వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'హైటెక్కు' సిఇవో చంద్రబాబు నాయుడు మళ్లీ వస్తారా?

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన ఘనతను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సంపాదించుకున్నారు. ఆయన 1994 నుంచి 2004 వరకు అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసి హైటెక్ రాజకీయ నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. సామాన్య రైతు కుటంబంలో పుట్టిన చంద్రబాబు నాయుడు సంప్రదాయబద్దమైన రాజకీయ నేత మాదిరిగా కాకుండా ఓ సంస్థను నడిపే సిఇవోగా ప్రభుత్వాన్ని నడిపారనే పేరును కూడా సంపాదించుకున్నారు.

చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లాలోని నారావారిపల్లెలో 1950 ఏప్రిల్ 20వ తేదీన జన్మించారు చంద్రగిరిలో పాఠశాల విద్య చదివారు. తిరుపతిలోని శ్రీవెంకటేశ్వర ఆర్ట్స్ కళాశాలలో డిగ్రీ చేశారు. ఆయన 1972లో బిఎలో డిగ్రీ పూర్తి చేసి ఎంఎం ఎకనమిక్స్‌లో చేరారు. డిఎల్ నారాయణ (ఆంధ్రప్రదేశ్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్) వద్ద ఎన్‌జి రంగా ఆర్థిక సిద్ధాంతాలపై పిహెచ్‌డి చేయడానికి రిజిష్టర్ చేసుకున్నారు. అయితే, రాజకీయాల్లో మునిగిపోయి ఆయన తన పరిశోధనను పూర్తి చేయలేకపోయారు.

Chandrababu Naidu: worked as CEO more than politician

చంద్రగిరిలో యువజన నాయకుడిగా ఆయన రాజకీయాల్లోకి ప్రవేశించారు. అత్యవసర పరిస్థితి కాలంలో ఆయన పులిచెర్ల యువజన కాంగ్రెసు అధ్యక్షుడిగా నియమితులయ్యారు. సంజయ్ గాంధీ సన్నిహితుల్లో ఒకరిగా మారారు. కాంగ్రెసు తరఫున చంద్రగిరి నుంచి పోటీ చేసి 1978లో శాసనసభకు ఎన్నికయ్యారు.

ముఖ్యమంత్రి టి. అంజయ్య ప్రభుత్వంలో 28వ యేటనే చంద్రబాబు సాంకేతిక విద్య, సినిమాటోగ్రఫీ మంత్రిగా పనిచేశారు. అతి చిన్న వయస్సులో మంత్రి పదవి చేపట్టిన ఘనత కూడా చంద్రబాబుకి దక్కుతుంది. ఈ సమయంలోనే ఎన్టీ రామారావు కూతురు భువనేశ్వరిని ఆయన వివాహమాడారు.

ఎన్నికలకు 9 నెలల ముందు చంద్రబాబు మామ ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారు. కాంగ్రెసును ఓడించి తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది. కొంత కాలం కాంగ్రెసులో ఉండి తన మామపై కూడా పోటీ చేస్తానని చెబుతూ వచ్చిన చంద్రబాబు ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరారు.

1984లో ఎన్టీ రామారావు ప్రభుత్వాన్ని నాదెండ్ల భాస్కర రావు సహాయంతో కూలదోసినప్పుడు తిరిగి ఎన్టీ రామారావు అధికారం చేజిక్కించుకోవడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారు. దాంతో ఆయనను ఎన్టీ రామారావు పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. అప్పటి నుంచి తన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వర రావును అంతర్గతంగా ఎదుర్కుంటూ పార్టీపై పట్టు సాధిస్తూ వచ్చారు.

తెలుగుదేశం ఓడిపోయిన కాలంలో పార్టీని నిలబెట్టడంలో చంద్రబాబు తీవ్రంగా కృషి చేశారు తెలుగుదేశం తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్టీ రామారావును ముఖ్యమంత్రి పీఠం నుంచి దింపి ఆయన 1995లో ఆ పదవినీ పార్టీనీ సొంతం చేసుకున్నారు. ఆ తర్వాతి 1999 ఎన్నికల్లో చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. అయితే, ఆ తర్వాత 2004, 2009 ఎన్నికల్లో పరాజయం పాలైంది.

తాను ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో చంద్రబాబు ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీకి, సాంకేతిక విద్యకు ప్రాధాన్యం ఇచ్చారు. ఆయన హయాంలోనే దాదాపుగా హైదరాబాదులో హైటెక్ సిటీ ఏర్పడింది. ప్రపంచవ్యాప్తంగా ఆయన హైటెక్ సిఎంగా, ఆసియన్ టైగర‌్‌గా పేరు పొందారు. ప్రపంచవ్యాప్తంగా మీడియా ఆయనను ప్రశంసలతో ముంచెత్తుతూ వచ్చింది. అటువంటి కాలంలో వ్యవసాయం దండుగ అని ఆయన అన్నారు. ఆ మాటలు ఇప్పటికీ ఆయనను వెంటాడుతూనే ఉన్నాయి.

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విభజన నేపథ్యంలో ఆయన సీమాంధ్రకు ముఖ్యమంత్రి కావడానికి ఎన్నికల్లో పోరాటం చేస్తున్నారు. హైదరాబాదును నిర్మించింది తానేనని, సీమాంధ్రలో కూడా అటువంటి నగరాన్ని నిర్మిస్తానని ఆయన హామీ ఇస్తున్నారు. సీమాంధ్రలను సింగపూర్‌గా మారుస్తానని కూడా ఆయన చెబుతున్నారు. ఆధునిక రాజకీయ నాయకులకు రోల్ మోడల్‌గా ముందుకు వచ్చిన చంద్రబాబు గత పదేళ్లుగా తిరిగి అధికారం సంపాదించుకోవడానికి నిరంతర పోరాటం చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఆయనకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ సవాల్ విసురుతున్నారు.

English summary
Born in a farmers community in Chittoor district, Nara Chandrababu Naidu, the Telugudesam president is striving to become CM to Seemandhra (Andhra Pradesh)
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X