

ఓటడగడానికి వెళ్లే ప్రతి చోటా ముక్కు మూసుకోక తప్పలేదు నాయకుడు గార్కి.

మరో చోట ఓటరు మంచీ మర్యాదా తెల్సినవాడులా వున్నాడు. రండి రండి కూచోండి అన్నాడు. కానీ లీడరు గారు నామినేషన్ వేసిన రోజునుంచీ నిలబడే వున్నాననీ ఎన్నికల్లో నిలబడ్డవాడు ఎన్నికయ్యాకే కూర్చుంటాడనీ చెప్పాడు ఇంట్లోకి పరీక్షగా చూస్తూ.

కొన్ని ఓట్లు నిద్దురోతున్నవి. కొన్ని ఓట్లు పని మీద బయటికెళ్లేయి అని చెప్పాడు ఇళ్లూ ఓట్లూ గలాయన.

‘ఓటు ఎక్కడున్నది
ఓటు ఎక్కడున్నది
నీ చుట్టూనే తిర్గుతున్నది' అంటూ ఓటరు చుట్టూ తిరుగుతూ పాటందుకున్నాడు ఎలెక్షన్లో నిలబడ్డవాడు.

పాట పాడ్డానికి ఓ శృతీ తాళం అవసరం కంగారు పెట్టకు ఇప్పుడేమిటి నీ బాధ అనడిగాడు ఓటరు.

మీ ఓట్లు ఎన్నుంటే అన్నీ నాకే అన్నాడు పాట ఆపి బిఫాం దాఖలు చేసినవాడు.

ఏం? ఎందుకు వెయ్యాలి? నీకే ఎందుకు వెయ్యాలి! అనడిగాడు చిరగ్గా ఓటరు.

ఏమేం చేస్తానో! నాకే ఓటు ఎందుకెయ్యాలో చెప్పా కాస్కో

అక్కర్లేదు. ఎందుకు వెయ్యకూడదో నేను చెప్తా. నీకే కాదు ఎవ్వరికి ఎందుకెయ్య కూడదో కూడా చెప్పగల్ను. ఇల్లు కట్టాక చెత్తకుండీలు వచ్చినయో చెత్తా కుండీల మధ్యే ఇల్లు కట్టేడో మా తాత తెలీదు కానీ ఆ రోజుల్లో ఎలెక్షన్లల్లో నిలబడ్డ మీ తాత మీ నాయనా ఏమి చెయ్యలేక ముక్కు మూసుకుని వచ్చీ వెళ్లేరు. నువ్వూ ఇప్పుడు ముక్కు మూసుకునే వచ్చావ్! నువ్వూ ఏమీ చెయ్యవు మా చెవుల్లో పూలు తీసేశాం అన్నాడు ఆవేశపడుతూ ఓటరు.

‘మనసు గతి యింతే
మనిషి బ్రతికింతే
మనుసున్న మనిషికీ
ఓటు లేదంతే' అని పాడుతూ అదే పనిగా దగ్గసాగాడు లీడర్.

దగ్గింది చాల్లే. నీ దగ్గులకీ తుమ్ములకీ ఓట్లు రాలేకాలం పోయింది. ఇదుగో లిస్టు చదూకో అప్పుడు అడుగు వోటు అంటూ మర్యాదస్తుడైనా అమర్యాదగా లీడర్ని ‘పుష్' చేశాడు ఓటరు.

మళ్లీ ముక్కు మూసుకుకునే వచ్చారా సార్ తమరు ఓటడగడానికి అన్నాడు కంపు గోడ్తున్న ఓ ఫ్యాక్టరీ పక్క ఇంట్లో ఓటున్న ఓ పూర్ క్రీచర్.

అవును సుమా.. అసలీ ఫ్యాక్టరీ పోయిన ఎలెక్షన్లకే మూసేయమని ఆర్డరేసినా అన్నాడు నాయకుడు ముక్కు మూసుకోనూలేక తెరవనూ రాక.

ఆర్డరేసీ వెనక్కి తీసుకున్నదీ తమరేనంట గదా అని ఫైరయ్యాడు పూర్ క్రీచర్ కానీ ప్రస్తుతం ఓటర్.

ఏ పేపరోడన్నాడు ఏ టీవీవోడు రాంగ్ బ్రేకింగ్ న్యూసిచ్చాడు అసలీ మీడియానే లేకుండా ఆర్డరేసిపారేస్తా! ఈసారి రానీ! అనరిచాడు అసహనంగా, అవబోయే ఎంఎల్ఏ.

బాతాఖునీ లొద్దు. గాల్లో కర్రదిప్పొద్దు. బుల్లెట్ లేని తుపాకీ వూపద్దు అన్నాడు ఓనరు ఒంటి కాలుమీద నిలబడి.

ఈసారి నమ్మాలి. ఇదిగో మ్యానిఫెస్టో. తీరిగ్గా చదూకో. ముందు ఓటేస్తానని మాటిచ్చుకో.

చదివాంలే. మ్యానిఫెస్టోలు. అన్నీ కాపీలేగా జిరాక్సు. అన్ని పార్టీల మ్యానిఫెస్టోల్లోనూ వున్నదంతా వొట్టి ‘తౌడే'గదా.

అలాగనకు. మాది చూసే వాళ్లూ వీళ్లూ ఇంకోళ్లు కాపీకొట్టారు. ఒర్జినల్ మాదే. ఒట్టు. కావాలంటే అన్నీ ముందుకేసుకు చూడు.

చూశాంలే. మీ ఒకటో నెంబరులో వున్నది మరో పార్టీ వాళ్ల మూడో నంబరులో, వాళ్లా అయిదో నవంబరులో వున్నది మీరెండో నంబర్లో. నంబర్లు మారాయి కానీ పాయింట్లవే. మ్యానిఫెస్టోలన్నీ మక్కీకి మక్కీ కాపీలే అన్నాడు వోటరు. ఆ తర్వాత లీడరు ఓటరు గడ్డమూ చెప్పలూ నిమురుతూ
‘ఓటరుడా ఓటరుడా రహస్య ఓటరుడా'

‘దేవుడ దేవుడ ఓటరు దేవుడ' అని పాడాడు. కానీ ఓటరు మన మధ్య మొహమాటాల్లేవు. ఇస్తినమ్మా వాయనం పుచ్చుకుంటినమ్మా వాయినం. ఇదుగో జాబితా అన్నీ అందిస్తే ఓట్లేస్తాం మళ్లీ అయిదేళ్లకే కదా మనం కల్సుకుంటాం అంటూ వీధి తలుపులు బార్లా తెరిచేడు లీడర్ ఎక్జిటవడానికి.

టీవీలూ, కంప్యూటర్లూ, మొబైళ్లూ, ఫ్యాన్లూ, ప్రెషర్ కుక్కర్లూ, క్రికెట్ కిట్లూ, కరెన్సీ కట్టలూ మందు బాటిళ్లూ బిర్యానీ పొట్లాలూ వంటి వాటికి ‘బదిలీ పథకం'గా ఓటును భావించే వాళ్లు తమ ఓటు తమ స్వార్థం కోసం కాదని తమ ఓటు రాబోయే తరాల కోసం అని గుర్తించినప్పుడే ప్రజాస్వామ్యం అపహాస్యంపాలు కాకుండా వుంటుుంది. ఓటు వేస్తే ఏమిస్తావు అని కాదు ఓడిస్తే ఏమౌతావు అని ప్రశ్నించండి. అడుక్కునే వాడిది కాదు - మీదే పైచేయి.

- చింతపట్ల సుదర్శన్

English summary
Prominent columnist Chintapatla Sudarshan writes about politicians attitude during the election.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X