వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తొలి తెలుగు సాంఘిక కావ్యం

By Pratap
|
Google Oneindia TeluguNews

"Religion is the sigh of the oppressed creature, the heart of a heartless world, and the soul of soulless conditions. It is the opium of the people.

The abolition of religion as the illusory happiness of the people is the demand for their real happiness" - Karl Marx

మతం అణచివేతకు గురవుతున్న వారి నిట్టూర్పు, హృదయరహితమైన ప్రపంచానికి హృదయం, ఆత్మలేని పరిస్థితులకు ఆత్మ. మతం మత్తు మందు అన్నాడు కార్ల్‌మార్క్స్‌.
భ్రమాపూరితమైన ఆనందాన్ని మతం ఇస్తుంది. వారిని వాస్తవమైన ఆనందాన్ని పొందే డిమాండ్ల నుంచి దూరం చేస్తుంది. కాబట్టి మతాన్ని రద్దు చేయలని కార్ల్‌మార్క్స్‌ అన్నాడు.

అయితే, అది అంతిమ వాస్తవం కావచ్చు. గానీ మతం ఏ రూపంలో వచ్చినా సంస్కరణవాదాన్ని కోరింది. సంస్కరణోద్యమంగా సాగింది. అణచివేతకు గురవుతున్న వారిని, పేదలను తనలో ఇముడ్చుకోవడానికి ప్రయత్నించింది. మతాల మధ్య వైరుధ్యాలు, వైషమ్యాలు కూడా కింది వర్గాలకు, కులాలకు ఉన్నత స్థాయిని అందుకోవడానికి పనికి వచ్చాయి. మతప్రాబల్యం కోసం మానవ సమాజంలో సమానత్వాన్ని బోధించాయి. అయితే, భారతదేశంలో మతం కన్నా కులం సామాజిక, సాంస్కృతిక సమానత్వానికి ఆటంకంగా మారింది. ఈ స్థితిలో మతం సామాజిక, సాంస్కృతిక పోరాటాల రూపం తీసుకోవడం చూస్తాం.

పాల్కురి సోమనాథుడి బసవపురాణం కావ్యాన్ని ఆ దృష్టితో చూస్తే అది బోధించిన విప్లవాత్మక మార్పు కళ్లకు కడుతుంది. పాల్కురికి సోమనాథుడు బసవడి సంస్కరణలపై ప్రజల్లో చైతన్యం చేయడానికి కృషి చేశాడు. వీరశైవాన్ని ఆలంబనగా చేసుకున్నాడు. వీరశైవం బ్రాహ్మణ ఆధిపత్యాన్ని, కర్మకాండను నిరసించింది. మానవులంతా ఒక్కటేనని చాటి చెప్పింది. శివుడే ఆది దేవుడని ప్రతిపాదించింది. శివుడొక్కడే దేవుడని ప్రగాఢంగా విశ్వసించేవాళ్లు వీరశైవులు. వీరశైవాన్ని విస్తృతంగా ప్రచారం చేసిన కవుల్లో పాల్కురికి సోమనాథుడు ప్రథముడు. సామాన్య శైవం, శుద్ధ శైవం, వీరశేవం అనే నాలుగు విధాల శైవాల్లో వీరశైవం పూర్తిస్థాయిలో సాంస్కృతిక, సామాజిక విప్లవాన్ని కోరింది.

బసవేశ్వరుని చరిత్రను పురాణంగా నిర్మించిన ప్రథమాంధ్రవీరశైవకవిగా, జైన పురాణ లక్షణాలతో తెలుగులో దేశిపురాణాన్ని రచించిన ప్రథమకవిగా, కన్నడ సాహిత్యంలోని ‘చరిత్రె' కావ్యానికి తెలుగులో ప్రక్రియాగౌరవాన్ని కల్పించిన ప్రథమకవిగా, ద్విపదకు కావ్య గౌరవాన్ని కలిగించిన మొదటికవిగా, ఒక మత విజ్ఞానానికీ, ప్రచారానికీ, సాధనకూ కావలసిన ప్రక్రియలన్నింటినీ రచించి మతసాహిత్య సర్వజ్ఞత్వాన్ని ప్రదర్శించిన ప్రథమకవిగా, లిఖిత సంప్రదాయానికీ, మౌఖిక సంప్రదాయానికీ వారిది కట్టిన మొదటికవిగా, ధ్వన్యనంతర యుగంలో మూలరసవాద ప్రస్థానానికి తెలుగులో మూలపురుషుడైన మొదటికవిగా, భరతాదులంగీకరించని భక్తిరసానికి పట్టం కట్టిన ప్రథమకవిగా, సంస్కృతాంధ్రాలలోనే కాక దేశభాషలలో కూడా పాండిత్యాన్ని ప్రదర్శించిన మొదటికవిగా, సామాజిక స్పృహతో సాహిత్యాన్ని సృష్టించిన భక్తి ఉద్యమ ప్రథమకవిగా పాల్కురికి సోమనను విశ్లేషకులు గుర్తించారు.

‘ఒక తెలుగు కవి తొలిసారిగా నిర్మించిన స్వతంత్ర పురాణం బసవపురాణం. ప్రప్రథమ ఆంధ్ర ద్విపద భారతి ఈ కృతి' అని ఆచార్య జి. వి. సుబ్రహ్మణ్యం అన్నారు. నిజానికి, బసవపురాణం తొలి తెలుగు సాంఘిక కావ్యం. సాంఘిక సంస్కరణలను వీరశైవం పరిధిలో బోధించిన కావ్యం. నన్నయ పౌరాణిక పంథాను విడనాడి సమకాలీన వస్తువును తీసుకుని చేసిన మొదటి తెలుగు రచనగా బసవపురాణం కావ్యాన్ని చెప్పుకోవచ్చు. మొదటి ప్రతాపరుద్రుని కాలంలో జీవించిన పాల్కురికి సోమనాథుడు, కాకతీ యుగంలో గొప్ప విప్లవ కవిగా వర్ధిల్లాడు.

పాల్కురికి సోమనాధుడు (1160 1240) శివకవి యుగానికి చెందిన తెలుగు కవి, తెలంగాణ కవి. ఈ యుగానికి చెందిన ‘‘శివకవి త్రయం'' అనబడే ముగ్గురు కవుల్లో అత్యంత ప్రధానమైనవాడు పాల్కురికి సోమనాథుడు. తక్కిన ఇద్దరు మల్లికార్జున పండితారాధ్యుడు, నన్నెచోడడు. అప్పటి ఇతర బ్రాహ్మణ శివకవులు తమ రచనలలో బ్రాహ్మణులను గౌరవంగా ప్రస్తావించేవారు కాని పాల్కురికి సోమనాథుడు వారి ఆచార వ్యవహారాలను నిష్కర్షగా తప్పు పట్టాడు. అందుకే కులజుండు నతడే యకులజుండు నతడె/ కులము లేకయు నన్ని కులములు నతడే అని అనగలిగాడు.

అసమాక్షుకొలవని అగ్రజుండైనా వసుధ మాలల మాలవాడు కాకెట్టు? అని ప్రశ్నించాడు. శివుని కొలవడం అంటే కులమతాలు పాటించకపోవటం, వర్ణవైషమ్యాలు వదిలేసుకోవటం, వైదిక క్రతువులను అంగీకరంచకపోవటంగా ఆయన ప్రచారం చేశాడు. వేద భరాక్షికంతులనగ బడిన బ్రాహ్మణ గార్లబంబులతోడ ప్రతిసేసి యాడిన పాపంబు వచ్చునంటాడు. అంటరానితనాన్ని పాటించే బ్రాహ్మణులను మెడలో త్రాడు ఉన్న మాలలు తాటిమాలలు అని నిరసించాడు. నన్నయ వైదిక మతోద్దరణను తన బాధ్యతగా, ధర్మంగా భావిస్తే సోమన వైదిక ధర్మాలను తుదముట్టించి కుల వర్ణ భేదాలులేని సమ సమాజ నిర్మాణాన్ని తలపెట్టాడు.

సోమన కాలానికే సాంస్కృతికంగా బౌద్ధం, జైనం బలహీనపడిన స్థితిలో ఉన్నాయి. జైన బౌద్ధ చార్వాక దుష్పథ సమయములు/ మూడును నిర్మూలము జేయుదనుక/ మూడు రాలను వైతు ముప్పద్దు నిన్ను అనీ, వసుధలో జిసులను వారి సందరను/ నేలపాలుగజేసి అనీ సోమనాథుడు బసవపురాణంలో ముప్పేట దాడులు ఎలా చేయవలసి వచ్చిందో చెప్పుకున్నాడు. జైనులు, బౌద్ధులు రంగం నుంచి తప్పుకున్న తర్వాత మతవైషమ్యాలకు, సమరానికి వీరశైవ, వీరవైష్ణవులే మిగిలారు. వీరు పరస్పరం తిట్లుకున్న తిట్లే ఒక చేట భారతమగును అని సురవరం ప్రతాపరెడ్డి సోమన కాలంనాటి పరిస్థితులను వివరించారు.

తెలుగులో మొట్టమొదటి దేశిపురణం బసవపురాణం. మొదటి శతకం వ్యషాధిప శతకం. ఈ రెండూ సోమనాథుడు బసవేశ్వరుని ప్రభావంతో రచించినవే. పాల్కురికి సోమనాథుడు బసవేశ్వరుడ్ని రెండవ శంకరుడన్నాడు. కుల రహిత సమాజాన్ని 12వ శతాబ్దంలో ప్రబోధించి ఆచరించి చూపించినవాడు బసవేశ్వరుడు. శెట్టి అయిన సిరియాళుణ్ణి, రజకుడైన మడివాలు మాచయ్యను, చండాలుడిగా చెప్పే కక్కయ్యను, మాదిగ కులస్థుడైన చెన్నయ్యను, బాలిక అయిన గోడ గూచిని, స్త్రీ అయిన అక్కమహాదేవిని కులభేదాలు, వయో తారతమ్యాల, స్త్రీపురుష అసమానత పాటించకుండా శివభక్తి యగ్నంలో ఉన్నత స్థానంలో నిలబెట్టాడు బసవేశ్వరుడు.

అలనాడు కులాంతర వివాహాన్ని జరిపించి కులాలు మానవ సృష్టి మాత్రమే అని పలికిన సంస్కర్త బసవన్న. బసవేశ్వరుడు కర్మమార్గాన్ని నిరసించాడు. వర్ణాశ్రమ ధర్మాల్ని ప్రతిఘటించాడు. సామాజిక, చారిత్రక పరిణామాల కారణంగా బసవని మతం, బసవని ధర్మం ఈ రెండూ కూడా పెద్ద విప్లవాత్మకమైన మర్పునకు దోహం చేశాయి. అదే పాల్కురికి సోమనాథుడిని బసవపురాణం రాయడానికి పురికొల్పింది.

బసవ పురాణం ఏడు అశ్వాసాల స్వతంత్ర చారిత్రక కావ్యం కూడా. భక్తి వీరం ఇందులో ప్రధాన రసం. బసవని అవతరణం, సంస్కారోత్సవాలు, ప్రబోధాలు, లింగైక్యం అనే దశలుగా విభజించుకోదగిన చరిత్ర. దీని మధ్య భక్తజన కథలు ఉన్నాయి. వాటితో బసవపురాణం వస్త్యెక్యతను సంతరించుకున్న మహాకావ్యంగా రూపుదిద్దుకుంది. ఆయన వర్ణించిన భక్తుల్లో శిశుభక్తులు, స్త్రీభక్తులు, ముగ్ధభక్తులు, మొండి భక్తులు, ప్రౌఢభక్తులు ఉన్నారు. వీరిలో వివిధ వర్ణాలకు చెందినవారు ఉన్నారు. బసవనికి సమకాలికులైన అల్లమ ప్రభువు, మడివాలు మాచయ్య, సిద్ధరామయ్య వంటి అనేకులున్నారు. రుద్ర పశుపతి, గొడగూచి, బెజ్జమహాదేవి వంటి ముగ్ధభక్తులు ఉన్నారు. స్త్రీ పురుష సమానత్వాన్ని, కులరాహిత్యాన్ని వీరశైవం ప్రబోధించి ఆచరించిన తీరును పాల్కురికి తన రచనలో చిత్రిక కట్టాడు.

Palkuriki Somana: his Basava Puranam

సోమన సామాజిక దృక్పథంలో ద్యోతకమయ్యే సంఘ సంస్కరణాభిలాష బసవేశ్వరుడు చెప్పిందే. బసవేశ్వరుడు ప్రతిపాదించిన విధుల్లో ముఖ్యమైనవి
వర్ణాశ్రమ ధర్మాల మీద తిరుగుబాటు
జంగమాపూజకు ప్రాధాన్యం. వీర మహేశ్వర ప్రతదీక్షాపరుడు ఏ కులానికి చెందినవాడైనా, ఏ వృత్తికి చెందినవాడైనా పూజనీయుడే. సహపంక్తి భోజనానికి అర్హుడే.
క్రతు కర్మలపట్ల నిరసన. సనాతన ధర్మవాదులు నిత్యకృత్యంగా చేసే అనేక క్రతువుల్ని నిరసించాడు. ‘తినే జంగమునికి పెట్టరు. తినని లింగమునకు నైవేద్యాలు' అటువంటివే.
స్త్రీలకి పురుషులతో సమానంగా మోక్షసాధన మార్గాన్ని ఎన్నుకొనే స్వేచ్ఛ.
అష్టావరణాలు, పంచాచారాల నిబంధనలు
స్థావర మూర్తుల పూజపట్ల వైముఖ్యం. జంగమ పూజకు ప్రాధాన్యం.
పుట్టుక కారణంగా సంక్రమించిన అస్పృశ్యతని ఏ రూపంలో ఉన్నా దాన్ని వ్యతిరేకించడం. సమానత్వాన్ని పాటించడం.
పంచవిధ సూతకాలలో నాలుగింటిని కూడా తిరస్కరించడం (ఇవి పురుడు, ఉచ్చిష్టం, బహిష్టు, చావు సందర్భాలల్లో పాటించే ఆశౌచాలు).
ఉపనయన సంస్కారాన్ని తిరస్కరించడం.
మరణించినవారికవ చేసే శ్రాద్ధ కర్మల నిరసన.
మద్యమాంసాల విసర్జన

సోమన తన కావ్యంలో ఈ విధివిధానాలకి అత్యంత ప్రాధాన్యం ఇచ్చాడు. ఉదాహరణకి సిరియాళుడి కథలో శివుడు హలాయుధునితో సంవాదంలో సుతుని చంపి ఆ మాంసంతో విందు చేసిన సంగతి చెప్పినప్పుడు, హలాయుధుడు వెటకారంగా ఇలా అంటాడు

‘‘శివ! శివ! యిదియేమి చెప్పెదవయ్య
శివుడేమి నరుల భక్షింప రక్కసుడె?
శిశువు సద్భక్తుని సిరియాళునంబి
పశువరింపగ జంపభక్తి హీనుండె?!'' ఇది మాంసాహార విసర్జన అనే నిబంధనని గాఢంగా ప్రజల్లో నాటడానికి చెప్పిన విషయమని అర్థమవుతూనే ఉంది.

బసవేశ్వరుడి ప్రబోధాలకు అనుగుణంగా

‘‘ఎట్టి దుర్గతిని బుట్టిననేమి
యెట్లును శివభక్తుడిల పవిత్రుండు''

‘‘మొన్న బుట్టిన కులమ్ముల మాటలేల'' అని పాల్కురికి సోమనాథుడు అన్నాడు.
మత ప్రచారానికి సంస్కృత భాషను వాడాలనే ఆచారాన్ని సోమనాథుడు బద్ధలు కొట్టాడు. నన్నయ భారతాంద్రీకరణంలో 99 శాతం సంస్కృత పదాలు కనిపిస్తే అందుకు పూర్తి విరుద్ధంగా పాల్కురికి సోమనాథుడి బసవపురాణంలో దేశీ ఛందస్సుకు, నానుడులకు, జాతీయాలకు, పలుకుబళ్లకు ప్రాధాన్యం ఇచ్చి స్వతంత్ర గ్రంథంగా రచించాడు. సంస్కృతాన్ని కాస్తా ఎక్కువగా వాడిన పాల్కురికి సోమనాథుడి అనుభవసారం శైలీ ప్రభావం తిక్కన భారతాంధ్రీకరణ శైలిపై, పదప్రయోగంపై ఉంది.

ద్విపద, రగడలే కాకుండా సోమనాథుడు ఇంకా సీసం, త్రిభంగి, తరువోజ, క్రౌంచ పదం, మయూరం, చతుర్విధ కందం, త్రిపాస కందం వంటి స్థానిక ఛందోరీతుల ప్రయోగం చేశాడు. ‘‘రగడ'' అనే ఛందోరీతిని సోమనాథుడే ప్రారంభించాడు. ఈ రకంగా ప్రజలకు అత్యంత ఆదరణీయమైన రచనగా బసవ పురాణాన్ని సోమనాథుడు తీర్చిదిద్దాడు. సీస పద్యాల్లో సోమన ప్రయోగం చేశాడు. శ్రీనాథుడికి సీసపద్య రచనలో మార్గదర్శనం చేసింది సోమన సీస పద్యాలే. అలాగే బద్దెన సుమతీ శతకం కంద పద్యాలకు మార్గం చూపింది సోమనాథుడి కంద పద్యాలే.

భాషలో, పద ప్రయోగాల్లో సోమనాథుడు స్వేచ్ఛగా ప్రయోగాలు చేశాడు. వస్తువు మారినప్పుడు శైలి విధానాలు కూడా మారుతాయని చెప్పడానికి బసవపురాణం మంచి ఉదాహరణ. వైరి సమాసాలు విరివిగా వాడాడు. అయితే, సోమనాథుడి బసవపురాణానికి ముందు ఛందశ్చాస్తం ఏదీ లేదని, అతని రచన తర్వాత వచ్చిన ఛందశ్శాస్తాలతో దాన్ని బేరీజు వేయడం తగదని అంటారు. కొత్త పదబంధాలను సోమనాథుడు సృష్టించాడు.

గ్రూపులు కట్టడాన్ని గుంపిడటం, తక్కువగా గౌరవించటాన్ని సోల, చాలా కొద్ది సమయాన్ని గోరంతపొద్దు, అసాధ్యం అనడానికి కుంచాలతో మంచుకొలవటం అనే చక్కని జాతీయాన్ని ప్రయోగిస్తాడు. పుష్పవిల్లు, భూమితీరు, వేడి పయోధార వంటి ప్రయోగాలు అలవోకగా చేసిన కనిపిస్తాయి.

ప్రజలకు సూటిగా తన భావాలను ప్రసరింపజేయడానికి అనువైన శైలి, అభివ్యక్తి తీరుతెన్నులను సోమనాథుడు ఎంచుకున్నాడు. అదే సమయంలో సృజనాత్మకతకు పట్టం కట్టాడు. ప్రజల మీదికి అత్యంత సులువైన, వీనులవిందైన లక్షణాలను పాటించాడు.

ఆ రకంగా పాల్కురికి సోమనాథుడు కావ్యగౌరవం కలిగిన బసవపురాణాన్ని ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా బసవపురాణం కావ్యాన్ని రచించి ప్రజాకవిగా నిలిచాడు. తెలంగాణలోని ఎక్కువ శూద్రకులాలు శైవమతాన్ని ఆలింగనం చేసుకున్నారని చెప్పడానికి అనువైన పరిస్థితులు ఇప్పటికీ ఉన్నాయి. ఆ రకంగా సామాజిక విప్లవకారుడిగా సోమనాథుడు కనిపిస్తాడు.

కార్ల్‌ మార్క్స్‌ మతంపై చెప్పిన మాటలను మరోసారి మననం చేసుకుంటే, ఇక్కడ స్థానిక పరిస్థితులను బట్టి వీరశైవం ఇక్కడిదే ప్రత్యేకమైన కులనిర్మూలన, స్త్రీపురుష సమానత వంటి సంస్కరణలకు ఉద్యమరూపంగా పనిచేసింది. ఆ రకంగా సోమనాథుడి బసవపురాణం తెలుగు సమాజంలో సంఘసంస్కరణోద్యమ గ్రంథం.

- కాసుల ప్రతాపరెడ్డి

(ఇటీవల మెదక్ జిల్లా జోగిపేట డిగ్రీ కళాశాలలో పాల్కురికి సోమనాథుడిపై జరిగిన సదస్సులో సమర్పించిన పత్రం)

English summary
Kasula Pratap Reddy described Palkuriki Samanatha's Basava Puram as first Telugu social potry book.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X