twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చిక్కుల్లో 'చంద్రుడు'

    By Staff
    |

    Chukkallo Chandrudu
    -జోశ్యుల సూర్యప్రకాష్‌
    సినిమా: చుక్కల్లో చంద్రుడు
    విడుదల తేదీ: 14/1/2006
    నటీనటులు: సిద్ధార్థ, సల్లోని, చార్మి, సదా, తనికెళ్ల భరణి,
    అక్కినేని నాగేశ్వర రావు, వహెదా రెహ్మాన్‌, సునీల్‌, ప్రభు దేవా,
    కొండవలస లక్ష్మణరావు, ఆహుతి ప్రసాద్‌ తదితరులు
    సంగీతం: చక్రి
    కెమెరా: సమీర్‌రెడ్డి
    కథ : సిద్ధార్థ
    మాటలు : కోన వెంకట్‌
    స్క్రీన్‌ప్లే: సిద్దార్థ, కోన వెంకట్‌, శివకుమార్‌
    దర్శకత్వం: శివకుమార్‌
    నిర్మాత: అలెగ్జాండర్‌ వల్లభ

    నేటి సినీ రాజపోషకులు యూత్‌ కాబట్టి ప్రేమను ప్రతి ఫ్రేమ్‌లో నింపితే థియేటర్లు నిండుతాయని గట్టిగా నమ్మి తీసిన చిత్రం 'చుక్కల్లో చంద్రుడు'. కథాబలం సిద్ధార్థని గత సంక్రాంతి హీరోగా నిలబెడితే, ఈసారి కథే బలహీనమై ఇమేజ్‌ను నిలబెట్టలేకపోయింది.

    తల్లిదండ్రులను కోల్పోయిన అర్జున్‌ (సిద్ధార్థ) అతి గారాబంగా తాతయ్య (అక్కినేని), నాయనమ్మ (వహెదా రెహ్మాన్‌)ల వద్ద జర్మనీలో పెరుతుంటాడు. మనవడు పెళ్లి చేసుకుంటే చూసి ఆనందించాలనుకున్న నాయనమ్మ ముచ్చట తీరకుండానే మరణిస్తుంది. పెళ్లంటే విముఖత చూపుతూ జాలీగా గడిపే మనవన్ని దారికి తేవాలని తాతయ్య చెప్పాపెట్టకుండా విమానం ఎక్కేస్తాడు. ఆయనను వెతుక్కుంటూ ఇండియా వచ్చిన అర్జున్‌ తప్పనిస్థితిలో 'నేను పెళ్లికి రెడీ' అంటాడు. అంతేగాక తనకు నచ్చిన అమ్మాయినే చేసుకుంటానని చెప్పి చూసుకోవడానికి హైదరాబాద్‌ బయలుదేరుతాడు. ఫ్రెండ్‌ పప్పీ (సునీల్‌) రూమ్‌లో ఉంటూ తన బాల్యమిత్రులైన ముగ్గురు అమ్మాయిలను ఎంచుకుంటాడు. వారి గురించి ఎంక్వయిరీలు చేస్తారు. వారు టెన్నిసే ప్రాణంగా బతికే శాలిని (సలోని), జీవసంరక్షణలో మునిగి తేలే సంధ్య (చార్మి), బుద్ధిమంతురాలైన మెడికల్‌ స్టూడెంట్‌ శ్రావణి (సదా). అర్జున్‌ ముగ్గురికీ సన్నిహతమవుతూ ప్రేమలో పడేస్తాడు. చివరికి ఈ స్వయంవరంలో అర్జున్‌ ఎవరిని వరిస్తాడనేది తెరపై చూడాల్సిందే. మిగతా ఇద్దరి సంగతి ఏమిటో కూడా తెలియవచ్చు, హీరో పెట్టిన పరీక్షలో మిగతా ఇద్దరి స్థితి ఏమిటో కూడా తెలుసుకోవచ్చు.

    మన అవసరం కోసం ఎదుటి వారి మనసులతో, జీవితాలతో ఆడుకునే వ్యక్తి ఎప్పటికీ హీరో కాడు, కానేరడు. తన పెళ్లి కోసం హీరో ముగ్గురు అమ్మాయిలను ప్రేమలో పడేసుకోవడం (అంతా సులభమా?) అంత రక్తి కట్టలేదు. తన మనసులో ఏముందో తనకే తెలియదు, ప్రేక్షకులకు ఏం తెలుస్తుంది. ఇది స్పష్టంగా హీరో పాత్ర చిత్రీకరణలో లోపం ఉందనే విషయాన్ని బయటపెడుతుంది. నేను పెళ్లికి రెడీ సినిమాకు సిండ్రిల్లా కథను (సదా క్యారెక్టర్‌ని) జోడిస్తే పుట్టినట్లున్న ఈ చిత్రంలో హీరో ఏమీ చేయడానికి ఉండదు. విధే విధేయంగా కథను నడిపించి హీరోను పాసివ్‌గా మారుస్తుంది. ఇది ముగ్గురితో ముడిపడని స్క్రీన్‌ప్లే సమస్య. చర్య, ప్రతిచర్యకు కారణమవుతుందనే అనే ప్రాథమిక అంశాన్ని కూడా అనుసరించకపోవడం వల్ల హీరో ప్రేమను ఆ ముగ్గురు సీరియన్‌గా తీసుకున్నారా లేదా అనేది ఎస్టాబ్లిష్‌ కాలేదు. దాంతో కథలో బిగువు నశించింది. దర్శకత్వ పరంగా కె.బి.సి. అమితాబ్‌ వంటి సింబాలిక్‌ సీన్‌లున్నా పెద్దగా మెరుపులు పుట్టించలేదు. అప్పటికీ సదాకి ధైర్యం చెప్పే సీన్‌, చార్మిని ఛీకొట్టే సీన్‌ వంటి కొన్ని సన్నివేశాలు కాస్తా పండాయి. కెమెరా కాస్తా కొత్త అందాలను పట్టించింది. సిద్ధార్థలో గత చిత్రంలో ఉన్న కనపడ్డ ఏకాగ్రత, ఎనర్జీ ఈ చిత్రంలో కనిపించకపోవడం విచారకరం. ప్రభుదేవా అతిథి పాత్రగా వచ్చి పాటకు డ్యాన్స్‌ చేసినా పెద్దగా ఉపయోగం లేదు. దానికీ, కథ నడకకు సంబంధం లేకపోవడమే దానికి కారణం. ఎడిటింగ్‌ బాగుంది. 'డోలారే' పాట మినహా ఏవీ చెవికింపుగా లేవు. సునీల్‌ కామెడీ ఫరవా లేదు. హీరోయిన్లు ముగ్గురివీ నటించడానికి అవకాశం ఉన్న పాత్రలు కావు. ఏదేమైనా ఇది క్రియేటివ్‌ కమర్షియల్‌ స్థాయిలో లేదు.

    గమనిక: వినోదం, అసభ్యత లేకపోవడం, సాంకేతిక విలువలు, కథన నైపుణ్యం తదితర అంశాల ఆధారంగా మా రేటింగ్‌ ఉంటుంది. సినిమా జయాపజయాలకు రేటింగ్‌కు సంబంధం ఉండనవసరం లేదు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X