వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చేరాతల చిరంజీవి!

|
Google Oneindia TeluguNews

Tribute to Chera by Naleswaram Shankaram
చేకూరి రామారావు నాకు పరిచయమైంది ఉస్మానియా విశ్వవిద్యాలయం క్యాంపస్ హాస్టల్స్‌లో ఉన్నప్పుడే, నేను ఓల్డ్ పి.జి. హాస్టల్‌ల్లో ఉండేవాన్ని. మా హాస్టల్‌కు సమీపంలోనే యూనివర్సిటీ అధ్యాపకుల క్వార్టర్స్ ఉండేవి. ఆయన క్వార్టర్స్‌లో ఉంటాడని బహుశ గుడిహళం రఘునాథం చెప్పాడనుకుంట. చలం పుస్తకాల వేటలో ఉన్నప్పుడు హాస్టల్ మిత్రులు చేరా దగ్గర కొన్ని దొరకవచ్చని చెప్పారు. ఆయనను పరిచయం చేసుకుని కొన్ని చలం పుస్తకాలను అడుగుదామని వెళ్లాను. నేను తెలుగులో ఎం.ఏ విద్యార్థిని గనుక ఆయన లింగ్విస్టిక్స్ విద్యార్థిని కాను గనుక సహాయపడతాడో కాడోనని సంశయంతోనే ఆయన ఇంటికి వెళ్లి పరిచయం చేసుకున్నాను నా రాక గూర్చి చెప్పాను. ఆయన లోపలికి వెళ్లి కాఫీ పెట్టించాడు. కాఫీ తాగిన తర్వాత ఆయన సహాయ పడతాడనే విశ్వాసం నాకెందుకో లోలోన కలిగింది. ఆ రోజుల్లో అంటే 1978 ప్రాంతం. చలం పుస్తకాలు ఎక్కడా దొరికేవి కావు. చేరా గారు రేపోకమారు సాయంత్రంపూట రమ్మన్నాడు. ఆయన చెప్పినట్లుగానే వెళ్లాను. చలం ఆత్మకథ దొరికింది. ఇది చదువు ఆ తర్వాత దొరికినవి ఇస్తానన్నాడు. అక్కడ నుండి చేరాతో నాకెక్కడో గురుభావం కలిగింది.

చేరాతల తర్వాత చేకూరి రామారావు వెలుగులోకి వచ్చారు. నిజానికి నేను ఎం.ఏ తెలుగు పూర్తయిన తర్వాత స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ కోసం ఎం.ఏ లింగ్విస్టిక్స్ అవడానికి ఎంట్రెన్స్ రాసి ఎం.ఏ లింగ్విస్టిక్స్‌లో చేరాను. దాదాపు ఇరవై, ఇరవై అయిదు రోజులు క్లాసుకు వెళ్లానో లేదో నాకు ఎం.ఫిల్‌లో సీటు రావడం వల్ల మానేసాను. అప్పుడు రామారావు డిపార్ట్‌మెంటులో చదువుకోవడానికి వెళ్లడం వల్ల మరింత పరిచయం పెరిగింది. సాహిత్యపరమైన విషయాలు మెళ్లి మెళ్లిగా ఆయననుంచి నేర్చుకొనే స్థితి ఏర్పడింది. చేరాకు నాయని కృష్ణకుమారంటె గొప్ప అభిమానం. ఎందుకంత అభిమానం అని అనుకునే వాణ్ణి. నాయని కృష్ణకుమారి నాన్నగారు నాయని సుబ్బారావు గారు. ఆయన కవిత్వమంటే చేరా పడిచచ్చేవాడు. ఆయన కవిత్వంలో ఎక్కడ యే సొగసుందో హృదయముందో ఆధునిక రీతులు ఎక్కడెక్కడ ఉన్నాయో నాయని సుబ్బారావు గారికి గానీ నాయని కృష్ణకుమారికి గానీ తెలియనంతగా చేరాకు తెలుసు. చేరా మొదట కవి. ఆ తర్వాతే భాషా పండితుడు, ఆ తర్వాతే సాహిత్య విశ్లేషకులు. చేరా మొదట సాయంత్రాల మనిషేమీ కాదు. అడపాదడప మిత్రుల మధ్య కూర్చునేవాడు. నాకు ఆత్మీయులైన దేవిప్రియ, ఎన్. గోపీ గార్లను కలిసేవాన్ని. ఆయన కూడా వారితో గాఢ స్నేహభావంతో ఉండేవాడు. అందువల్ల చేరా గారితో పరిచయం మెల్లి మెల్లిగా పెరిగింది. నేనప్పటికి చేరా కవిత్వం చదివాను గానీ ఆయన ఇంగ్లీషులో రాసిన భాషా సంబంధమైన రచనలను ఆవగింజంతైనా చదవలేదు. తెలుగు సాహిత్య విమర్శకుల్లో భాషా శాస్త్రాలను గాఢంగా చదివిన వాళ్లు లేరు.

నాకు సరిగా గుర్తులేదు గానీ దేవిప్రియ ఓ రోజు సాయంత్రం విద్యానగర్‌కు రమ్మని అనడంతో వెళ్లాను. అప్పటికే శివారెడ్డి, దేవిప్రియ, చేకూరి రామారావు మరికొందరు మిత్రులు ఉన్నారు.

హోటల్‌కు వెళ్లి కూర్చున్నాం. సాయిత్య కబుర్లు సాగుతున్న సమమయంలో దేవిప్రియ మా పత్రికకు ఒక కాలం రాయవచ్చు గదా! అని చేకూరి రామారావును అడిగాడు. నేనెందుకు పనికి వస్తానన్న ధోరణిలో చేరా మాట్లాడుతుంటే మీ నుంచి తెలుగు సాహిత్యం ఏంకావాలనుకుంటుందో అదే పని చేద్దురు అన్నట్లు సాగింది. అదే రోజు చేరాతల కాలానికి శ్రీకారం చుట్టబడింది. చేరాతలు అని పేరు పెట్టి దేవిప్రియ ఆయన చేత రాయించడం ప్రారంభమైంది.

నేను చేరాతలు చదివే పాఠకుల్లో ఒకడ్నయిపోయాను. అప్పట్లో సాహిత్యం విమర్శ అంటే కవి కవితా వస్తువు చుట్టే తిరిగేది. రచయితల నవలో కథో అయితే ఆ రచనలోని వస్తువు చుట్టే విమర్శ సంచరించేది. చేరాగారు భాషా పండితుడు కావడం వల్ల రచన నిర్మాణం, దాని రీతులు దాని శిల్ప సౌందర్యం కవిత్వ పాదాల మధ్యన ప్రవహించే కవన నదిని చేరా పట్టుకుని అందులో రోజు స్నానం చేయంది ఆయనకు మనసున పట్టేది కాదు.

చేరాతలు రాను రాను సాహిత్య లోకంలో ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. తెలుగు సాహిత్యంలో ఓ పుస్తకం ఆవిష్కారమయ్యాక చేరా పట్టించుకుని రాస్తే తప్ప అది ప్రామాణికం కాదన్నంత దాక వెళ్లింది.

నిజానికి చేరాతలే లేకపోతే వచన కవిత్వ విశ్లేషణ కుంటుపడేదే. చేరాతలు అత్యధిక సర్క్యూలేషన్ గల పత్రికలో రావడం వల్ల చిన్న కవులకు, రచయితలకే పెద్ద పెద్ద రచయితలు ఆయన చేత రాయించుకోవాలనే స్థితిలో నానా తంటాలు పడేవారు. చేరా ముఖ్యంగా వచన కవులకు పెద్ద పీఠ వేసి రాయడం వల్లనయితేనేమీ కవుల కవిత్వ నిర్మాణ సొగసును విప్పి చెప్పడంలోనైతేనేమీ రూప పరమైన శక్తియుక్తుల్నీ వాటి ప్రతిభాపాఠవాల్ని గాఢంగా విశ్లేషించడం వల్ల ఆయన రాతలకు ఓ ప్రత్యేకత ఏర్పడింది. చేరా ఒక్కోమారు పత్రికల్లో లేఖల కాలంలో మంచి కవిత వచ్చినా దాన్ని పట్టించుకుని తాను ఇష్టపడ్డ విధంగా రాసేవాడు. నిజానికి స్త్రీవాద కవయిత్రులు చేరాతల వల్ల సాహిత్యంలో పెద్ద పెద్ద పీఠాలనే అధిరోహించారు కూడా. చేరాతల శీర్షిక ఉండటం వల్ల ఎదో వొక రోజు కాకుండా నెలలో చాలా రోజులు ఆవిష్కరణ సభలకు ఆయనను పిలిచేవారు. చేరాతల వల్ల ఇంతింతై అన్నట్లు ఆయన సాహిత్యం విశ్లేషణ గ్రంథాలు వెలుగుచూశాయి. చేరాకు ఓ మంచి సుగుణ మేమంటే తాను విమర్శించే వారిని కూడా చేరదీయడం.

కె. శ్రీనివాస్, కృష్ణారావు లాంటి సాహిత్యకారులు ఓ మారు సారస్వత పరిషత్తులో కవి సమయం ఓ రోజంతా నడిపించారు. మధ్యాన్నం సమయంలో అనుకుంట వరవరరావు మాట్లాడడానికి స్టేజీ మీదకు రాగానే బయట ఉన్నవాళ్లు కూడా లోపలికి వచ్చారు. హాలు సాహిత్యకారులతో నిండి ఉంది. వరవరరావు మాట్లాడుతూ మాట్లాడుతూ ఒక చురక వేశారు. అది నాకు సరిగా జ్ఞాపకం రావడం లేదు గానీ దాని సారాంశమేమంటే కవులారా! రచయితలారా మీరు చేరాతల వెంట పోతారో ప్రజల వెంట, ప్రజా ఉద్యమాల వెంట ఉంటారో నిర్ణయించుకోవాలన్నంత భావనను వరవరరావు వ్యక్తపరిచారు. అలా వ్యక్త పరచడానికి కారణాలు చాలా ఉండవచ్చు. చేరాను సాయంత్రాలు కలవకపోతే నా రచన చేరాతనేరేమో! చేరాను ఆవిష్కరణకు పిలువకపోతే నా రచన నలుగురి దగ్గరకు వెళ్లదేమోనన్న భావజాలం వ్యాపించి ఉండేది.

చేరా తెలంగాణ కవుల మీద రచయితల మీద చేరాతలు రాయడం లేదనే విమర్శ కూడా అప్పట్లో వ్యాపించి ఉండేది. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే చేరాతలకు అంత పాపులారిటీ ఉండేదని. చేరాగారు కొన్ని పుస్తకాలకు పీఠికలు రాశారు. అప్పట్లో బాలగోపాల్ గారు రాసిన రూపంసారం పుస్తకానికి పీఠిక రాశారు. ఆ పీఠిక నాకు నచ్చింది. ఆయన పీఠికలు పుస్తకంగా రావాలనుకున్నప్పుడు బాలగోపాల్ పీఠిక ఆయనకు ఎక్కడా లభించలేదు. నాకు బాలగోపాల్ పుస్తకానికి రాసిన పీఠిక ఇవ్వు జీరాక్స్ చేసుకుని ఇస్తానన్నాడు. కృతజ్ఞతలు అన్నాడు గానీ ఆయన నా కోరికను నెరవేర్చనేలేదు. ఆయన ఎప్పుడో ఒక మారు కలలో అగుపించకపోతాడా నేను అడగకుండా ఉంటానా? ఇంత చిన్న విషయం ఎందుకు చెబుతున్నానంటే ఆయన చేరాతలు నా కవిత్వం మీద రాయమని అడగాలని గానీ రాయించుకోవాలనీ గానీ నాకెన్నడూ ఉండేది కాదు. అందువల్లే అనుకుంటా చేరా నాతో మనసువిప్పి మాట్లాడేవాడు. చేరాకు నచ్చిన విషయమైనా నచ్చని విషయమైనా చర్చకు పెట్టేవాడు.

చేరాకు మొదట్లో ఎంత జ్ఞాపకముండేదో ఆరుద్ర లాగా వరవరరావులాగా ఎక్కడెక్కడి సాహిత్య విషయాలో ఒక చోటకు చేర్చి అమ్మ అన్నం వడ్డించినట్లే రాసేవాడు. ఎవాల్యూషన్ ఆఫ్ తెలుగు లిటరేచర్‌కు కావాల్సిన జ్ఞాపక సంపద ఆయనకుండేది. చేరాతలు ఆయన మానేసిన తర్వాత ఆయనను కలిసే సాహిత్యకారులు తగ్గిపోయారు. ఆయనకాయనే సభలకు రావడం మానేశారు. అరుద్ర సమగ్రాంథ సాహిత్య సంపుటాల్లాగే ఆయన సాహిత్య విశ్లేషణా గ్రంథాలు మిగులుతాయి. ఆయనను నేనోమారు ఇంటర్వ్యూ చేశాను. ఇంటర్వ్యూ చేయడానికి నానా యాతన పడ్డాను. ఆయన వైయక్తిక సాహిత్య మనోభవాలనూ, వచన కవిత్వ నిర్మాణం మీరెట్లా ఉండాలనుకుంటారనే వాటి మీద, భాష మీద ఎన్నడిగినా చెప్పడానికి పూనుకున్నట్లే పూనుకుని చెప్పడం మానేశాడు. నేను చాలా అసంతృప్తికి లోనైంది ఆ ఇంటర్వ్యూనే. చేరాగారిని చలం భాష మీద మాట్లాడమని ఓ సారి పిలిచాను గానీ అప్పటికే ఆయన అస్త్ర సన్యాసం చేసినట్లు మాట్లాడారు. ఆ రోజు అసంతృప్తిగానే ఉండిపోయాను.

ఎందుకో చేరాగారంటే నాకిష్టముండేది. ఆ ఇష్టం ఏమిటంటే మనకు తెలియంది ఆయన ద్వారా నేర్చుకుందామనే భావన. ఆయన పోయాడని తెలిసీ తెలియగానే తెలుగు సాహిత్య విమర్శకు చాతనైనంత రోజూ చెంచెడు నీళ్లు పోసేవాడు. అడవి గాసిన చెట్లు కూడా నీళ్లు లేక మరణించే స్థితిలో ఉంటే ఆ కవనవృక్షాలకు చెంచెడు నీళ్లు పోసే ఆ అడవి మనిషి వెళ్లిపోయాడనే బాధ ఉండనే ఉంటుంది. బాధను తొలగించుకునే మాట ఆయనా చెప్పలేదు. నాకు తెలియదు.

-డా. నాళేశ్వరం శంకరం

English summary
Prominent Telugu poet and critic paid tribute to eminent literray critic and Liguist Chekuri Rama Rao, popularly known as Chera.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X