మంత్రి పదవుల కోసం ఢిల్లీ పైరవీలు

బుదవారం, అక్టోబర్ 28, 2009, 9:13 [IST]
Rosaiah
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి కె.రోశయ్య తన మంత్రివర్గ పునర్వ్యస్థీకరణకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు వార్తలు బలపడుతున్నాయి. కనీసం పది మందిని ఆయన కొత్తగా మంత్రివర్గంలోకి తీసుకోవచ్చుననే వార్తలు వస్తున్నాయి. దీంతో మంత్రి పదవులు ఆశిస్తున్నవారు, మంత్రి పదవులను కాపాడుకోదలుచుకున్న వారు పైరవీలు మొదలు పెట్టారు. చాలా మంది ఢిల్లీకి తమ మకాం మార్చారు. కాంగ్రెసు సీనియర్ శాసనసభ్యులు మంత్రి పదవులపై ఆశతో ఉన్నారు. కాటసాని, శంకరరావు లాంటి వారు నేరుగానే తమకు మంత్రి పదవులు కావాలనే విషయాన్ని బయట పెట్టారు. మంత్రుల నియామకంలో సీనియారిటికి ప్రాధాన్యం ఇవ్వాలని వారు కోరుతున్నారు.

పిసిసి అధ్యక్షుడు డి.శ్రీనివాస్, మంత్రులు ఎన్ రఘువీరా రెడ్డి, బొత్స సత్యనారాయణ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జె.గీతారెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ మల్లు భట్టి విక్రమార్క ఢిల్లీ చేరుకున్నారు. తమ తమ స్థాయిల్లో వారు తమ పదవులను కాపాడుకోవడానికి ప్రయత్నాలు సాగిస్తున్నట్లు సమాచారం. దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితులైన రఘువీరా రెడ్డి, బొత్సా సత్యనారాయణ తొలుత జగన్ కు గట్టిగా మద్దతిచ్చారు. ఇప్పుడు దాదాపుగా వారు రోశయ్య శిబిరంలో చేరిపోయారు. తాము విధేయంగా ఉంటామని వారు తమ ప్రకటనల ద్వారా సంకేతాలిస్తున్నారు. చాలా మంది మంత్రులు, సీనియర్ శాసనసభ్యులు తాము రోశయ్యకు అండగా ఉంటామని తమ ప్రకటనల ద్వారా అటువంటి సంకేతాలిస్తున్నారు.

రాష్ట్రంలోని రాజకీయ ప్రతిష్టంభనకు నవంబర్ నెలాఖరులోగా స్వస్థి పలికాలని కాంగ్రెసు అధిష్టానం ఆలోచిస్తోంది. ఇందులో భాగంగా వేగంగా పావులు కదుపుతోంది. ముఖ్యమంత్రి కె.రోశయ్య శాసనమండలి సభ్యుడు కావడంతో శాసనసభా పక్ష నేతగా మరొకరిని ఎంపిక చేయాల్సి ఉంటుంది. సీనియర్ మంత్రికి ఆ పదవి అప్పగిస్తారు. దీనిపై మంత్రి బొత్సా సత్యనారాయణ కన్నేసి ఉంచారు.
User Comments
[ మీ వ్యాఖ్య రాయండి ]
ఈ ఆర్టికల్ మీద మీరే మొదటి వ్యాఖ్య రాయండి .
1st Test , Lord's Cricket Ground, St John's Wood
England won by 5 wickets