హైదరాబాద్: శేఖర్‌కమ్ముల స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' ఈ రోజు విడుదల అవుతోంది. అభిజిత్, సుధాకర్, కౌశిక్, షగుణ్, జారా, రష్మి, కావ్య, నవీన్, విజయ్, సంజీవ్, శ్రీరామ్‌లను తెరకు పరిచయం చేస్తూ ఈ చిత్రం శేఖర్ కమ్ముల రూపొందించారు. ‘ఆనంద్'కు ‘మంచి కాఫీలాంటి సినిమా' అనే ఉపశీర్షిక పెట్టాను. ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్'కి అలాంటి ట్యాగ్‌లైన్లు లేవు కానీ... ‘ఇది మన సినిమా' అని మాత్రం చెప్పుతున్నాను. మనసున్న ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యే సినిమా ఇది. ముఖ్యంగా మధ్యతరగతి వారికి ఈ సినిమా బాగా నచ్చుతుంది. ‘‘పరీక్షలు రాశాం. ఫలితం ఎలా ఉంటుందో మాకు తెలుసు. తప్పకుండా విజయం సాధించితీరుతాం'' అని శేఖర్‌కమ్ముల చెప్పారు.
చిత్రం కథ ప్రకారం...సన్‌షైన్ వ్యాలీ అనే ఓ అందమైన కాలనీలో జరిగే కథ ఇది. ఇరుగుపొరుగుల మధ్య అనుబంధాలు, అంతా కలిసి చేసుకొనే పండుగలు, పెద్దల సాదకబాధకాలు, పిల్లల అల్లరి, ఆటపాటలు... ఇలా ఎప్పుడూ సందడి సందడిగా ఉంటుంది ఆ కాలనీ. శ్రీను (అభిజిత్), నాగరాజ్ (సుధాకర్), అభి (కౌశిక్), సత్య (రష్మి), లక్ష్మి (జారా), పద్దు (షగుణ్)... వీరంతా ఆ కాలనీ యువతరం. చదువు, లక్ష్యం, ప్రేమ, ఆకర్షణ... ఇలా రకరకాల అనుభవాల్ని ఆస్వాదిస్తూ ఈ యువతరం జీవితాలు ఎంత అందంగా సాగాయో తెరపైనే చూడాలి. అమ్మ (అమల), పారు (శ్రియ) పాత్రలు కూడా కథలో కీలకం.
దర్శకుడు శేఖర్ కమ్ముల మాట్లాడుతూ ''మధ్య తరగతి కుటుంబాలు, వారి అనుబంధాల నేపథ్యంలో సాగే కథ ఇది. బతకడమే ఓ అదృష్టం... అందుకే ఒకరికొకరు సాయం చేసుకొందాం అని చెప్పే ప్రయత్నం చేశాం. అమల, శ్రియ, అంజలా జవేరి పోషించిన పాత్రలు కథలో కీలకం. మిక్కీ జె.మేయర్ సంగీతం చిత్రానికి బలాన్నిస్తుంది''న్నారు.
సంస్థ: అమిగోస్ క్రియేషన్స్
నటీనటులు: అభిజిత్, సుధాకర్, కౌశిక్, షగుణ్, జారా, రష్మి, కావ్య, నవీన్, విజయ్, సంజీవ్, శ్రీరామ్, అమల, శ్రియ, అంజలా జవేరి తదితరులు
సంగీతం: మిక్కీ జె.మేయర్
కళా దర్శకత్వం: తోట తరణి విజయ్
ఛాయాగ్రహణం: సి.కుమార్
ఎడిటింగ్ :మార్తాండ్ కె.వెంకటేష్
నిర్మాతలు: చంద్రశేఖర్ కమ్ముల, శేఖర్ కమ్ముల
దర్శకత్వం: శేఖర్ కమ్ముల
విడుదల: శుక్రవారం.



















