విశాఖపట్నం: ప్రభాస్ హీరోగా నటించిన బుజ్జిగాడు సినిమాలో సెకండ్ హీరోయిన్ పాత్రలో నటించిన కన్నడ భామ సంజన టీమ్ ఇండియా యువ క్రికెటర్ విరాట్ కోహ్లీతో ప్రేమాయణం కొనసాగిస్తున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. విశాఖపట్నంలో బుధవారం ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో విరాట్ కొహ్లీ దుమ్ము రేపిన విషయం తెలిసిందే. అతను కన్నడంలో మంచి డిమాండ్ ఉన్న గ్లామర్ గర్ల్ సంజనతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నట్లు సమాచారం. అలాగే ఆసీస్ తో జరిగిన రెండో వన్డేలో 118 పరుగులు సాధించి, తన అంతర్జాతీయ వన్డే క్రికెట్ కెరీర్ లో వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్న కోహ్లీ సంజన అంటే పడి చస్తున్నాడని వినికిడి. కానీ ఢిల్లీకి చెందిన ఈ యంగ్ బ్యాట్స్ మెన్ కెరీర్ అద్భుతంగా కొనసాగుతుండగా, ప్రేమదోమ అంటూ సంజన వెంట పడటం మంచిది కాదని కోహ్లీ కుటుంబసభ్యులు బుద్ధులు చెప్పుతున్నారని సమాచారం. అయితే, అతను ఆ మాటలను ఒంట పట్టించుకోవడం లేదని అంటున్నారు.