అసెంబ్లీ ఆవరణలో విపక్షాల బైఠాయింపు, నిరసన

సోమవారం, ఫిబ్రవరి 13, 2012, 10:44 [IST]
Assembly
హైదరాబాద్: గవర్నర్ ప్రసంగంలో తెలంగాణ ప్రజల ఆకాంక్షను ప్రస్తావించకపోవడాన్ని నిరసిస్తూ తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యులు శానససభ ఆవరణలోని మీడియా పాయింట్ వద్ద కింద కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. గవర్నర్ ప్రసంగాన్ని నిరసిస్తూ తెలుగుదేశం, బిజెపి సభ్యులు కూడా మీడియా పాయింట్ వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. గవర్నర్ ప్రసంగం ప్రతులను చించేసి, ప్రసంగాన్ని బహిష్కరించి బయటకు వచ్చారు. మీడియా పాయింట్ వద్ద మాట్లాడడానికి తగిన ఏర్పాట్లు లేకపోవడాన్ని కూడా వారు నిరసించారు. శాసనసభ్యుల హక్కులను కాలరాసే విధంగా స్పీకర్ నాదెండ్ల మనోహర్ వ్యవహరిస్తున్నారని తెరాస సభ్యుడు కెటి రామారావు విమర్శించారు. తెలంగాణ అంశాన్ని ప్రస్తావించకపోవడం ప్రభుత్వ కుటిల నీతి అని ఆయన అన్నారు. తెలంగాణపై ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడాలని సభలో పట్టుబడుతామని, అలా ముందుకు రాకపోతే తాము ప్రైవేట్ బిల్లు ప్రతిపాదిస్తామని ఆయన చెప్పారు. కాంగ్రెసుతో పాటు తెలుగుదేశం పార్టీని కూడా నిలదీస్తామని ఆయన చెప్పారు. విప్ ధిక్కరించిన శానససభ్యులపై వేటు వేయలేని అసమర్థ స్థితిలో కాంగ్రెసు ప్రభుత్వం ఉందని తెరాస శాసనసభా పక్ష నేత ఈటెల రాజేందర్ వ్యాఖ్యానించారు.

గవర్నర్ ప్రసంగంలో ప్రజా సమస్యల ప్రస్తావన లేదని తెలుగుదేశం పార్టీ సభ్యుడు ఎర్రబెల్లి దయాకర రావు విమర్శించారు. గవర్నర్ కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా తొత్తుగా వ్యవహరిస్తున్నారని, తన పదవిని పొడగించుకునేందుకే కాంగ్రెసుకు గవర్నర్ అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఎర్రబెల్లి దయాకర్ రావు, మోత్కుపల్లి నర్సింహులు విమర్సించారు. తెలంగాణపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నాటకాలు ఆడుతున్నాయని మోత్కుపల్లి నర్సింహులు విమర్శించారు. ప్రభుత్వ రాసిచ్చిన కరపత్రాన్ని గవర్నర్ చదివారని ఆయన అన్నారు. ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని ఆయన విమర్శించారు. ఆబ్కారీ మంత్రి మోపిదేవి వెంకటరమణను ఎందుకు బర్తరఫ్ చేయడం లేదని ఆయన అడిగారు. తెలంగాణ పేరు చెప్పుకుని తెరాస పోలవరం టెండర్లలో పాలు పంచుకుందని, దానిపై విచారణ చేయాలని అడిగామని, అయినా ప్రభుత్వం ఏమీ మాట్లాడడం లేదని ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.

గపర్నర్ ప్రసంగంలో తప్పుడు లెక్కలున్నాయని బిజెపి పక్ష నేత జి. కిషన్ రెడ్డి విమర్శించారు. తెలంగాణపై ఇచ్చిన హామీని కాంగ్రెసు ప్రభుత్వం నిలబెట్టుకోలేదని, తెలంగాణపై కాంగ్రెసును దోషిగా నిలబెడుతామని, అందుకు నిరసనగానే గవర్నర్ ప్రసంగాన్ని బహిష్కరించామని ఆయన చెప్పారు. గవర్నర్ ప్రసంగాన్ని సిపిఐ సభ్యుడు గుండా మల్లేష్ విమర్శించారు.
English summary
Oppostion parties members expressed their protest against the Governer speech.
User Comments
[ మీ వ్యాఖ్య రాయండి ]
ఈ ఆర్టికల్ మీద మీరే మొదటి వ్యాఖ్య రాయండి .
1st Test , Lord's Cricket Ground, St John's Wood
England won by 5 wickets