వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నా బ్యాంకు ఖాతా మూసేయాలన్నారు: ప్రధాని మోడీ

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఆర్థిక సాధికారత దిశగా నరేంద్ర మోడీ సర్కార్ గురువారం మరో ముందడుగు వేసింది. దేశంలోని పేదలందరికీ అభివృద్ధి ఫలాలను అందించాలన్న బృహదాశయంతో జనధన యోజనను పెద్ద ఎత్తున చేపట్టింది. ఒక్క రోజులోనే దేశ వ్యాప్తంగా కోటిన్నర బ్యాంకు ఖాతాలు ప్రారంభమయ్యాయి. ఈ పథకాన్ని ఢిల్లీలో ప్రారంభించిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. ‘మహాత్మా గాంధీ సాంఘిక అస్మృశ్యతను రూపుమాపేందుకు పోరాడారు. దేశంలో పేదరికం లేకుండా చేయాలంటే ఆర్థిక అస్పృశ్యతను తొలగించాలి. ప్రతి ఒక్కరిని ఆర్థిక వ్యవస్థతో అనుసంధానం చేయాలి' అని అన్నారు.

‘చదువుకునేటప్పుడు నాకూ దేనా బ్యాంకులో ఖాతా ఉండేది.. డబ్బుల్లేక 20ఏళ్లు లావాదేవీలే జరపలేదు. ఖాతా మూసేయాలని బ్యాంకు అధికారులు ఇంటికొచ్చేవారు. ఇప్పుడు ఖాతా తెరవాలంటూ బ్యాంకు అధికారులే జనం ఇళ్లకొస్తున్నారు' అని ఈ సందర్భంగా మోడీ అన్నారు. తొలి రోజునే కోటిన్నర బ్యాంకు ఖాతాలు తెరుచుకోవడాన్ని ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక ప్రక్రియగా అభివర్ణించారు. కేంద్రంలో అధికారాన్ని చేపట్టిన వంద రోజుల్లోపే తమ ప్రభుత్వం వినూత్న రీతిలో ఈ బృహత్ పథకాన్ని చేపట్టిందన్నారు. ప్రధాని జనధన్ యోజనను వచ్చే ఏడాది జనవరి 15నాటికి ఏడున్నర కోట్ల మందికి విస్తరిస్తామన్నారు.

PM Modi launches JDY; to focus on combating financial untouchability

జీరో బ్యాలెన్స్‌తో పాటు రూపే డెబిట్ కార్డు, ప్రమాద బీమాగా లక్ష రూపాయలతో పాటు జీవిత బీమాగా మరో 30వేల రూపాయలను ఖాతాదారులకు అందిస్తామని వెల్లడించారు. అనంతర కాలంలో ఖాతాదారులందరికీ 5వేల రూపాయల వరకూ ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యాన్నీ వర్తింపజేస్తామని తెలిపారు. ఆర్థిక వ్యవస్థలో దేశ ప్రజలందరూ మమేకమైనప్పుడే ప్రగతి విస్తరిస్తుందని, అభివృద్ధి వేగాన్ని పుంజుకుంటుదని ఉద్ఘాటించారు. బ్యాంకు ఖాతా తెరిస్తే.. ప్రతి ఒక్కరూ జాతీయ ఆర్థిక స్రవంతి దిశగా అడుగు వేసినట్టేనని..అందుకే ఈ పథకానికి మరింత ఊతాన్నిస్తున్నామని ప్రధాని మోడీ తెలిపారు.

ఆర్థిక వ్యవస్థను పేదల ముంగిళ్లకు తీసుకెళ్లే లక్ష్యంతోనే 1969లో బ్యాంకుల జాతీయకరణ జరిగిందని గుర్తు చేశారు. కానీ దేశానికి స్వాతంత్య్రం వచ్చి 68 సంవత్సరాలు పూర్తయినా కనీసం 68శాతం మంది ప్రజలకు కూడా బ్యాంకింగ్ వ్యవస్థ విస్తరించలేక పోవడం ఆవేదన కలిగిస్తోందన్నారు. ఆర్థిక విష చక్రం నుంచి పేదలకు విముక్తి కలిగించే ఉత్సవంగా దేశ వ్యాప్తంగా జరిగిన ఈ కార్యక్రమాన్ని ఆయన అభివర్ణించారు. మూడు దశల్లో అమలయ్యే ఈ పథకంలో భాగంగా ఖాతాదారులకు సూక్ష్మ పెన్షన్ సౌకర్యాన్నీ కల్పిస్తామని చెప్పారు.

ఒకే రోజులో కోటిన్నర బ్యాంకు ఖాతాలు తెరుచుకోవడం దేశ ఆర్థిక వ్యవస్థకూ కొండంత బలాన్నిచ్చేదే అవుతుందన్నారు. ఖాతా మొదలైన 6నెలల తర్వాత 5వేల రూపాయల చొప్పున ప్రతి ఒక్కరూ రుణం తీసుకునే వీలుంటుందన్నారు. ఒక్క రోజులో అనేక రికార్డులను సృష్టించడం ఎంతో ఆనందాన్ని, సంతృప్తిని కలిగిస్తోందని, అలాగే ఈ పథకం ద్వారా ఉద్దేశించిన లక్ష్యాలను సునాయాసంగా సాధించగలుగుతామన్న ధీమాను, స్ఫూర్తిని అందించిందని మోడీ పేర్కొన్నారు. ఇప్పటి వరకూ కేంద్రంలో పగ్గాలు చేపట్టిన ఏ ప్రభుత్వం కూడా ఒక్క రోజులో 77వేల ప్రాంతాల్లో ఇంత భారీ పథకాన్ని ప్రారంభించలేదన్నారు.

ప్రభుత్వ సబ్సిడీ పథకాల్లో ఉన్న లోపాలను తొలగించడానిక్కూడా ఈ పథకం ఎంతగానో ఉపకరిస్తుందన్నారు. బ్యాంకు ఖాతాకు సంబంధించి తన వ్యక్తిగత అనుభవాన్ని మోదీ గుర్తు చేసుకున్నారు. తాను స్కూల్లో చదువుకునే రోజుల్లో దేనా బ్యాంకులో ఖాతా తెరిచానని, ఆ ఖాతాలో డబ్బులు వేసే పరిస్థితి లేకపోవడం వల్ల ఇరవై ఏళ్ల పాటు ఎటువంటి లావాదేవీలు లేకుండానే ఉండిపోయిందని మోదీ తెలిపారు.

ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ దేశంలో 58శాతం మంది ప్రజలకు బ్యాంకు ఖాతాలున్నాయన్నారు. అంటే మరో పది కోట్ల కుటుంబాలు బ్యాంకింగ్ వ్యవస్థకు దూరంగానే ఉంటున్నాయని, అందుకు కారణం ఈ సేవలు వారికి అందుబాటులో లేకపోవడమేనని చెప్పారు. దేశ వ్యాప్తంగా ఏకకాలంలో మొదలైన ఈ కార్యక్రమంలో 20మంది ముఖ్యమంత్రులు, రాజ్‌నాథ్, సుష్మా స్వరాజ్, స్పృతి ఇరాని, వెంకయ్య నాయుడు సహా అనేక మంది కేంద్ర మంత్రులు పాల్గొన్నారు.

English summary
Launching his government’s first big ticket social welfare programme, the Pradhan Mantri Jan Dhan Yojana, Prime Minister Narendra Modi on Thursday gave a call for eradicating what he termed as “financial untouchability” of the poor by opening at least one bank account for every family in the country in less than six months.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X