కిరణ్ కుమ్మక్కు: జగన్‌తోనా, చంద్రబాబుతోనా?

గురువారం, ఫిబ్రవరి 9, 2012, 19:41 [IST]
YS Jagan-Chandrababu Naidu
హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రతి రాజకీయ పార్టీ కుమ్మక్కు రాజకీయాల గురించే మాట్లాడుతున్నట్లోంది. ప్రతి రాజకీయ నాయకుడు కుమ్మక్కు ఆరోపణలే చేస్తున్నాడు. ఎవరు ఎవరితో కుమ్మక్కయ్యారో తేల్చుకోవడానికి ప్రజలు పరిస్థితులను, పరిణామాలను బేరీజు వేసుకోవాల్సి వస్తోంది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌తో ముఖ్యమంత్రి కుమ్మక్కయ్యారని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుండగా, కాంగ్రెసు పార్టీతో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కుమ్మక్కయ్యారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్, ఆయన పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. తాజాగా, ముఖ్యమంత్రి ప్రస్తావన తేకుండా ప్రభుత్వంలోని ఉన్నత స్థాయి వ్యక్తి చంద్రబాబుతో కుమ్మక్కయ్యారని, సమాచార కమిషనర్ల నియామకమే అందుకు నిదర్శనమని కిరణ్ కుమార్ రెడ్డిపై సమరం ప్రకటించిన మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి ఆరోపించారు. వైయస్ జగన్, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు కాంగ్రెసు పార్టీతో కుమ్మక్కయ్యారని చంద్రబాబు నాయుడు, టిడిపి నాయకులు ఆరోపిస్తున్నారు.

జగన్, కిరణ్ కుమార్ రెడ్డి కవలల్లా వ్యవహరిస్తున్నారని తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి గురువారం వ్యాఖ్యానించారు. వైయస్ జగన్‌ను విమర్శించేవారిపై ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవడమే అందుకు నిదర్శనమని ఆయన అన్నారు. పరస్పరం సమన్వయంతో వైయస్ జగన్, కిరణ్ కుమార్ రెడ్డి పనిచేస్తున్నారని ఆయన విమర్శించారు. కాంగ్రెసు నాయకులు కొంత మంది కూడా వైయస్ జగన్‌తో కిరణ్ కుమార్ రెడ్డి అవగాహనకు వచ్చారనే పద్ధతిలోనే మాట్లాడుతున్నారు. వి. హనుమంతరావు, పి. శంకరరావు వంటి నాయకులు పరోక్షంగా అవే మాటలు అంటున్నారు. జగన్ పట్ల ముఖ్యమంత్రి మెతక వైఖరి అవలంబిస్తున్నారని వారంటున్నారు. అంటే, వారిద్దరి మధ్య అవగాహన ఉందని నేరుగా అనకుండా ఆ రకంగా చెబుతున్నారని అనుకోవాలి.

కాంగ్రెసు నాయకులు, చంద్రబాబు కుమ్మక్కై దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డిని అప్రతిష్టపాలు చేయడానికి ప్రయత్నిస్తున్నారని వైయస్ జగన్ విమర్శిస్తున్నారు. చంద్రబాబు కుమ్మక్కు కావడం వల్లనే ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసులో ఆయనపై చర్యలు తీసుకోవడం లేదని జగన్ అంటున్నారు. సిబిఐ దర్యాప్తులో కూడా ఆ వైఖరి కనిపిస్తోందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు నేరుగానే వ్యాఖ్యానిస్తున్నారు. కెసిఆర్, వైయస్ జగన్ కుమ్మక్కయ్యారని తెలుగుదేశం పార్టీ నాయకులు విమర్శిస్తున్నారు. అదే సమయంలో కెసిఆర్ కాంగ్రెసుతో కుమ్మక్కయినట్లుగా కూడా వారు చెబుతున్నారు. కాంగ్రెసుతో కుమ్మక్కయి పోలవరం టెండర్లను లక్ష్మీరాజానికి చెందిన షూ కంపెనీకి ఇప్పించడానికి కెసిఆర్ సకల జనుల సమ్మెను విరమించారని తెలుగుదేశం నాయకులు ఆరోపిస్తున్నారు.

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై సొంత కాంగ్రెసు పార్టీ నాయకులు కొంత మంది రాజకీయాలు చేస్తూ ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. డిఎల్ రవీంద్రా రెడ్డి, పి. శంకరరావు ప్రత్యక్ష సమరానికి దిగితే పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ మరి కొంత మంది తెర వెనక రాజకీయాలు చేస్తున్నారనే మాట వినిపిస్తోంది. పార్టీలోని అంతర్గత ప్రత్యర్థులను ఎదుర్కోవడానికి కిరణ్ కుమార్ రెడ్డి ఇతర పార్టీల నేతలతో అంశాలవారీగా అవగాహనకు వస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
English summary
Every political party and political leader talking about collusion politics. Every political party is trying to put links with CM Kiran Kumar Reddy to other political party.
User Comments
[ మీ వ్యాఖ్య రాయండి ]
ఈ ఆర్టికల్ మీద మీరే మొదటి వ్యాఖ్య రాయండి .
1st Test , Lord's Cricket Ground, St John's Wood
England won by 5 wickets