
ముంబై: పుణె బాంబు పేలుడు కేసు దర్యాప్తులో పోలీసులు కొంత పురోగతి సాధించారు. ఈ సంఘటనకు సంబంధించి నలుగురు అనుమానితులను మంగళవారం అదుపులోకి తీసుకొన్నారు. నిషేధిత ఇండియన్ ముజాహిదీన్(ఐఎం)తో వీరికి సంబంధాలు ఉన్నట్లు వారు అనుమానిస్తున్నారు. ఇద్దరిని పుణెలోని కుదల్‌వాడి, జన్‌వాడి ప్రాంతాల్లో, మరో ఇద్దరిని ఔరంగాబాద్‌లో పట్టుకొన్నారు. కేసులో ప్రధాన నిందితుడిని త్వరలోనే అరెస్టు చేస్తామని పుణె పోలీస్ కమిషనర్ సత్యపాల్ సింగ్ చెప్పారు. బాంబు తయారీకి ఆర్‌డీఎక్స్‌తోపాటు అమ్మోనియం నైట్రేట్, పెట్రోలియం హైడ్రో కార్బన్ ను వాడినట్లు ఫోరెన్సిక్ లేబొరేటరీ ప్రాథమిక నివేదికలో వెల్లడైందని చెప్పారు. వాటిని ఎంత పరిమాణంలో వినియోగించారనే అంశం ఫలితాలు పూర్తిగా వచ్చిన తర్వాత తెలుస్తుందన్నారు. పేలుడు మృతుల సంఖ్య పదికి చేరింది. తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న లక్నోకి చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి అభిషేక్ సక్సేనా మంగళవారం చనిపోయినట్లు కమిషనర్ తెలిపారు.
Read: In English
అరెస్టయిన నిందితుల్లో ఇద్దరు..ఐఎం ముఖ్యనేత రియాజ్ భత్కల్, నకిలీనోట్ల చలామణిలో కింగ్‌గా పిలిచే షబ్బీర్ గంగావలీ అనుచరులని సమాచారం. భత్కల్ 2005-08 మధ్యకాలంలో పుణెలో ఉన్నప్పుడు కుదల్ వాడీ చిఖ్లీ ప్రాంతానికి చెందిన ఓ తుక్కువ్యాపారి వద్ద పనిచేస్తున్న వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అతడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గంగావలీ అనుచరుడ్ని జన్ వాడీ ప్రాంతంలో అరెస్టు చేశారు. కుదల్‌వాడీలో అనుమానిత వ్యక్తులకు ఆర్‌డీఎక్స్ చేరవేసినట్లు గంగావలీ అనుచరుడు అంగీకరించాడని దర్యాప్తు అధికారులు తెలిపారు. భత్కల్ అనుచరుడే జర్మన్ బేకరీలో పేలుడు పదార్థం ఉన్న బ్యాగును విడిచిపెట్టినట్లు భావిస్తున్నారు. సీసీటీవీ కెమెరాల్లో దృశ్యాల ఆధారంగా వారి పాత్ర నిర్ధారణ కానుంది. మరోవైపు పుణె పేలుడుకు తామే కారణమంటూ పాక్ కు చెందిన 'లష్కరే తోయిబా అల్ అలామీ' అనే ఉగ్రవాద సంస్థ పేర్కొంది. ఈ పేరుతో ఒక ఉగ్రవాద సంస్థ ఉన్నట్లు ఇప్పటివరకు ఎవరికీ తెలియదు.



















