ఉప ఎన్నికల పోరు: జగన్, కెసిఆర్ ఒకే బాట

సోమవారం, ఫిబ్రవరి 13, 2012, 16:05 [IST]
YS Jagan-K Chandrasekhar Rao
హైదరాబాద్: రాష్ట్రంలోని ఉప ఎన్నికలను ఎదుర్కోవడంపై కాంగ్రెసు పార్టీ వ్యూహాన్ని దెబ్బ తీసే ఎత్తుగడలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ఉన్నట్లు తెలుస్తోంది. ఉప ఎన్నికల విషయంలో కాంగ్రెసు పార్టీ ఓ రకంగా ఆలోచిస్తుంటే వైయస్ జగన్, కెసిఆర్ వ్యూహాలు మరో రకంగా ఉన్నాయి. రాష్ట్రంలో 24 శానససభా స్థానాలకు ఒకేసారి ఉప ఎన్నికలను ఎదుర్కోవడానికి కెసిఆర్, వైయస్ జగన్ ఇష్టపడుతున్నారు. అయితే, రెండు దశలుగా వాటిని ఎదుర్కోవడానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రణాళిక రచిస్తున్నట్లు చెబుతున్నారు. కాంగ్రెసు వ్యవహారంపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ, తెరాస దుమ్మెత్తి పోస్తున్నాయి.

తెలంగాణలోని ఆరు స్థానాలకు, కోవూరుకు ఉప ఎన్నికలు పూర్తయిన తర్వాత మిగతా 17 స్థానాలకు ఉప ఎన్నికలను ఎదుర్కునేలా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఎత్తులు వేస్తున్నారని ఆ పార్టీలు తప్పు పడుతున్నాయి. వైయస్ జగన్ వర్గానికి చెందిన 16 మంది కాంగ్రెసు శాసనసభ్యులపై అనర్హత వేటుకు, ప్రజారాజ్యం పార్టీ శానససభ్యురాలు శోభానాగిరెడ్డి రాజీనామా ఆమోదానికి స్పీకర్ నాదెండ్ల మనోహర్ సిద్ధపడ్డారని, అయితే కిరణ్ కుమార్ రెడ్డి స్పీకర్‌పై ఒత్తిడి తెస్తున్నారని ఆరోపిస్తున్నారు. జగన్ వర్గానికి చెందిన 17 మందిపై స్పీకర్ ప్రస్తుతం చర్యలు తీసుకుంటే 24 స్థానాలకు ఒకేసారి ఉప ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుంది. అయితే, ఒకేసారి 24 స్థానాలకు ఉప ఎన్నికలను ఎదుర్కోవడానికి కిరణ్ కుమార్ రెడ్డి భయపడుతున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. జగన్ వర్గం శాసనసభ్యులపై ఎందుకు వేటు వేయడం లేదని తెలుగుదేశం పార్టీ కూడా అడుగుతోంది. తెరాస శాసనసభ్యుడు కెటి రామారావు కూడా సోమవారం అదే ప్రశ్న వేశారు.

పైగా, తమపై వేటు వేయించుకోవడానికి వైయస్ జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులు వేగిరపడుతున్నారు. ఇందులో భాగంగానే రాష్ట్రంలోని 24 స్థానాలకు ఒకేసారి ఉప ఎన్నికలు నిర్వహించాలని వారు ఎన్నికల కమిషన్‌కు సోమవారం ఓ లేఖ రాశారు. దానికి తోడు, కిరణ్ కుమార్ రెడ్డిపై నైతికపరమైన ఒత్తిడి తేవడానికి కూడా సిద్ధపడినట్లు అర్థమవుతోంది. విప్ ధిక్కరించిన 17 మందిపై అనర్హత వేటు వేయకపోవడం సరికాదని, ఈ విషయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్‌పై కాంగ్రెసు సీనియర్లు మండిపడుతున్నట్లు వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన సాక్షి మీడియా సోమవారం ఓ వార్తాకథనాన్ని ఇచ్చింది. వారు సోనియా గాంధీకి ఫిర్యాదు చేయాలని అనుకుంటున్నట్లు కూడా తెలిపింది. అయితే, ఆ సీనియర్ల పేర్లు మాత్రం తెలియజేయలేదు. 17 మందిపై అనర్హత వేటు వేయడానికి స్పీకర్ తీర్పు కాపీలు సిద్ధం చేసుకున్నారని, అయితే కిరణ్ కుమార్ రెడ్డి స్పీకర్‌పై ఒత్తిడి తెస్తున్నారని సాక్షి మీడియా రాసింది. దీన్నిబట్టి కాంగ్రెసుపై నైతికంగా దెబ్బ వేయడానికి సిద్ధపడినట్లు అర్థమవుతోంది.
English summary
YSR Congress president YS Jagan and TRS president K Chandrasekhar Rao wan to face bypolls of 24 seats at a time.
User Comments
Kiran R 13 Feb 2012 04:25 pm
బాబు కిరణ్ ఒకలా ఆలోచిస్తున్నారు ....జగన్ కెసిఆర్ ఒకలా ఆలోచిస్తున్నారు.... ఒకళ్ళు విజయం మీద నమ్మకం తో ఉప ఎన్నికలు అన్నీ ఒకేసారి జరగాలి అని, ఇంకొకళ్ళు ఓటమి భయం తో వేరు వేరుగా జరగాలి అని....
lakshmi 13 Feb 2012 11:55 pm
నువ్వు కరెక్ట్ భయ్యా , కిరణ్ అండ్ బాబు ప్లాన్స్ ఈసారి జరగవ్
[ మీ వ్యాఖ్య రాయండి ]
1st Test , Lord's Cricket Ground, St John's Wood
England won by 5 wickets