వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పేచీ లేకుండా, రాజధానికి 4.5 లక్షల కోట్లు: కమిటీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రాజధాని వికేంద్రీకరణతోనే రాష్ట్ర భవిష్యత్‌లో ఎలాంటి పేచీలు లేకుండా అభివృద్ధి సాధించవచ్చని శివరామకృష్ణన్ కమిటీ తన నివేదికలో చెప్పింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి అనువైన ప్రాంతాన్ని ఎంపిక చేయటంతోపాటు వివిధ అంశాలపై అధ్యయనానికి ఏర్పాటైన శివరామకృష్ణన్ కమిటీ రూపొందించిన సమగ్ర నివేదికను శుక్రవారం అందుకున్న హోంశాఖ, తక్షణం కేంద్రం ఆమోదానికి పంపించింది.

5 నెలలపాటు ఆంధ్రలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించి, పలువర్గాల అభిప్రాయాలు క్రోడీకరించి, క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్ధితులు అధ్యయనం చేసిన కమిటీ నిర్ణీత గడువుకంటే రెండురోజులు ముందుగానే నివేదికను సమర్పించింది. 187 పేజీల నివేదికలో రాజధాని ఎక్కడ ఉండాలన్న అంశాన్ని మాత్రం స్పష్టంగా పేర్కొనలేదు. కేవలం సలహాలకే పరిమితం. రాజధాని నిర్మాణంతో ముడిపడి ఉన్న అనేక అంశాలపై కమిటీ లోతుగా అధ్యయనం చేసింది. ఇతర రాష్ట్రాలు ఎదుర్కొన్న అనుభవాలను నివేదికలో పొందుపర్చింది.

నివేదికలో.. రాష్ట్ర విజభన పర్యవసానంగా 13 జిల్లాలతో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ వ్యవసాయం పైనే ఎక్కువగా ఆధారపడి ఉంది. అవిభక్త రాష్ట్రంలో హైదరాబాద్ పరిసరాలు, ముఖ్యంగా హైదరాబాద్ ప్రపంచస్థాయి నగరంగా అభివృద్ధి చెందటంలో ఆంధ్రనుంచి తరలివెళ్లిన పెట్టుబడులే ముఖ్యభూమిక పోషించాయి. విభజన జరిగినప్పటికీ ఆంధ్రప్రదేశ్ త్వరితగతిన అభివృద్ధి చెందటానికి పుష్కలమైన అవకాశాలు ఉన్నాయి. సారవంతమైన భూములు, కృష్ణ గోదావరి నదులు ఉన్నాయి.

Panel on capital leaves final choice to AP govt.

విశాఖపట్టణం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతోంది. 13 జిల్లాల్లో అభివృద్ధికి అవకాశాలు మెండుగానే ఉన్నాయి. వ్యవసాయం, పర్యాటకం, పరిశ్రమలు, వ్యవసాయ అనుబంధ పరిశ్రమల అభివృద్ధికి తగిన ప్రణాళికలు రూపొందించి అమలుచేసిన పక్షంలో వచ్చే రెండున్నర దశాబ్దాల్లోనే ఆంధ్రప్రదేశ్ గణనీయమైన అభివృద్ధి సాధించగలుగుతుందని కమిటీ అభిప్రాయం. విజయవాడ- గుంటూరు నగరాల మధ్య రాజధాని రావాలని ముఖ్యమంత్రి, ఆయన మంత్రివర్గ సహచరులు అభిప్రాయపడుతున్నారు.

ఈ రెండు నగరాలే తప్పించి ఇతర ప్రాంతాలు రాజధానికి అనుకూలంగా లేవని భావించటం సమంజసం కాదు. ఈ రెండు ప్రాంతాలతోపాటు గ్రేటర్ విశాఖ, నెల్లూరు, తిరుపతి, కడప, అనంతపురం ప్రాంతాలకు రాజధానిగా అభివృద్ధి చెందటానికి కావలసిన సత్తా ఉంది. రాజధాని నిర్మాణానికి ప్రాథమికంగా 1500 ఎకరాల భూమి కావాల్సి ఉంటుంది. ఇంత పెద్ద మొత్తంలో భూమి ఒకేచోట లభించే అవకాశాలు లేవు.

భవిష్యత్‌లో రాజధాని విస్తరిస్తే, డిమాండ్ 15 వేల ఎకరాల వరకూ పెరిగే సూచనలు ఉన్నాయి. ఇప్పటి పరిస్థితుల్లో భూసేకరణ అంత సులువు కాదు. విజయవాడ - గుంటూరు మధ్య భూమి ధర సామాన్యులకు అందుబాటులో లేదు. తన అవసరాల కోసం భూమిని సేకరించటం ప్రభుత్వానికి కష్టం కావొచ్చు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కార్యాలయాలు ఏర్పాటు చేయాలని కమిటీ సూచించింది.

13 జిల్లాల ప్రధాన కేంద్రాల నుంచి కొంతదూరంలో 25 హెక్టార్లకు మించిన ప్రభుత్వ భూములు ఉన్నాయి. వీటిని సద్వినియోగం చేసుకునే ప్రయత్నాలు చేయాలని కమిటీ సూచించింది. విజయవాడ నగరాభివృద్ధి సంస్థ పరిధిలోని మంగళగిరి, గుంటూరు, తెనాలి ప్రాంతంలో మంత్రులు అధికార నివాసాలు నిర్పించాలని కమిటీ సిఫార్సు చేసింది. నిర్మాణ వ్యయం పెరిగిపోకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కమిటీ సూచించింది.

విభజన చట్టంలో కేంద్రం ఆమోదించిన వివిధ పథకాల అమలుకు నాలుగున్నర లక్షల కోట్ల రూపాయల మేర ఆర్థిక సాయం ఆంధ్రప్రదేశ్‌కు దక్కాల్సి ఉంది. ఈ నిధులను సకాలంలో రాబట్టుకోవటంతోపాటు నిధులను ఖర్చు చేయగల సాధన సంపత్తి సమకూర్చుకోవాలని కమిటీ సూచించింది.

భవనాల నిర్మాణానికి 10,519 కోట్లు, ప్రాథమిక సదుపాయల కల్పనకు 1536 కోట్లు, ఇప్పుడున్న సదుపాయాల మెరుగుదలకు 5861 కోట్లు, రాజభవన్ నిర్మాణానికి 1271 కోట్లు, డైరక్టరేట్ల నిర్మాణానికి 6000 కోట్లు, అతిథి భవనాల నిర్మాణానికి 210 కోట్లు ఖర్చవుతుందని కమిటీ అంచనా వేసింది. రాజ్‌భవన్‌కు 15 ఎకరాలు, విధాన సభకు 80నుంచి 100 ఎకరాలు, హైకోర్టుకు 100 ఎకరాల భూమి కావాల్సి ఉంటుందని కమిటీ అంచనా వేసింది.

వీటి నిర్మాణానికి కనీసం నాలుగేళ్లు పట్టొచ్చన్నది కమిటీ అంచనా. రాజధాని నగరం పక్కనే అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఉండాలన్న విధానానికి స్వస్తి చెప్పి విశాఖలో హైకోర్టు, అనుబంధ ట్రిబ్యునల్స్, ప్రభుత్వ డైరక్టరేట్లు ఏర్పాటు చేయాలని కమిటీ సూచించింది. విశాఖ పారిశ్రామికంగా సాధిస్తున్న అభివృద్ధిని పరిగణనలోకి తీసుకుని విశాఖ- కాకినాడ మీదుగా చెన్నై వరకూ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి చేయాలని కమిటీ సూచించింది.

అనంతపురంలో హైకోర్టు బెంచ్ నేలకొల్పాలని సిఫార్సు చేసింది. తమకు ప్రతి ఒక్క విషయంలో అన్యాయం జరిగిందని రాయలసీమవాసులు వాపోతున్నారు. ముఖ్యంగా రాజధానిని హైదరాబాద్‌కు మార్చటానికి అంగీకరించి తప్పుచేశామని కర్నూలువాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నీరు, రవాణా లభ్యత తక్కువగా ఉన్నందున ఈ ప్రాంతాలను రాజధానిగా అభివృద్ధి చేయటానికి వీల్లేదని భావించటం సబబు కాదు.

రాయలసీమలోని ఈ రెండు ప్రాంతాలకు నీటిని అందించటం సాధ్యపడదని అనుకోవటం తప్పే అవుతుందని కమిటీ అభిప్రాయ పడింది. కర్నూలు - అనంతపురం బెంగుళూరుతో కలిపి తరువాత బెంగళూరు నుంచి లేపాక్షి మీదుగా ముంబయికి రహదారి కారిడార్ నిర్మించటానికి వీలుందని కమిటీ సూచించింది. విజయవాడ నుంచి 150 కిలోమీటర్ల పరిధిలో భూకంపాలకు అవకాశం ఉంది. అందువల్ల రాజధానిని ఇదే ప్రాంతంలో కేంద్రీకరించటం కూడా భవిష్యత్‌కు మంచిది కాదని అభిప్రాయపడింది.

ముఖ్యమంత్రి కార్యాలయాన్ని గన్నవరం, ఇతర కార్యాలయాలను నూజివీడు, ముసునూరులో ఏర్పాటు చేయాలని కమిటీ సిఫార్స్ చేసింది. విభజన చట్టం మేరకు పదేళ్లు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా కొనసాగే వీలు ఉన్నప్పటికీ అంతవరకూ ఆగకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వీలైనంత త్వరగా రాజధాని నిర్మాణం పనులు పూర్తి చేసుకునే దిశగా చర్యలు తీసుకోలని కమిటీ హితవు పలికింది.

13 జిల్లాలకు విద్య, వైద్యం, రవాణా, ప్రాథమిక సదుపాయల కల్పనలో సమానావకాశాలు ఇవ్వాలని కమిటీ సూచించింది. విశాఖ, గన్నవరం, తిరుపతి విమానాశ్రయాల అభివృద్ధికి తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది. నడికుడి - శ్రీకాళహస్తి రైలు మార్గానికి నిధులు సంపాదించి త్వరితగతిన పూర్తి చేసిన పక్షంలో రాయలసీమకు లాభం కలుగుతుంది.

English summary
The Sivaramakrishnan Committee submitted its report to the Union Home Ministry on Wednesday and stuck to its mandate of suggesting various alternatives for location of the capital of Andhra Pradesh and not one place.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X