twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రేక్షకుడు నిద్రపోతున్న వేళ (చార్మి కొత్త సినిమా రివ్యూ)

    By Srikanya
    |


    -సూర్య ప్రకాష్ జోశ్యుల
    సినిమా: నగరం నిద్రపోతున్న వేళ
    సంస్థ: గురుదేవ క్రియేషన్స్‌ ప్రై.లి.
    నటీనటులు: జగపతి బాబు, చార్మి, పిళ్లా ప్రసాద్‌, పరుచూరి గోపాలకృష్ణ, ఆహుతి ప్రసాద్‌, చంద్రమోహన్‌, బాబు మోహన్‌, ఉత్తేజ్‌, శివారెడ్డి తదితరులు
    నిర్మాత: నంది శ్రీహరి
    దర్శకత్వం: ప్రేమ్‌రాజ్‌

    చాకిరేవు అనే సినిమా పత్రిక విలేఖరి ఓ భయంకర నిజాన్ని చూసి వెంటనే సైకిలు తొక్కుకుంటూ వెళ్ళి దాన్ని తన పేపర్లో వేసేసి జనాల్ని జాగృతి పరుద్దామనుకుంటాడు. అయితే ఆ నిజం చూసిన సంగతి ఆ విలన్స్ కు తెలిసిపోయి ఆ విలేఖరి వెంటబడతారు...అప్పుడేం జరుగుతుంది. తెలియదా అయితే వెంటనే ఇలాంటి కథతోనే వచ్చిన నగరం నిద్రపోతున్న వేళ సినిమా తప్పని సరిగా మీరు చూడాలి.

    ఆవలిస్తూ సినిమా చూడాలంటే ఎంతటి సినిమా పిచ్చోడికైనా అసహనమే..ఇచ్చిన టిక్కెట్టు డబ్బు గిట్టుబాటు కోసం చివరి వరకూ భరించాలా..మధ్యలో వదిలేసిరావాలా అర్దం కాని స్ధితిలో ముంచే చార్మి తాజా చిత్రం నగరం నిద్రపోతున్న వేళ. అస్సలు చార్మి ఏ ముహూర్తాన అనుకోకుండా ఒక రోజు సినిమా చేసిందో కానీ అప్పటినుంచీ ఆమె హీరోయిన్ ఓరియెంటెడ్ రోల్స్ తో కంటిన్యూగా చావబాదేస్తోంది. దానికి తోడు ప్లాపుల వీరుడు జగపతిబాబు కీలకపాత్రలో చేసిన చిత్ర రాజమిది. పోస్టర్స్ చూసి సినిమాలో విషయం ఏమీ ఉండదని తెలిసినా అటు వైపు అడుగులు వేసిన వారికి గట్టి బుద్దే చెప్తోంది. చివరకు దొంగల ముఠా తరహాలో సెక్సప్పీల్ కూడా గిట్టుబాటు కాకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకుని చేసిన ఈ చిత్రం ప్రేక్షకులను నిద్రలోకి పంపుతోంది.

    కథలోకి వస్తే నీహారిక(చార్మి)నీతి నిజాయితీలు గల ఓ జర్నలిస్టు.ప్రజలకు నిజాల్ని అందించమే తన ధ్యేయమని నమ్మి ఇరవైనాలుగు గంటలూ అదే పనిమీద ఉంటుంది. అయితే ఆమె బాస్ (ఆహుతి ప్రసాద్) మాత్రం నిజాలకన్నా టీఆర్పీలే గొప్పవని నమ్ముతూంటాడు. ఓ రోజు రాత్రి ఆమె నగరంలో సంచరించి కొన్ని ఇంట్రస్టింగ్ విషయాలు సేకరించి తమ ఛానెల్ కు అందించాలనుకుంటుంది. ఆ క్రమంలో అనుకోకుండా ఆమె పెన్ కెమెరాకు రాష్ట్ర ముఖ్యమంత్రిని కుర్చీనుంచి దింపేయటానికి ఓ దుర్మార్గుడైనా రాజకీయనాయుకుడు చేస్తున్న కుట్ర చిక్కుతుంది. ఆ విషయం వాళ్ళకు తెలిసిపోతుంది. అక్కడనుంచి ఏం జరుగుతుందో రెగ్యులర్ గా ఏళ్ళ తరబడి తెలుగు సినిమాలు చూసే వాళ్ళు ఊహించేయవచ్చు..చేతకాని వాళ్ళు ధియోటర్ లోకి దూకేయవచ్చు.

    ఓ ప్రక్క తమిళంలో రంగం వంటి చిత్రాలు జర్నలిజం గురించి వచ్చి సంచలన విజయం సాధిస్తూంటే తెలుగులో ఇలాంటి సినిమాలు వస్తున్నందుకు ముందుగా ఆశ్చర్యపోవాలి ..ఆ తర్వాత దిగులుపడాలి. అందులోనూ అస్సలు మార్కెట్ లేని ఫేడవుట్ అయిన హీరో,హీరోయిన్స్ ని పెట్టుకుని దానికి మరింత ఫేడవుట్ అయిన కథను ఎంచుకుని రంగంలోకి దిగటం మామూలు మాటలు కాదు. అందుకు ఆ దర్శకుడుని, నమ్మి పెట్టుబడి పెట్టిన నిర్మాత ధైర్యాన్ని మెచ్చుకోవాలి. సినిమాలో చార్మికున్న ధైర్యానికి రెట్టింపు వారికుందనిపిస్తుంది. ఎక్కడా కథలో నూతనత్వం అనేది లేకుండా చూసుకుని,దానికి తగ్గ అతి నీరసమైన కథనాన్ని అద్దుకుని వచ్చిన ఈ చిత్రం గురించి ఎంత డిస్కస్ చేసినా తనివి తీరదు.

    ఇక ఈ సినిమాకి ఎవరు వెళ్ళవచ్చు అంటే సినిమా ఎలాతీయకూడదో తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్నవారూ, ఇంట్లోసరిగా నిద్రపట్టనివారూ, చార్మి వీరాభిమానులు, పనిలోపనిగా జగపతిబాబుకి మిగిలి ఉన్న అభిమానులు అని చెప్పాలి.

    English summary
    Niharika (Charmi) is a journalist who believes in true idealism and bringing truth to the people. She decides to venture out one night and gather some interesting bits for the channel.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X