వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎచ్చమ్మ కతల యశోదారెడ్డి

By Staff
|
Google Oneindia TeluguNews

తెలంగాణలో పురుషులు చదువుకోవడమే అపురూపమైన కాలంలో ఉన్నత చదువులు చదివి విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌ స్థాయిని, అధికార భాషా సంఘం అధ్యక్ష పదవిని అందుకొన్న విదుషీమణి డాక్టర్‌ పి. యశోదారెడ్డి. తెలంగాణ దొరల కుటుంబంలో పుట్టినా, దొరల కుటుంబంలోనే మెట్టినా ఫ్యూడల్‌ భావాలను దరి చేరనీయక అచ్చమైన తెలంగాణ మాండలికంలో కథలు రాసిన తొలి తరం తెలంగాణ రచయిత్రి యశోదారెడ్డి.

పండిత వంశంలో మెట్టి, ఉన్నత చదువులు చదివినా ప్రజల భాషలో రాయడానికి కంకణం కట్టుకొని రాసి చూపిన పండిత రచయిత్రి. ఆమెకు తెలంగాణ మాండలిక భాషపై విపరీతమైన అభిమానం. బేషిజాలను పక్కకు పెట్టి అచ్చమైన తెలంగాణ ఆడపడుచులా మాండలికంలోనే మాట్లాడటం, ఉపన్యసించటంలో దిట్ట. తెలంగాణ భాషపై, జీవితంపై అనన్యమైన ప్రేమాభిమానాలతో తన పేరును కూడా ఎచ్చమ్మగా మార్చుకొని ఎచ్చమ్మకథలు సంపుటి వెలువరించారు యశోదారెడ్డి. ఈమె కలం నుంచి వెలువడిన మరో కథా సంపుటులు 'మా ఊరి ముచ్చట్లు', 'ధర్మశాల'. ఎచ్చమ్మ కథల సంపుటిలో ఉన్న ఇరవై ఒక్క కథలతో పాటు మా ఊరు ముచ్చట్లు, ధర్మశాలలలో కథలను కలుపుకొని అరవై కథల వరకు రాశారామె.

ఇవన్నీ ఆధునిక కథకుండాల్సిన లక్షణాలతో పరిశీలిస్తే గొప్ప కథలు కాకపోవచ్చు కానీ ఆశు సంప్రదాయాన్ని సొంతం చేసుకొని మాండలికాన్ని హృదయానికి హత్తుకొనేలా రాయబడిన కథలు. ఇందులో కొన్ని ముచ్చట్లే ఉండొచ్చు కాని ఆ ముచ్చట్లన్నీ తెలంగాణ గ్రామాల్లోని ముచ్చట్లే. ఈ కథలను చదువుతుంటే తెలంగాణ మాండలిక భాషకున్న బలమేమిటో తెలుసుకునే అవకాశం ఉంది. తెలంగాణ గ్రామాల్లో విహరిస్తున్నట్లు ఉంటుందతి. తెలంగాణ జనజీవనసంస్కృతి మన కళ్ల ముందు కదులుతుంది. ఈమెకు తెలంగాణ మాండలిక భాషపై ఉన్న ప్రేమ, అభిమానం నిరుపమానమైనవని ఈ కథలు చదివితే అర్థమవుతుంది.

"ఒక జాతి సంస్కృతికి భాష ఆయువు పట్టులాంటిది. ఆ జాతి ప్రత్యేకత, ఆచారాలు, వ్యవహారాలు, ఆహారవిహారాదులను అన్నింటినీ అద్దమునందు వలె ప్రతిఫలింపజేయునది భాష. భాష జాతికొక పైతృక ధనము. ఆ భాండాగారములో జాతీయములు, పదబంధములు, సామెతలు, నీతిబోధక వాక్యములు, సామ్యములు, స్త్రీబాల వృద్ధుల నుడికారపు సొంపులు, ఉపమానములు, అలంకారోక్తులు, విశేషోక్తులు, ప్రౌఢోక్తులు ఎన్నియో చేరి యుండును. ఆ విశిష్ట సంపత్తిని తాననుభవించి మరికొంత చేర్చి భద్రముగా తన తరువాతి తరములకొప్పగించుట జాతీయుని కనీస ధర్మము'' అంటారు మా వూరి ముచ్చట్ల గురించి చెబుతూ యశోదారెడ్డి. అట్లని ఊర్కోకుండా తెలంగాణ మాండలిక పదాలను, పదబంధాలను వేల సంఖ్యలో సేకరించి భద్రపరుస్తున్నారు. ఉద్యోగరీత్యా, సమాజంలో స్థానం రీత్యా ఎంత ఉన్నతోన్నత స్థితికి ఎదిగినా తన పుట్టింటి, మెట్టినింటి తెలంగాణ భాషను మరిచిపోకుండా ఆ సంపదను భవిషత్తు తరాలకు అందించడానికి కృషి చేస్తున్న విదుషీమణి యశోదారెడ్డి.

"ఒక జాతి సంస్కృతిలో ఆ జాతి జీవనవిధానం ప్రతిఫలిస్తుంది. ఈ సంస్కృతీ సర్వస్వం ఆ జాతి భాషలో నిక్షిప్తమై జీవిస్తుంది. ఆ భాష ఆ జాతికి ప్రత్యేకమైన ఆచార వ్యవహార, ఆర్థిక, రాజకీయ, సామాజిక మూలధాతువులను జీర్ణించుకొని రససిద్ధిని పొంది జాతీయాల్లో, పలుకుబళ్లలో, సామెతల్లో పొందుపడి ప్రభుత్వాన్ని నెరుపుతుంది. ఒక భాషలో ఒక నానుడి కానీ, సామెత కానీ, జాతీయం కానీ అలవోకగా పుట్టదు. ఆయా జాతీయులు, తలలు పండినవారి అనుభవాన్ని వీడబోసి నిగ్గుదేల్చిన సారమే ఈ నుడికారపు ఇంపుసొంపులు. అందుకే అవి భాషకు జీవనాడి. ప్రాణ ధాతువుల వంటివి'' - ఎచ్చమ్మ కథలకు రాసుకున్న నా మాటలోని యశోదారెడ్డి అభిప్రాయాలివి. ఆమె కథల నిండా, మాటల నిండా ఈ నుడికారపు సొంపులు కనబడతాయి.

"చెంపా చెంప, చేయి చేయి గల్సి అంత తానే ఐండు. సంబురం తట్టుకోలేక కడలయ్య తడలు మిన్నుముట్టినయ్‌. ఆ తాకుడుకు నీళ్లల్ల నిప్పు మొలిసింది. నింగిదీపాలు ఆర్పి నల్లదుప్పటి పర్సింది. ఉట్టి ఊగినట్లూగింది భూదేవి. తండ్లాడింది భూమాత. తల్లడిల్లింది భూతల్లి'' - ఎచ్చమ్మ కతల సంపుటిలోని మోనా కథలోని మాటలు ఇవి.

"ందిర? ఎచ్చెలు.. ఎంత తామసం ఉన్నగని ఎదుటోల్ల మాట గుడ ఇనిపిచ్చుకోకుండ గాలిగేలి సోకినట్లు శిగం వూగుడేన..? కొర్కు పడనంత కొర్వి ఉం బుట్టె? ఎట్ల వుట్టె? నిన్నంత గదలిచ్చి చిట్లిస్తున్న ఎత ఏందో? సెప్పు నా బంగారు గద!

అక్కా ! సామెతలంటె వూకె పుట్టవు. అనుభవాన్ని రంగరిచ్చుకొని తాగినంక జీర్ణమైన సారంతోటి పొట్మరిల్లుతయి'' - నిశ్చితార్థం కథలోని సంభాషణలివి. వీటిని చదువుతుంటే నుడికారపు సొంపులు భాషకు ఎలా జీవనాడులవుతాయో, ప్రాణధాతువులవుతాయో అర్థం కావడం లేదా? యశోదారెడ్డి కథను దేన్ని తిరిగేసినా తెలంగాణ భాషాసంపద అనదగిన జాతీయాలు, సామెతలు, భాషా సొగసులు కుప్పలు తెప్పలుగా కనబడుతాయి.

"కథ ఎప్పుడూ నిరాధారంగ పొట్మరిల్లదు. కథావస్తువు ఎక్కడో అంతూ పొంతూ చిక్కని ఆకాశం నుండి వూడిపడదు. అది జీవితం నుండి, జనానీకం నుండి, పరిసరాల నుండి, నిశితమైన చూపు నుండి, అనుభవరాశి నుండి మొలకెత్తుతుంది. జీవితంలో అనునిత్యం, అనుక్షణం అనేకానేకాలైన వింతలు, విచిత్రాలూ బాధలూ, సంఘటనలు చూపుకు విషయంగా మారుతుంటాయి. ఆ ఈ సంఘటనా సాంద్రతలను పురస్కరించుకొని వాటి ప్రభావ స్పందనలకు రూపకల్పనం ఏర్పడుతుంది. ఈ అనుభూతులన్నీ అనుభవరాశిగా పేరుకుంటూ స్ఫోటనాదులకు శబ్దంలా నాశనరహితమై మెదడులో వో మూల స్థిరనివాసాన్ని ఏర్పరుచుకుంటాయి. ఈ అనుభవసారమే రచయితకు నిగూఢనిధిలా వుపకరిస్తుంది'' అంటారు ధర్మశాలకు నా మాటలో యశోదారెడ్డి. ఆమె కథలన్నీ అనుభవసారాలే. ఒక్కటీ కల్పితం కాదు. ఈ మూడు సంపుటులను పరిశీలిస్తే మనకీ విషయం స్పష్టమవుతుంది.

"ఇట్ల సొమ్ములతోటి సోకుల తోటి ఆడిదాన్ని గట్టేసి, మొగోడు ఉపాయంగ అన్నిట్ల ఆడిపిల్ల కన్న తానే బెత్తెడు పొడుగంట రుజువు చేసుకున్నడు. ఎరేసి శాపను గుండె తంతు అంటె గిదేనమో'' (సొమ్ము సోముదం). యశోదారెడ్డి కథల్నిండా సహజసిద్ధమైన తెలంగాణ గ్రామీణ ఉపమానాలు కనబడుతాయి. "వయిసున ఎగిసిపడ్డ రాములు ఈనాడు ఎందుకు పనికిరాని సిల్లివోయిన పాత బొక్కెనోలె, కొరగాని వొంటి చెప్పోలె, బిసదప్పిన మిషనోలె, పనికిరాని పనిముట్టోలె ఇంటెన్క కూలవడ్డడు'' - మిఠాయి రాములు కథలోని మాటలివి.

తెలంగాణ తెలుగు ఇతర ప్రాంతాల తెలుగు మాదిరిగానే తన నిజస్వరూపాన్ని చాలా వరకు పోగొట్టుకున్నదని బాధపడే యశోదారెడ్డి గ్రామీణ జన వ్యవహార పదబంధాలను కాలగర్భంలో కలిసి పోకుండా కాపాడే ప్రయత్నంలో రాసిన కథలే ఎచ్చమ్మ కతలు, మా ఊరి ముచ్చట్లు. "తెలుగు భాషా సామ్రాజ్యానికంతటికి అధినేతలై ప్రభుత్వాన్ని నెరపిన తిక్కన, నాచన సోమన, గౌరన, ఎర్రన మొదలైన మహాకవుల గంటము నుండి జాలువారిన భాషే తెలంగాణ భాష. సంవత్సరాల వరకు సిసలైన తెలుగు పలుకుబడి తెలంగాణపు గ్రామీణ ప్రాంతాల్లో జీవించి వుండేది. కాని విశాలమైన కలిమిడి ఒక వరదవలె వచ్చి అంతా తనమయం కావించుకొన్న కారణంతో ఈనాడు పల్లెల్లో కూడా ఇంగ్లీషు ప్రభావం అధికమై తన సొగసును తానే చంపుకొన్నది. తన ప్రత్యేకతను తానే మింగింది'' అంటారు యశోదారెడ్డి.

తెలంగాణ భాషపై, జీవితంపై అంతులేని ప్రేమాభిమానాలతో మొదటి తరం నుంచే కథలు రాస్తున్న యశోదారెడ్డి అచ్చమైన గ్రామీణ రచయిత్రి. హైదరాబాద్‌ నగరంలో జీవిస్తున్నా తన పల్లె స్వభావాన్ని కోల్పోని రచయిత్రి. ఆమె రాసినవి కతలే కావచ్చు కాని తెలంగాణ భాషా సొగసులను, నుడికార సంపదను తన కథల్లో పొందుపరిచి మాండలిక భాషకెంతో మేలు చేస్తున్న రచయిత్రి యశోదారెడ్డి. ఈమెకున్న భాషాప్రేమ మరికొంత మందికుంటే తెలంగాణ మాండలికానికి ఎంతో మేలు జరుగుతుంది. భవిష్యత్తరాల వారికి భాషా సొగసులందజేసే వీలు కలుగుతుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X