twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అంత 'శీను' లేదు ('అల్లుడుశీను' రివ్యూ)

    By Srikanya
    |

    Rating:
    2.0/5
    ---సూర్య ప్రకాష్ జోశ్యుల

    స్టార్ దర్శకుడు, స్టార్ హీరోయిన్, స్టార్ విలన్, స్టార్ కమిడియన్, స్టార్ హీరోయిన్ ఐటం సాంగ్...ఇలా ఖర్చుకి వెనకాడకుండా డబ్బుని నీళ్లు పోసుకుంటూ... బెల్లంకొండ తన కుమారుడు ఎంట్రీని గ్రాండ్ గా చేయటానికి పన్నిన వ్యూహం జనాల్ని థియోటర్ వరకూ రప్పించటవరకూ అద్బుతంగా పనిచేసింది. కొత్త హీరో అయినా ఓపినింగ్స్ రాబట్టడంతో సఫలమైంది. అయితే వచ్చిన చిక్కల్లా.... వచ్చిన జనాల్ని...ఎంటర్టైన్ చేయటంలో మిస్ అవటం జరిగింది. అన్ని హంగులూ సమకూర్చుకున్నా..వాటికి బేస్ గా నిలబడే కథను మాత్రం సరిగ్గా కూర్చుకోకపోవటంతో హిట్ కావాల్సిన సినిమా..సోసో గా...మహా అయితే యావరేజ్ అన్నట్లు తయారైంది. ఫస్టాఫ్ కామెడీతో కొట్టుకుపోయినా, సెకండాఫ్ సరైన విలన్ కి హీరోకి మధ్య కాంఫ్లిక్ట్ ఎస్టాబ్లిష్ కాక...విలన్ డమ్మిగా మారి... కథ ఎక్కడ వేసిన సీన్ అక్కడే ఉన్నట్లు అక్కడక్కడే తిరుగుతూ విసిగించింది. అప్పటికీ వినాయిక్ తనదైన శైలి టేకింగ్ తో, బ్రహ్మీ కామెడీతో లాక్కెళ్లే ప్రయత్నం చేసాడు. ఇవన్నీ ప్రక్కన పెడితే ఈ చిత్రం అసలు టార్గెట్ అయిన హీరో లాంచింగ్ బాగానే జరిగినట్లు...ఈ హీరో..డాన్స్ లు బాగానే చేయగలడు...కొంచెం సాన పడితే మాస్ హీరో పాత్రలకు పనికివస్తాడు అనిపించుకున్నాడు. కాబట్టి చిత్రం లక్ష్యం దాదాపు నెరవేరినట్లే.

    నల్గొండలో ఉండే అల్లుడు శ్రీను (బెల్లంకొండ శ్రీనివాస్) తన మామ నరసింహా (ప్రకాష్ రాజ్)తో కలిసి అప్పులు పాలై , పారిపోయి హైదరాబాద్ సిటీకి వచ్చేస్తాడు. అక్కడ శ్రీనుకి తన మామ పోలికలతోనే...సెటిల్ మెంట్స్ చేస్తూ బ్రతికే లోకల్ డాన్ భాయ్(ఇంకో ప్రకాష్ రాజ్) కనిపిస్తాడు. ఇది గమనించిన అల్లుడు శ్రీను...దాన్ని అడ్వాంటేజి గా తీసుకుని... ఓ ట్రిక్ ప్లే చేస్తాడు. తన మామ గెటప్ మార్చి..భాయ్ గా తయారు చేసి, అతన్ని అడ్డం పెట్టి దందా చేస్తూ డబ్బు సంపాదించటం మొదలెడతాడు. ఈ లోగా భాయ్ కూతురు అంజలి(సమంత) కూడా సినిమాటెక్ గా శ్రీను తో ప్రేమలో పడిపోతుంది. ఇదిలా ఉంటే ...తన గెటప్ తో ఛీట్ చేస్తున్నారనే విషయం భాయ్ కి తెలిసిపోతుంది. తన లాగే ఉన్న నరసింహాన్ని, శ్రీను ని చంపేయటానికి ప్రయత్నం చేస్తాడు. అంతేకాకుండా తన కూతురుకు తన బిజినెస్ పార్టనర్(ప్రదీప్ రావత్)కొడుక్కి ఇచ్చి షార్జాలో వివాహం చేయాలని నిర్ణయిస్తాడు. ఇది తెలుసుకున్న శ్రీను ఏం చేసాడు. భాయ్ కి ఎలా బుద్ది చెప్పాడు. అసలు భాయ్ కి, నరసింహా కు ఉన్న సంభందం ఏంటి... అంజలిని ఎలా సొంతం చేసుకున్నాడు...డింపుల్ గా ఈ చిత్రంలో బ్రహ్మానందం పాత్ర ఏమిటి అనే విషయాలు తెలియాలంటే చిత్రం చూడాల్సిందే.

    ఆల్రెడీ తెలుగులో వచ్చిన అనేక సినిమా కథలు కలిపి వండినట్లున్న ఈ చిత్రం కథ గురించి పెద్దగా మాట్లాడుకునేది ఏమీ లేదు. ముఖ్యంగా సెకండాఫ్ ప్రారంభంలో ప్లాష్ బ్యాక్ పూర్తి కాగానే... విలన్ ని డెన్ లో కట్టేయటంతోనే...కథలో కాంప్లిక్ట్ అనేదే లేకుండా పోయి బోర్ ప్రారంభమైంది. ఇలాంటి కమర్షియల్ సినిమాల్లో(విలన్, హీరో గేమ్ గల) విలన్ లేకుండా కథను ఎంత కామెడీగా నడిపినా పండదనే విషయం ఎందుకనే మర్చిపోయారు. విలన్ ఏక్టివేట్ అయ్యే దాకా ఆ సీన్ లు అన్నీ వృధాగా మారిపోయాయి. విలన్ ఏక్టివేట్ అవ్వగానే దాదాపు సినిమా క్లైమాక్స్ కు వచ్చేసి, ఫైట్ తో ముగింపుకు వచ్చేసింది.

    అలాగే కమర్షియల్ సినిమా కదా అనుకున్నారేమో లాజిక్ లు ఎక్కడా పట్టించుకోలేదు. కరెంట్ షాక్ లు ఇస్తూ మాటా పలుకు లేకుండా పడిపోయిన విలన్ ప్రకాష్ రాజ్ ని లేపటానికి కరెంట్ షాక్ లు ఇస్తూ లేపటానికి ప్రయత్నిస్తూంటే అది జరగదు. తర్వాత ఆ విలన్ కి చెందిన వాళ్లు వచ్చి నీళ్లు కొట్టగానే లేచి కూర్చుంటాడు. అలాగే... హీరో ఎక్కిన ప్లైట్ వెళ్లిపోతూంటే దాన్ని ఆపటానికి ఎయిర్ పోర్ట్ ఛీఫ్...అరుస్తూంటాడు..కానీ పైలెట్ కు ఒక ఫోన్ కొడదామని అనుకోడు. ఇలాంటివి చాలా చిత్రంగా అనిపించే విచిత్రమైన లాజిక్కులు అనేకం ఈ సినిమాలోనే కనిపిస్తాయి. వినాయిక్ లాంటి పెద్ద దర్శకుడు ఆ మాత్రం శ్రద్ద తీసుకోలేదా అనిపిస్తుంది.

    మిగతా రివ్యూ స్లైడ్ షోలో ....

    పెద్ద మైనస్....

    పెద్ద మైనస్....

    కొత్తగా హీరోని లాంచ్ చేస్తున్నప్పుడు కాస్త కథ,కథనం ప్రెష్ గా ఉంటే బాగుండేది. అలా కాకుండా పెద్ద హీరోలకు చేసే పరమ రొటీన్ కథని, అంతే పరమ రొటీన్ కథనంతో సమకూర్చటంతో దెబ్బ కొట్టింది.

     డైలాగులు

    డైలాగులు

    తుంటరే అనుకున్నా...ఒంటరి అని మర్చిపోయాను, డబ్బులు చూసి జబ్బులు గుర్తుకు రావద్దు, స్టార్ కి ఏమి తెలుసు ఫ్యాన్స్ కి ఎక్కడ ఉంటారో వంటి డైలాగులు ఓకే అనిపించాయి.

    బ్రహ్మానందం

    బ్రహ్మానందం

    డింపుల్ గా కనపడ్డ బ్రహ్మానందం ఈ చిత్రంలో అదరకొడతారని అంతా ఊహించారు. అదే రేంజిలో పబ్లిసిటీ సైతం చేసారు. అయితే సెకండాఫ్ లో హైలెట్ అని పబ్లిసిటీ చేసిన బ్రహ్మానందం... కామెడీ ఎక్కడా పేలలేదు

    ప్రకాష్ రాజ్

    ప్రకాష్ రాజ్

    ఈ సినిమాకు ప్రకాష్ రాజే హీరో అని చెప్పాలి. ఆయన కోసమే ఈ చిత్రం తీసినట్లుంది. ద్విపాత్రాభినయంతో ప్రకాష్ రాజ్ వేరియేషన్ చూపించాడు. అతని అభిమానులుకు ఈ చిత్రం పండుగే.

     హీరో

    హీరో

    ఈ చిత్రంతో హీరోగా పరిచయమైన శ్రీనివాసు చాలా మంది కొత్త హీరోల కన్నా చాలా చాలా బెటర్. ముఖ్యంగా డాన్స్ లు,ఫైట్ లు రెగ్యులర్ కమర్షియల్ హీరోలాగ బాగా చేసాడు. యాక్టింగ్ చాలా ఈజ్ తో చేసాడు. వాయిస్ కూడా బాగుంది. కొద్దిగా సాన పడితే తెలుగుకు మంచి హీరో దొరికినట్లే.

    సమంత

    సమంత

    సినిమాకు సమంత ప్లస్ అయ్యింది కానీ... సమంతకు ఈ సినిమా ఏ మాత్రం ఉపయోగపడదు.

    ఐటం పాప

    ఐటం పాప

    తమన్నా తొలిసారిగా ఐటం గా కనిపించింది. ఓ కమర్షియల్ హంగుగా సినిమాకు ప్లస్ అయ్యిందనే చెప్పాలి.

    సంగీతం

    సంగీతం

    దేవిశ్రీ ప్రసాద్ మనస్సు పెట్టి చేయని సినిమాల్లో ఇది ఒకటిగా మిగిలిపోతుంది. ఆయన సినిమా కథకు తగినట్లే అతి రెగ్యులర్ పాటల ఇచ్చాడు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఓకే అనిపిస్తుంది.

    ఛాయాగ్రహణం

    ఛాయాగ్రహణం

    వినాయిక్ సినిమాలుకు రెగ్యులర్ గా ఛోటాగారే సినిమాటోగ్రఫి చేయటం వల్లనే ఏమో గానీ...కలర్స్ స్కీమ్, షాట్స్ అన్నీ పాత వినాయిక్ సినిమాను చూస్తున్న ఫీలింగ్ కలిగింది. ఆయన్ను అయినా మార్చాలి. లేదా... వినాయిక్ తన టేకింగ్ అయినా మార్చాలి అనిపించింది.

    ఎవరెవరు?

    ఎవరెవరు?

    నటీనటులు: బెల్లంకొండ శ్రీనివాస్, సమంత, ప్రకాష్‌రాజ్, తనికెళ్ల భరణి, రఘుబాబు, వెన్నెల కిశోర్, వేణు, ఫణి, ఫిష్ వెంకట్, పృధ్వి, జెన్ని, ప్రదీప్ రావత్, రవిబాబు, భరత్, ప్రవీణ్, ఆనంద్ భారతి, గుండు సుదర్శన్, అనంత్, అమిత్, నవీన్ తదితరులు
    మాటలు:కోన వెంకట్,
    రచన:గోపిమోహన్,
    కథ:కె.ఎస్.రవీంద్రనాధ్,
    ఫైట్స్: రామ్-లక్ష్మణ్, స్టన్ శివ, రవివర్మ, వెంకట్,
    పాటలు:చంద్రబోస్, రామజోగయ్యశాస్ర్తీ, భాస్కరభట్ల,
    ఎడిటింగ్:గౌతమ్‌రాజు,
    సంగీతం:దేవిశ్రీ ప్రసాద్,
    కెమెరా:ఛోటా కె.నాయుడు,
    సమర్పణ:బెల్లకొండ సురేష్,
    నిర్మాత:బెల్లంకొండ గణేష్‌బాబు,
    స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:వి.వి.వినాయక్.

    విడుదల తేదీ: 25, జూలై 2014

    ఫైనల్ గా అల్లుడు శ్రీను చిత్రం... రెగ్యులర్ గా వినాయిక్ చేసిన విచిత్రం.

    (గమనిక: వినోదం, అసభ్యం లేకపోవటం, సాంకేతిక విలువలు, కథన నైపుణ్యం తదితర అంశాల ఆధారంగా మా రేటింగ్ ఉంటుంది)

    English summary
    Alludu Seenu released today with average talk. Alludu Seenu Starring renowned producer Bellamkonda Suresh's son Bellamkonda Sreenivas and Samantha, directed by VV Vinayak. This film which also feautures Prakash Raj, Brahmanandam (as Dimple) and others in crucial roles is touted to be an out and out family entertainer studded with all essential commercial elements
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X