హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పెంపుడు, సొంత కొడుకుల కుమ్మక్కు: విజయమ్మపై రేవంత్

By Pratap
|
Google Oneindia TeluguNews

Revanth Reddy
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మపై తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి తీవ్రంగా ధ్వజమెత్తారు. పెంపుడు కొడుకు కిరణ్ కుమార్ రెడ్డి, సొంత కొడుకు వైయస్ జగన్ కుమ్మక్కు కాలేదా అని ఆయన వైయస్ విజయమ్మను అడిగారు. కుమ్మక్కు కాకపోతే జగన్‌కు చెందిన సాక్షి పత్రికకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కోట్లాది రూపాయల వాణిజ్య ప్రకటనలు ఎలా వస్తాయని ప్రశ్నించారు. తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి పాదయాత్రతో మిగిలి పార్టీల్లో కలకలం ప్రారంభమైందని ఆయన అన్నారు.

ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించాలని తమ పార్టీని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ డిమాండ్ చేయడంపై ఆయన తీవ్రంగా విరుచుకుపడ్డారు. అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తే దాన్ని అడ్డం పెట్టుకుని కేంద్ర ప్రభుత్వంతో, కాంగ్రెసు అధిష్టానంతో బేరాసాలు అడాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వ్యూహం పన్నుతోందని ఆయన అన్నారు. తమపై తప్పుడు ఆరోపణలు చేస్తుంటే, అవినీతి అసమర్థ పాలన సాగుతుంటే గతంలో తాము ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించామని, అప్పుడు చీకటి ఒప్పందాలు చేసుకుని ప్రభుత్వాన్ని కాపాడుకున్నారని, ఎవరు ఎటువైపు ఉన్నారో అప్పుడే స్పష్టత వచ్చిందని అన్నారు.

ఆ రోజు అవిశ్వాసం ప్రతిపాదించడానికి తగిన సంఖ్యా బలం వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి లేదని, ఈ రోజు అందుకు తగిన బలం ఉందని, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తే తాము ప్రభుత్వాన్ని కూల్చడానికి సహకరిస్తామని అన్నారు. ప్రభుత్వాన్ని కాపాడడమే కాకుండా రాష్ట్రపతి ఎన్నికల్లో యుపిఎ అభ్యర్థికి ఓటేశారని, కేంద్రంతో కుమ్మక్కు కావడం వల్లనే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఆ విధంగా వ్యవహరించిందని రేవంత్ రెడ్డి అన్నారు. అవిశ్వాస తీర్మానం ఎప్పుడు ప్రతిపాదిస్తారో కూడా తెలియకుండా మాట్లాడి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులపై విరుచుకుపడ్డారు.

వైయస్ జగన్ చంచల్‌గుడా జైలును పార్టీ కేంద్ర కార్యాలయంగా మార్చారని ఆయన వ్యాఖ్యానించారు. వైయస్ విజయమ్మ పెంపుడు కొడుకు కిరణ్ కుమార్ రెడ్డి, సొంత కొడుకు జగన్ కుమ్మక్కు కాకపోతే జగన్‌ను వందల మందిని జైలులో కలుసుకోగలుగుతారని ఆయన అడిగారు. సిసి కెమెరాలు పెట్టి జగన్ ఎన్నిసార్లు ఎవరెవరిని కలుస్తున్నారో మీడియాకు వెల్లడించాలని ఆయన ముఖ్యమంత్రిని డిమాండ్ చేశారు. కిరణ్ కుమార్ రెడ్డి, జగన్ కుమ్మక్కయి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని ఆయన దుయ్యబట్టారు.

English summary
Telugudesam party MLA Revanth Reddy has lashed out at YSR Congress honorary president YS Vijayamma. He alleged that Kiran kumar Reddy and YS Jagan have colluded each other.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X