
న్యూఢిల్లీ: జార్ఖండ్ లో ప్రస్తుతానికి జెఎంఎం నేత శిబూ సొరేన్ ప్రభుత్వనికి ఢోకా లేకుండా పోయింది. శిబూ సొరేన్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవాలనే నిర్ణయాన్ని బిజెపి ప్రస్తుతానికి వాయిదా వేసుకుంది. దీంతో సొరేన్ ముఖ్యమంత్రిగా మరి కొంత కాలం కొనసాగడానికి వీలు కలిగింది. తాము జెఎంఎం, జెడి-యు, ఆల్ జార్ఖండ్ విద్యార్థి సంఘం, బిజెపి రాష్ట్ర శాఖలతో చర్చించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని బిజెపి ప్రధాన కార్యదర్శి అనంతకుమార్ శుక్రవారం మీడియా ప్రతినిధులతో చెప్పారు.
Read: In English
బిజెపి అధ్యక్షుడు నితిన్ గడ్కరీ అధ్యక్షతన శుక్రవారం పార్టీ పార్లమెంటరీ సమావేశం జరిగింది. సొరేన్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకునే విషయంపై నిర్ణయాన్ని ప్రస్తుతానికి వాయిదా వేయాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. బిజెపి మద్దతు ఉపసంహరించుకుంటామని ప్రకటించిన తర్వాత పార్టీకి సొరెన్ నుంచి, ఆయన కుమారుడు హేమంత్ సొరేన్ నుంచి విడివిడిగా రెండు లేఖలు అందాయి. జార్ఖండ్ ను కాంగ్రెసు చేతిలో పెట్టకూడదనే ఉద్దేశంతోనే తమ నిర్ణయాన్ని ప్రస్తుతానికి వాయిదా వేసుకున్నట్లు అనంతకుమార్ చెప్పారు.

















