హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సినిమాల్లో నటించను: చిరు

By Staff
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
హైదరాబాద్: సినీ రంగంలోకి తిరిగి ఎట్టిపరిస్థితుల్లోనూ వెళ్లబోనని ప్రజారాజ్యం అధ్యక్షుడు చిరంజీవి స్పష్టం చేశారు. జోడు గుర్రాల స్వారీ తన వల్ల కాదని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చాక కూడా సినిమాల్లో నటించారంటే అప్పటి పరిస్థితులు వేరని, అప్పట్లో ఆయన పార్టీని పూర్తి స్థాయిలో పటిష్ఠం చేశాకే సినిమాల్లో నటించారని తెలిపారు. ప్రరాపాలో అంతర్గతంగా లోపాలున్నాయని, వాటిని సవరించి బలోపేతం చేయటంపైనే దృష్టి పెడుతున్నానని వివరించారు.

'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' సినిమాలో నటించబోతున్నారా అని ప్రశ్నించగా అలాంటి ప్రస్తావనే లేదని చెప్పారు. 'రాజకీయాల్లోకి వచ్చాక సినిమాల గురించి ఆలోచించటంలేదు. గతంలో ఒక సినిమాకి క్లాప్‌ కొట్టేందుకు, తాజాగా ఆడియో ఫంక్షన్‌కి వెళ్లాను. అక్కడ అందరూ ఇంకొక సినిమాలో నటిస్తే బాగుంటుందని సూచించారు. జోడు గుర్రాల స్వారీ చేయలేనని అక్కడే చెప్పాను. భవిష్యత్తులో ఎలాగుంటుందో చెప్పలేనన్నాను. సినీరంగం పుట్టినిల్లు అయితే రాజకీయరంగం మెట్టినిల్లు. పుట్టినిల్లు ఎంతగా నచ్చినా ఆడపిల్ల మెట్టినింటికి వెళ్లాక భర్తను వదిలి పుట్టింటికి వెళ్లలేదు కదా! సినీరంగాన్ని వదిలి రాజకీయాల్లోకి వచ్చినందుకు విచారమేమీ లేదు. ప్రస్తుతం నా దృష్టంతా రాజకీయాలపైనే. పార్టీని పూర్తిస్థాయిలో బలోపేతం చేయటానికే కృషి చేస్తాను. అదే నా లక్ష్యం. గమ్యం. ఇలాకాకుండా అంతా కోరుకుంటున్నారని సినీ రంగంలోకి వెళ్లటం ధర్మం కాదు' అని వివరించారు.

ఎన్నికల గుర్తుగా నాలుగింటిని తుదిపరిశీలనకు తీసుకున్నామని, వీటిలో సూర్యుడు గుర్తుపై తనతోపాటు ఎక్కువమంది నాయకులు మొగ్గుచూపారని చిరంజీవి తెలిపారు. అందరికీ సులువుగా అర్థమయ్యేలా ఉన్న గొడుగు కూడా బాగుందని, ఈ రెండింటిలో ఏదోఒకటి నిర్ణయించుకుంటామని వెల్లడించారు. సీనియర్‌ నేత శివశంకర్‌ ప్రత్యేక ఆహ్వానితునిగా సలహాలు ఇచ్చేవారని, ఇప్పుడైనా సలహాలు అడిగితే ఆయన వస్తారనే భావిస్తున్నానని తెలిపారు. ఆయన అసలు ప్రజారాజ్యం సభ్యత్వమే తీసుకోలేదట కదా అని ప్రస్తావించగా ఆయనకు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించాం అంటే అర్థమేమిటని ఎదురుప్రశ్నించారు.

యువరాజ్యం అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ పూర్తిచేయాల్సిన సినిమాలు ఉన్నందున ప్రస్తుతం ఆపనిలో ఉన్నారని, పార్టీకి అవసరమైనప్పుడు వస్తారని చిరంజీవి వెల్లడించారు. గ్రేటర్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశముందని అన్నారు. జులై ఆరో తేదీ నుంచి జిల్లాలకు వెళ్లాలని ప్రాథమికంగా నిర్ణయించినా, జిల్లా పరిశీలకులు వెళ్లివచ్చాక పర్యటించాలని భావిస్తుండటంతో ఇంకా తేదీలు ఖరారు చేయలేదని తెలిపారు.

తెదేపా, భాజపాలతో కలవం. తెదేపా, భాజపాలతో ఎట్టిపరిస్థితుల్లో పొత్తు పెట్టుకోబోమని చిరంజీవి స్పష్టం చేశారు. తెదేపాతోపాటు ప్రరాపాతోనూ కలవాలన్న సీపీఐ ప్రతిపాదన ఆచరణ సాధ్యం కాదని కొట్టిపడేశారు. లోక్‌సత్తా పార్టీ నేతలతో మాట్లాడలేదని, వారితో కలవటానికి అభ్యంతరం ఏమీలేదని పేర్కొన్నారు. కొవ్వూరు ఎమ్మెల్యే రామారావు నేరం చేశారనటానికి ప్రాథమిక సాక్ష్యాధారాలు ఏమీలేనందున బేషజాలకు పోకుండా కేసు తొలగించాలని సూచించారు. ఎమ్మెల్యే చేస్తున్న దీక్షకు మద్దతుగా మహిళారాజ్యం నేత శోభారాణి వెళ్లటం ఆమె వ్యక్తిగత నిర్ణయమని చెప్పారు. ప్రకాశం, కృష్ణా, పశ్చిమగోదావరి, తిరుపతి తదితరచోట్ల ప్రరాపా నేతల్ని వేధిస్తున్నారని, వారి వ్యాపారాలకు ఆటంకం కల్పిస్తున్నారని చిరంజీవి ఆరోపించారు. ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేయాలని, కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని విమర్శించారు. పోలీసులు వేధిస్తున్నారని, కేసులు బనాయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రజాసమస్యల పరిష్కారానికి ప్రయత్నించాలి గాని ఇలా చేయటం ఏమిటని ప్రశ్నించారు. ఇదంతా ప్రభుత్వ పెద్దలకు తెలిసే జరుగుతోందని తాను భావించటంలేదని వ్యాఖ్యానించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X