కిరణ్‌పై ఫిర్యాదు చేయలేదు, నేను దిగజారలేదు: డిఎస్

సోమవారం, ఫిబ్రవరి 20, 2012, 8:37 [IST]
D Srinivas
న్యూఢిల్లీ: తాను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై అధిష్టానానికి ఫిర్యాదు చేయలేదని, ఆ స్థాయికి తాను దిగజారలేదని శాసనమండలి సభ్యుడు డి శ్రీనివాస్ ఆదివారం అన్నారు. బ్రహ్మాండమైన ప్రభుత్వం, మంచి పథకాలు, నిరుద్యోగులకు ఉద్యోగాలు అందిస్తున్నామని, అన్ని రంగాల్లో అభివృద్ధి జరుగుతోందని, ఇంతకుమించి ఉప ఎన్నికల్లో చెప్పాల్సింది ఏం ఉంటుందని ఆయన అన్నారు. ప్రజలు ఏది కోరుకుంటున్నారో అది చేసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోందన్నారు. ప్రభుత్వం బాగా పని చేస్తోందని, ఈ పథకాలే చెప్పి ఉప ఎన్నికల్లో ప్రజల్లోకి వెళతామని, అభివృద్ధే తమ నినాదమని చెప్పారు. పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, కోర్ కమిటీ సభ్యుడు ఆంటోనీ, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి గులాం నబీ ఆజాద్ తదితరులను కలిసిన డిఎస్ ఆదివారం సాయంత్రం ఎపి భవన్‌లో మీడియాతో మాట్లాడారు. కిరణ్‌కుమార్ రెడ్డి గతంలో మంత్రిగా పనిచేయకుండానే నేరుగా ముఖ్యమంత్రి అయినా తన కష్టమేదో తాను పడుతున్నారని కితాబిచ్చారు.

తన ధోరణిలో తాను బాగా కష్టపడుతున్నారని, కొత్త పథకాలతో పెద్ద ఎత్తున జనాభాకు లాభం చేకూర్చే చర్యలు చేపడుతున్నారని, ఆయనకు సహకరించి ప్రభుత్వ కార్యక్రమాలను విజయవంతం చేయాల్సిన బాధ్యత ప్రతి కాంగ్రెస్ కార్యకర్తపైనా ఉందని అన్నారు. తెలంగాణ సమస్య పరిష్కారానికి సమయం సమయం, సందర్భం, ముహూర్తం రావాలన్నారు. తెలంగాణ సమస్య తప్పకుండా పరిష్కారం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సిఎం కిరణ్‌పై మేడమ్‌కు తాను ఫిర్యాదు చేయలేదని డిఎస్ చెప్పారు. ముఖ్యమంత్రి అందరినీ కలుపుకుపోవటం లేదని మేడమ్‌కు తాను చెప్పలేదని, అలా చెబితే ఫిర్యాదు చేసినట్లే అవుతుందని అన్నారు. అసలు ఈ విషయంపై తనకు, సోనియాకు మధ్య చర్చే జరగలేదని చెప్పారు. ఒకరిపై ఫిర్యాదు చేసేంతటి కిందిస్థాయికి తాను దిగజారబోనని, తనది ఆ స్థాయి కాదని అన్నారు. ఏదైనా విషయం ఉంటే సిఎం, పిసిసి అధ్యక్షుడితో సహా రాష్ట్రంలో ఏ నాయకుడికైనా ముక్కుసూటిగా చెప్పగల ధైర్యం, సన్నిహిత సంబంధం తనకు ఉన్నాయని చెప్పారు.

ప్రస్తుత రాష్ట్ర రాజకీయాలపై సోనియాతో చర్చించామన్నారు. వారిని మర్యాదపూర్వకంగానే కలిశానన్నారు. వారి వద్ద అన్ని విషయాల గురించి కూలంకషంగా చర్చించానన్నారు. ఉప ఎన్నికల్లో ఏది ఎలా చేస్తే బాగుంటుందన్న అంశాలతో పాటు పార్టీ సంస్థాగత అంశాలపై కూడా తమ మధ్య చర్చ జరిగిందన్నారు. 2014లోనూ రాష్ట్రంలో కాంగ్రెస్సే అధికారంలోకి వస్తుందన్న ధీమా వ్యక్తం చేశారు. ఇప్పుడు పార్టీలో కుమ్ములాటలు ఉన్నా ఎన్నికల వరకు అందరూ కలిసి పోతారన్నారు.
English summary
MLC D Srinivas said that he did not complaint against CM Kiran Kumar Reddy to AICC president Sonia Gandhi.
User Comments
[ మీ వ్యాఖ్య రాయండి ]
ఈ ఆర్టికల్ మీద మీరే మొదటి వ్యాఖ్య రాయండి .
1st Test , Lord's Cricket Ground, St John's Wood
England won by 5 wickets