వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'హిందూ మహాసముద్రం'లో 'అల్పపీడనం'

By Pratap
|
Google Oneindia TeluguNews

దళిత దార్శనికులు, దళిత కవులు ఒక్కరొక్కరే అర్థాంతరంగా తనువు చాలించడం ఈ సామాజిక సందర్భంలోని ప్రత్యేకత కావచ్చు. పైడి తెరేష్ బాబు అకాల మరణం పలు ప్రశ్నలను ముందుకు తేవడమే కాకుండా ఓ సామాజిక పరిణామానికి సంబంధించిన అంశంపై ఆలోచనను రేకెత్తిస్తుంది. దళిత విప్లవ స్వాప్నికుడు శివసాగర్ మెచ్చిన కవుల్లో మద్దూరి నగేష్ బాబు ఇప్పటికే పోయాడు. ఇప్పుడు పైడి తెరేష్ బాబు తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడు.

మద్దూరి నగేష్ బాబు, మద్దెల శాంతయ్య, కలెకూరి ప్రసాద్ ఇంతుకు ముందు.. ఇప్పుడు పైడి తెరేష్ బాబు మనకు లేకుండా పోయారు. మద్దెల శాంతయ్య సంగతి వేరు గానీ మద్దూరి నగేష్ బాబు, కలేకూరి ప్రసాద్,త పైడి తెరేష్ బాబు వ్యసనానికి బానిసలయ్యారు. వారు వ్యసనానికి బానిసలు కావడం సామాజికమా, వ్యక్తిగతమా అనేది ఓ ప్రశ్న. కానీ, చాలా మంది వారినే నిందిస్తారు. అద్భుతమైన దార్శనిక శక్తి ఉండి, దళిత సౌందర్యాన్ని కవిత్వంలో రూపుకట్టిన ఆ కవులు పోవడం వెనక ఏ శక్తులు పనిచేశాయి? ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ, సుమధురమైన గొంతుతో అలరిస్తూ ఉండే పైడి తెరేష్ బాబు గుండెలో ఏ అగ్నిపర్వతాలు నిత్యం బద్దలవుతూ ఉండేవి?

పైడి తెరేష్ బాబుకు గోరటి ఎంకన్న నివాళి

పైడి తెరేష్ బాబుకు గోరటి ఎంకన్న నివాళి

ప్రముఖ తెలంగాణ వాగ్గేయకారుడు గోరటి వెంకన్న పైడి తెరేష్ బాబు మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.

తెరేష్ బాబు కావడి కుండలు..

తెరేష్ బాబు కావడి కుండలు..

తెలంగాణ ఉద్యమాన్ని సమర్థిస్తూ వచ్చిన కావడి కుండలు గ్రంథం ఆవిష్కరణ హైదరాబాదులోని గన్ పార్కు వద్ద జరిగింది. ఆ సందర్భంగా పైడి తెరేష్ బాబు కవిత్వం చదువుతూ... కవిత్వాన్ని ఆయన శ్వాసించాడు.

కావడి కుండలు ఆవిష్కరణ సందర్భంగా...

కావడి కుండలు ఆవిష్కరణ సందర్భంగా...

హైదరాబాదులోని కావడి కుండలు ఆవిష్కరణ సభలో కత్తి పద్మారావు, నారాయణ మూర్తి తదితరులతో పైడి తెరేష్ బాబు

పైడి తెరేష్ బాబు ఇలా..

పైడి తెరేష్ బాబు ఇలా..

పైడి తెరేష్ బాబు హైదరాబాద్ ఆకాశవాణి కేంద్రంలో పని చేశాడు. ఆయన గొంతు కంచు కంఠంలా ఉండేది. ఆయన అనౌన్స్‌మెంట్‌లో ప్రత్యేక శైలి కనిపించేది.

నిశానీ కవిత్వం ద్వారా పైడి తెరేష్ బాబు తెలుగు సాహిత్యంలో ఓ దుమారం రేపాడు. నిశానీ కవుల్లోని పదజాలాన్ని, ప్రతీకలను, కవిత్వాన్ని సభ్యసమాజం దుమ్మెత్తిపోసింది. పైడి తెరేష్ బాబు అల్పపీడనం, హిందూ మహాసముద్రం కవిత్వాలు దళిత తాత్వికతను, దళిత సాహిత్య సౌందర్యాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చాయి. హిందూ సమాజంలో దళితుల గురించి ఆయన ఎక్కువ పెట్టిన అస్త్రాలు అవి. ఆ తర్వాత ఆంధ్ర దళిత కవిగా తెలంగాణ ఉద్యమాన్ని సమర్థిస్తూ తెచ్చిన కావడి కుండలు ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు ఆయన సన్నిహితం చేశాయి. తెలంగాణ ప్రజలు ఆయనను అక్కున చేర్చుకున్నారు.

సినిమాపై, ఇతర కళలపై పైడి తెరేష్ బాబుకు ఉన్న అభినివేశం, మక్కువ గురించి తెలియదు గానీ అతను గొంతెత్తి పాడితే వాయువు పరీమళాలను మోసుకొస్తున్నట్లుగా ఉండేది. హిందీ పాటలు, ఉర్దూ షాయిరీలు ఆయన నోటి నుంచి అలవోకగా జాలువారేవి. ఆంధ్రవాడివి అయి ఉండి, ఇంత ప్రావీణ్యం ఎలా సంపాదించావంటే అసలు విషయం చెప్పాడు. హైదరాబాదులోని మొజంజాహీ మార్కెట్‌లోని ఓ గదిలో అతను సాధన చేశాడట. తెలుగు కవిత్వం నీరసించిపోయిన దశలో దిగంబర కవులకు కూడా మొజాంజాహీ మార్కెట్ ముఖ్య కేంద్రంగానే పనిచేసింది.

పైడి తెరేష్ బాబు తన మిత్రులను, తన అభిమానులను శోకసముద్రంలో ముంచి తన దారిని తాను చూసుకున్నాడు. ఎవరు పాడుతారిప్పుడు పారవశ్యంలో మునిగి గాలికి గులాబీ అత్తరు అద్దే గేయాలను... తెలుగు సాహిత్యంలో దళిత, ప్రాంతీయ దృక్పథాలను విస్తరించిన పైడి తెరేష్ బాబు లోటను ఎవరు పూడుస్తారిప్పుడు...

- కాసుల ప్రతాపరెడ్డి

English summary

 A dalit poet Pydi Theresh Babu contribution to Telugu literature is valuable with his Alpa peedanam, Hindu Mahasamudram poetry books.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X