సింగపూర్ లో కార్తీక వన భోజనాలు

బుదవారం, నవంబర్ 4, 2009, 9:35 [IST]
Singapore
సింగపూర్: కార్తీక వనభోజనాల సందడి ఆంధ్రప్రదేశ్ లోనే కాదు విదేశాల్లో కూడా కన్పిస్తోంది. సింగపూర్‌ తెలుగు సమాజం నిర్వహించిన వనభోజనాల కార్యక్రమం సందడిగా సాగింది. స్థానిక ఈస్ట్‌ కోస్ట్‌ క్యాజుల్‌ బీచ్‌ పార్కులో నిర్వహించిన ఈ కార్యక్రమానికి కుటుంబ సమేతంగా తరలివచ్చిన ప్రవాసాంధ్రులు సముద్ర తీరంలోని పచ్చని చెట్ల కింద పసందైన వంటకాలతో కూడిన విందారగించి ఆట పాటలతో ఉల్లాసంగా గడిపారు. సముద్రపు ఒడ్డున ఆహ్లాదకర వాతావరణంలో జరిగిన వనభోజనాలు తెలుగు వారికి మధురానుభూతిని మిగిల్చాయి.

ఈ కార్యక్రమంలో భాగంగా జంటలకు సరదా ఆటలు, చిన్న పిల్లలకు పరుగు పందాలు, చిత్రలేఖనం పోటీలు, మ్యూజికల్‌ ఛైర్స్‌, పురుషుల కబడ్డీ, వాలీబాల్‌, మహిళలకు అంత్యాక్షరి, లేమాన్‌ అండ్‌ స్పూన్‌ పోటీలు నిర్వహించారు. చిన్నారులకు ప్రత్యేకంగా నిర్వహించిన ఫేస్‌ ఫైటింగ్‌ అలాగే పీచు మిఠాయి వైవిధ్యంగా ఉండి అందరినీ ఆకట్టుకున్నాయి. ఆ తర్వాత ఈ ఆటల పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులను ప్రదానం చేసారు.

ఈ సందర్భంగా సింగపూర్‌ తెలుగు సమాజం ఏర్పాటు చేసిన అసలు సిసలైన తెలుగు భోజనం అందర్నీ ఎంతగానో మెప్పించింది. పూతరేకులు, గోంగూర పచ్చడి, గారెలు తదితర పిండివంటలతో కూడిన పసందైన విందు భోజనం తోటి తెలుగు వారితో కలిసి తినడం అందరికీ మధురమైన అనుభూతిని కలుగజేసింది. ఈ కార్యక్రమం సింగపూర్‌లో తెలుగు వారు మునుపెన్నడూ నిర్వహించని విధంగా విజయవంతం కావడం పట్ల పలువురు ప్రవాసాంధ్రులు హర్షం వ్యక్తం చేశారు.
User Comments
[ మీ వ్యాఖ్య రాయండి ]
ఈ ఆర్టికల్ మీద మీరే మొదటి వ్యాఖ్య రాయండి .
1st Preliminary Final , Subrata Roy Sahara Stadium, Gahunje
Kolkata Knight Riders won by 18 runs