twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాపు ఆణిముత్యాలు(ఫొటో ఫీచర్)

    By Srikanya
    |

    హైదరాబాద్‌ : దర్శకుడు, చిత్రకారుడు, కార్టూనిస్ట్‌గా ప్రసిద్ధిగాంచిన బాపు గీత, రాత తెలుగువారి సంస్కృతిలో ఓ భాగమైంది. ముత్యాలముగ్గు, మిస్టర్‌పెళ్లాం, శ్రీరామరాజ్యం వంటి అద్భుతమైన కళాఖండాలను ఆయన అందించారు. ముత్యాలముగ్గు, మిస్టర్‌ పెళ్లాం చిత్రాలకు జాతీయ అవార్డులు కూడా అందుకున్నారు. పద్మశ్రీ పురస్కారంతో కేంద్రప్రభుత్వం ఆయన్ను సత్కరించింది. వివిధ చిత్రాలకుగాను ఆరు నంది అవార్డులు అందుకున్నారు. 1967లో 'సాక్షి' సినిమాతో దర్శకుడిగా అవతారమెత్తిన బాపు తెలుగు, తమిళం, హిందీ భాషల్లో మొత్తం 51 సినిమాలకు దర్శకత్వం వహించారు.

    బాపు మొదటి నుంచీ హిందూ దేవుళ్లను ఎక్కువగా చిత్రించేవారు. ఆయన సినిమాల్లో కూడా అధిక శాతం హిందూ ఇతిహాసాలకు సంబంధించినవే. రాముడంటే ఆయనకు భక్తి, ప్రాణం. అందుకే, ఆయన తీసిన చాలా సినిమాల్లో రామాయణ ఇతివృత్తమే ప్రధాన కథాంశంగా ఉంటుంది.

    1986లో ఆయన రమణతో కలిసి ప్రతిష్ఠాత్మక రఘుపతి వెంకయ్య అవార్డును అందుకున్నారు. దర్శకుడిగా రెండు జాతీయ అవార్డులు, ఆరు నంది అవార్డులను అందుకున్నారు. 2013లో పద్మశ్రీ పురస్కారం బాపును వరించింది. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కార్టూనిస్ట్స్‌, ఆంధ్రప్రదేశ్‌ ప్రెస్‌ అకాడమీ పురస్కారాలతోపాటు లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డులను, 1991లో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆయనను గౌరవ డాక్టరేట్‌ కళాప్రపూర్ణతో సత్కరించింది.

    'సాక్షి' నుంచి 'శ్రీరామరాజ్యం' దాకా ఆయన వెండితెరపై మలిచిన ఏ సినిమాను తల్చుకున్నా అదొక తీయని అనుభూతినే గుర్తుకు తెస్తుంది. వాటిల్లో కొన్ని ఆణిముత్యాలు ని ఇక్కడ ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నాం.

    స్లైడ్ షో లో... ముత్యాలు

    'సాక్షి'

    'సాక్షి'

    1967లో తొలి సినిమా 'సాక్షి' తీస్తూనే 'ఇది సాక్షినామ సంవత్సరం' అని నిబ్బరంగా చాటుకోగలిగారు. ఆ ప్రచారం చూసి కొందరు 'పొగరు' అన్నారు. కానీ ఆ సినిమా విడుదలయ్యాక తెలిసింది అది ఆత్మవిశ్వాసం అని! ఇండోర్‌ స్టూడియోల గదుల్లో, కృత్రిమ సెట్టింగుల హంగుల మధ్య సినిమాలు చూసిన ప్రేక్షకులకు 'సాక్షి' ఓ సరికొత్త వాతావరణాన్ని చూపించింది. ఔట్‌డోర్‌లో పకడ్బందీగా తీస్తే సహజత్వం ఎలా వెల్లివిరుస్తుందో సినిమావాళ్లకు కూడా చవిచూపించింది. ఇప్పటికీ చెప్పుకోదగిన ఓ పాఠంలా మిగిలింది.

    'బుద్ధిమంతుడు'

    'బుద్ధిమంతుడు'

    అక్కినేని నాగేశ్వరరావు ద్విపాత్రాభినయంతో బాపు తీసిన 'బుద్ధిమంతుడు' (1969) చిత్రం కూడా పల్లె రాజకీయాలను కళ్లకు కడుతుంది. అందులో అక్కినేనిని ఆయన పూర్తి ఆస్తికుడైన అన్నయ్యగా, పరమ నాస్తికుడైన తమ్ముడిగా రెండు విభిన్నమైన కోణాల్లో అద్భుతంగా ఆవిష్కరించారు. 'భూమ్మీద సుఖపడితే తప్పులేదురా... బులబాటం తీర్చుకుంటే తప్పులేదురా...' అంటూ తిరిగే తమ్ముడికి, 'నను పాలించగ నడచి వచ్చితివా...' అంటూ భక్తితత్పరతతో మైమరచి పోయే అన్నయ్యకి తేడా చూపించిన తీరు అద్వితీయం. 'అంతా భగవంతుడు చూసుకుంటాడనే' అన్నయ్యకు, సమాజంలోని అన్యాయాన్ని ఎదురించేవాడు నాస్తికుడైనా దేవుడికి ఇష్టుడవుతాడని చెప్పించిన తీరు మనసులకు హత్తుకుంటుంది.

    'సంపూర్ణ రామాయణం'

    'సంపూర్ణ రామాయణం'

    ఆయన తెరకెక్కించిన పౌరాణిక చిత్రాల్లో తలమానికం 'సంపూర్ణ రామాయణం'. 1971లో వాల్మీకి రామాయణం ఆధారంగా రూపొందిన ఆ చిత్రం సంచలన విజయాన్ని సొంతం చేసుకొంది. శోభన్‌బాబు, చంద్రకళ, గుమ్మడి తదితరులు కీలక పాత్రలు పోషించిన ఆ చిత్రంలో 'రామయ్య తండ్రి...'అంటూ సాగే పాట ఇప్పటికే వినిపిస్తూనే ఉంటుంది.

     'అందాల రాముడు'

    'అందాల రాముడు'

    గోదావరి అన్నా, తీర ప్రాంతాలన్నా బాపుకి ఎంత ఇష్టమో 'అందాల రాముడు' (1973) సినిమా చూస్తే అర్థం అవుతుంది. రాజమండ్రి నుంచి భద్రాచలం వరకు లాంచీలో జరిగే ప్రయాణంగా సాగిపోయే ఈ సినిమా గోదావరి అందాలకు పట్టిన నీరాజనం. ఈ ప్రయాణంలోనే పేద, ధనిక తారతమ్యాలు, సమాజంలో విభిన్న మనస్తత్వాలు అన్నీ తారసపడి ప్రేక్షకులను కూడా గోదావరి లాంచీపై ఆహ్లాదకరమైన ప్రయాణం చేయిస్తాయి.

    'ముత్యాల ముగ్గు'

    'ముత్యాల ముగ్గు'

    వెండితెరపై 'ముత్యాల ముగ్గు' (1975) అద్బుతమే. కాంట్రాక్టర్‌ అనే విలన్‌ పాత్రను బాపు మలిచిన తీరు అద్వితీయం. అపురూపం. 'మడిసన్నాక కూసింత కలాపోసన ఉండాలయ్యా...', 'డిక్కీలో తొంగోబెట్టేస్తాను...', 'ఆ ముక్క నే లెక్కెట్టుకోక ముందు సెప్పాల...' 'ఏముందీ నిన్ను కరుసు రాయించి ఆయన కాతాలో జమేస్తే సరి...' లాంటి డైలాగులను రావుగోపాలరావు చేత పలికించిన పంథా విలనిజానికి విలక్షణతను ఆపాదించాయి.

    'సీతాకల్యాణం'

    'సీతాకల్యాణం'

    పౌరాణికాలు విషయానికి వస్తే... 1976లో 'సీతాకల్యాణం' తెరకెక్కించారు బాపు. సీతగా జయప్రద, రాముడిగా రవికుమార్‌ నటించారు. అప్పట్లో లండన్‌, చికాగో శాన్‌ రెనో అండ్‌ డెన్వర్‌ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శనకు ఎంపికైంది. నేటికీ బ్రిటిష్‌ ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌ విద్యార్థులకు ఆ సినిమాని పాఠ్యాంశంగా బోధిస్తున్నారు.

    'భక్త కన్నప్ప'

    'భక్త కన్నప్ప'

    కృష్ణంరాజు, వాణిశ్రీలతో తీసిన 'భక్త కన్నప్ప' (1976) భక్తి ప్రధానమైన సినిమాను కూడా ఎలా కమర్షియల్ గా , ఆర్టిస్టిక్ గా తీయవచ్చో చెబుతుంది.

    'మనవూరి పాండవులు'

    'మనవూరి పాండవులు'

    అన్యాయాలను సహించలేని ఐదుగురు యువకులను పాండవులుగా తీర్చిదిద్దుతూ, ప్రతినాయకుడి తమ్ముడి పాత్రలో కృష్ణంరాజును సాంఘిక కృష్ణుడిగా చూపించడం బాపు విలక్షణ శైలికి అద్దం పడుతుంది. చిరంజీవికి మంచి గుర్తింపు తెచ్చిన తొలిచిత్రాల్లో ఒకటిగా ఇది నిలిచిపోతుంది.

     'మంత్రిగారి వియ్యంకుడు'

    'మంత్రిగారి వియ్యంకుడు'

    ఆ తర్వాత కాలంలో చిరంజీవి కథానాయకుడిగా తీసిన 'మంత్రిగారి వియ్యంకుడు' (1983) మరో చిరస్మరణీయమైన సినిమాగా నిలిచిపోయింది.
    ప్రయోగాలకు కూడా బాపు పెద్ద పీట వేసేవారు. '

    'బాలరాజు కథ'

    'బాలరాజు కథ'

    ఓ గుడిలో రాసి ఉన్న నీతి సూత్రాలు ఓ పిల్లవాడి జీవితంలో ఎలా నిజమయ్యాయో, అవి ఆ పసి మనసుకు ఎంత గొప్ప జీవిత సత్యాలు బోధించాయో పిల్లల స్థాయిలో చిత్రీకరించిన తీరు ప్రేక్షకుల మనసుల్లో హత్తుకుపోతుంది. ఓ చిన్నపిల్లవాడి కథతో తీసిన 'బాలరాజు కథ' ఇప్పటికీ పిల్లల్ని, పెద్దల్నీ ఆకట్టుకుంటుంది.

    'గోరంత దీపం'

    'గోరంత దీపం'

    ఈ చిత్రంలో మధ్యతరగతి లోగిళ్లలోని విచిత్రమైన మనస్తత్వాలను వాస్తవికమైన రీతిలో ప్రతిబింబించిన తీరు, బాపు చిత్రీకరణలోని విలక్షణ శైలిని చాటి చెబుతుంది. అలాగే వాణిశ్రీని మేకప్‌ లేకుండా చూపించాలనుకోవడం అప్పట్లో ఓ సాహసం. ఆ సాహసాన్ని 'గోరంత దీపం' చిత్రంలో చేశారు బాపు. ఆ చిత్రం కమర్షియల్ గా విజయవంతం కాలేదనే సత్యాన్ని స్వీకరిస్తూ గోరు మీద దీపం కాలుతున్నట్టుగా కార్టూన్‌ వేసి అభిమానులను నవ్వించారు బాపు.

    'పెళ్లి పుస్తకం..'

    'పెళ్లి పుస్తకం..'

    'శ్రీరస్తు.. శుభమస్తు..' పెళ్లి పాటకు ఓ పద్దతిని నేర్పి బ్రాండ్ గా నేర్పింది. ఈ పాటని బాపు తెరకెక్కించిన విధానం నభూతో.. నభవిష్యత్‌ అనొచ్చు. ఉద్యోగాల కోసం 'పెళ్లి కాలేద'ని అబద్దం చెప్పిన ఓ జంట కథ ఇది.

    'మిస్టర్‌ పెళ్లాం'

    'మిస్టర్‌ పెళ్లాం'

    ఉద్యోగం చేస్తున్న భార్య, వంటింట్లో గరెటె తిప్పుతున్న మగాడు.. అదీ కథ. మగవాడి మనస్తత్వానికి రాజేంద్రప్రసాద్‌ పాత్ర పరాకాష్ట గా చెప్తాను.

    'శ్రీరామరాజ్యం'

    'శ్రీరామరాజ్యం'

    బాపు గారి చివరి చిత్రం 'శ్రీరామరాజ్యం'లోనూ బాపు ముద్ర స్పష్టంగా కనిపించింది. వయసు మీరినా ఆయన మార్క్‌ చెరగలేదనడానికి... అదో నిదర్శనంలా నిలిచింది.

    'శ్రీభాగవతం'

    'శ్రీభాగవతం'

    బాపురమణలు శ్రీభాగవత కథలను సిద్ధం చేశారు. 'రాముడి కథలను రాముడికే నైవేద్యంగా సమర్పిస్తున్నాం' అంటూ ఆ కథలని తెలుగు ప్రజలకు అంకితం చేశారు. అవే కథలని 'శ్రీభాగవతం' పేరుతో ఈటీవీలో ధారావాహికగా తీర్చిదిద్దారు.

    English summary
    Veteran director Bapu is no more. He passed away on August 31 after battling illness for the past few weeks. His last major work was Balakrishna, Nayanthara starrer Sri Ramarajyam, which released in 2011.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X