మెదక్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నా మార్క్ పాలన వస్తే, బాబుకు స్థానం లేదు: కేసీఆర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఉప ఎన్నికల సమయంలో అతిగా మాట్లాడిన నేతలకు మెదక్ లోకసభ నియోజకవర్గ ప్రజలు బుద్ధి చెప్పారని, ఇంకా తన మార్క్ పాలన ప్రారంభం కాలేదని, ప్రతిపక్షాలు నిర్మాణాత్మక సూచనలు చేయాలి తప్ప ప్రజల ముందు పరువు తీసుకోవద్దని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మంగళవారం అన్నారు. మెదక్ లోకసభ ఉప ఎన్నికల్లో తెరాస అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి ఘన విజయం సాధించారు. ఈ సందర్భంగా కేసీఆర్ విలేకరులతో మాట్లాడారు.

ఎన్నికల ప్రచారం సమయంలో కొందరు పనికిమాలిన మాటలు మాట్లాడారన్నారు. అద్భుత విజయం అందించిన మెదక్ నియోజకవర్గ ప్రజలకు కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. ఇచ్చిన హామీలను తాము కచ్చితంగా అమలుపరుస్తామన్నారు. ప్రతిపక్షాలు నిర్మాణాత్మక విమర్శలు, సద్విమర్శలు చేయాలన్నారు. ప్రజల ముందు పరువు తీసుకోవద్దన్నారు.

తెరాస ప్రభుత్వం ఏం చేసినా తప్పు చూపించాలనుకునే విపక్షాలకు ప్రజలు బుద్ధి చెప్పారన్నారు. తమకు వామపక్షాలు మద్దతు పలికాయని, అందుకు కృతజ్ఞతలు అన్నారు. ఏదో హడావుడిగా కార్యక్రమాలు చేయాలని కొందరు చెబుతున్నారని, అలా చేస్తే భవిష్యత్తు తరాలకు ఇబ్బంది కలుగుతుందన్నారు. రాష్ట్రంలో ఇంకా తెరాస, కేసీఆర్ మార్క్ పాలన ప్రారంభమే కాలేదని, అది ప్రారంభమైతే ఏ పార్టీ కూడా తమ ముందు నిలువదన్నారు.

KCR responds on Medak Lok Sabha win

ఈ ఉప ఎన్నిక ద్వారా టీడీపీకి, చంద్రబాబుకు స్థానం లేదని తేలిపోయిందన్నారు. ఆ పార్టీకి నూకలు చెల్లినట్లే అన్నారు. ప్రజలు కోరుకున్న బంగారు తెలంగాణ కోసం అహర్నిషలు పని చేస్తామన్నారు. రాబోయే పక్షం రోజుల్లో మా పని ప్రారంభమవుతుందన్నారు. అసెంబ్లీ సమావేశాల పైన తెలంగాణ రాష్ట్రానికి వెసులుబాటు ఉందని, అవశేష ఏపీకి అది లేదన్నారు.

అర్హులందరికీ రేషన్ కార్డులు ఇస్తామని, బియ్యం కోటా పెంచే ఆలోచన చేస్తున్నామన్నారు. ఇళ్ల అక్రమాల పైన సీఐడీ విచారణ, హైదరాబాదులో అక్రమ కట్టడాల కూల్చివేతను, సర్వే పైన విపక్షాలు రాద్దాంతం చేసినా ప్రజలు వాటిని ఆమోదించారన్నారు. ఎన్నికల ప్రచారం సమయంలో టీడీపీ నేతలు ఇష్టారీతిగా మాట్లాడారని, కొంత మీడియా కూడా పక్షపాతం చూపిందన్నారు. బీజేపీ మూడో స్థానానికి పడిపోయినా అది నైతిక విజయం ఎలా అవుతుందన్నారు.

ఈ ఉప ఎన్నికల్లో దేశంలో అన్నింటికంటే తెరాసకే ఎక్కువ మెజార్టీ వచ్చిందన్నారు. స్వయంగా మోడీ రాజీనామా చేసిన వడోదరలోనే బీజేపీ.. గతంలో ఐదు లక్షలకు పైగా మెజార్టీతో గెలిస్తే, ఈసారి లక్షకు పైగా మాత్రమే ఉందన్నారు. దసరా నుండి పథకాలను ప్రారంభిస్తామని చెప్పారు. దసరా, దీపావళికి మధ్య చాలా ఆదేశాలు ఉంటాయన్నారు. గత ప్రభుత్వం చేసిన మంచిని తాము స్వీకరిస్తామని, చెడును మాత్రం పక్కన పెడతామన్నారు. రుణమాఫీ కచ్చితంగా చేస్తామన్నారు.

ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీని కలిసినప్పుడు తెలంగాణ అభివృద్ధిపై హామీ ఇచ్చారని చెప్పారు. వంద రోజుల పాలనను ఎలా బేరీజు వేస్తారని ప్రశ్నించారు. ఇంకా తాము పనే ప్రారంభం కాలేదన్నారు. ఓ రోజు ఆలస్యమైన తాము పకడ్బందీగా తెలంగాణ అభివృద్ధిపై దృష్టి సారిస్తున్నామన్నారు. పార్టీ ప్లీనరీలో చర్చించాక నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తామన్నారు. 100 రోజుల పాలనకు మార్కులేయడానికి ఇది సినిమా కాదని, ప్రజలు తమకు మార్కులేశారన్నారు.

రాజధానిలో ఘోరమైన అడ్మినిస్ట్రేషన్ ఉందన్నారు. హైదరాబాదులో ఇన్ని లక్షల ఇళ్లు ఉన్నట్లు జీహెచ్ఎంసీకే తెలియదన్నారు. విద్యుత్ విషయంలో మనకు మరో మూడేళ్ల వరకు ఇబ్బందులు తప్పవన్నారు. ఈ రోజు నుండి మూడేళ్ల తర్వాత 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తామని చెప్పారు. చరిత్రలో కనివిని ఎరగని రీతిలో రోడ్ల నిర్మాణం చేస్తామన్నారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు డబ్బులు ఇచ్చారని ఆరోపించారు.

English summary
Telangana Rastra CM K Chandrasekhar Rao responded on Medak Lok Sabha winning.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X