వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలుగు కథ: అనివార్యం

By Pratap
|
Google Oneindia TeluguNews

ఆ తడికెల గుడిసెలో..వాతావరణమంతా ఒక రకమైన గత్తు వాసన.

రాజయ్య చల్లి పోయిన ఫినైల్..అప్పటిదాకా వెలిగి వెలిగి ఆరిపోయిన అగర్ బత్తీ..నారాయణ దగ్గరినుండి వస్తున్న ఉచ్చ..రోగం తాలూకు ఏదో మాటలకందని దుర్వాసన..అన్నీ కలగలిసి వెగటు కలిగించే భరించలేని అసౌకర్య..వాసన.గాలినిండా మనుషుల్ని భయకంపితుల్ని చేస్తూ జీవితం చరమదశలో ఎంత భయంకరంగా ఉండగలదో ఒక మచ్చును అనుభవంలోకి తెస్తూ..మృత్యువాసన.

నారాయణ జీవితమంతా చాలా చాలా శుభ్రంగా..ఎప్పుడూ అప్పుడే కడిగిన ముత్యంవలె..అప్పుడే ర్యాపర్ విప్పిన కొత్త సబ్బుబిళ్ళవలె ఉంటూ వచ్చిన నారాయణ చుట్టూ ఏ మనిషైనా ఏవగించుకునే వెగటు వాసన..ఆ క్షణం.

"అంతిమంగా మనిషి ఒట్టి నిస్సహాయుడు రేవతీ..అన్నీ ఉండీ ఏమీ చేయలేని కొన్ని అనివార్య పరిస్థితులు మనల్ని 'విధివ్రాత 'కు వదిలేస్తాయి.కాలం చెప్పుచేతల్లో మనిషి ఒట్టి సుడి గాలిలో కాగితం ముక్కవలె అలా తేలి అంతర్ధానమైపోవడమే..ఉంటూ ఉంటూ చివరికి లేకుండా వెళ్ళిపోవడమే."అన్నాడు నారాయణ ఎన్నోసార్లు రేవతితో.

Rama chandramouli's short story Anivaryam

అరవై రెండేళ్ళ రేవతి అతికష్టం మీద తలను కుడివైపుకు తిప్పి నాల్గయిదు అడుగుల దూరంలో మంచంపై అచేతనంగా..అపస్మారకంగా..అప్పటిదాకా నొప్పి భరించలేక గొడ్డుకన్నా హీనంగా అరచి అరచి సొమ్మసిల్లి దాదాపు కోమాలోకి వెళ్ళినట్టు..చేతనాచేతన స్థితిలో ఉన్న భర్త నారాయణ గురించి ఆలోచిస్తూ,

అంతా నిశ్శబ్దం.

రేవతికి తలంతా దిమ్ముగా..ఎవరో మాడపై సుత్తితో కొడితే స్పృహ గడ్డకట్టి స్తబ్ధించినట్టు..అంతా తెలిసీ తెలియక..అర్థమౌతూనే ఏదీ అర్థంకానట్టు..ఒళ్ళు తిరుగుతున్నట్టు..మత్తుగా..తిమ్మిరిగా..కళ్ళకు బైర్లు కమ్ముతున్నట్టు..చుట్టూ ప్రపంచం గిరగిరా తిరుగుతూ..ఆగుతూ..వెనకటి తమ ఇంటిలోని గోడగడియారంలోని లోలకంవలె..ఇటునుండి అటూ..అటునుండి ఇటూ..ఊగుతూ.,

టైమెంతయిందో..అనుకుంది రేవతి.

Rama chandramouli's short story Anivaryam

గదినిండా చీకటి. రాజయ్య వెలిగించివెళ్ళిన దీపం కొడిగట్టి..ఆరిపోతూ . గాలి ఆడదు.ఒకటే ఉక్కపోత..చెమట.గుయ్ మని దోమలు.కుడుతున్నా చేతితో విదిలించుకోలేని నిస్సహాయత.ఈగలు వాలినా అంతే.చేయికూడా కదలనప్పుడు ఎవరైనా చేయగలిగేదేమిటి.బలైపోవడమే.

రోజుల పసిగుడ్డుగా ఉన్నపుడు కూడా మనిషి అంతే.ఏమీ తెలియదు.స్పృహ ఉండదు.దోమలు కుట్టినా,ఈగలు వాలినా,ఇంకేది కరిచినా..తెలియదేదీ.కాళ్ళు చేతులున్నట్టుకూడా తెలియని వింత స్థితి.ఊర్కే ఒట్టి ప్రాణమున్న బొమ్మ.

వయసు పైబడి..ఈ వృద్ధాప్యంలోకూడా కాళ్ళూ చేతులాడక..మనో స్థిమితం కోల్పోతూ.. అస్థిరతతో.. అనారోగ్యంతో.. మళ్ళీ శిశుదశే.

రేయి..పగలు..దినం..వారం..తిథి..ఏవీ తెలియక రోజులకురోజులు..పక్కపై..మంచమెక్కి.

బాల్యంలో గడిపేదంతా మంచంపైననే..మళ్ళీ ఇప్పుడు చరమదశలో కూడా ఎవరైనా వెళ్ళిపోవలసింది మంచంపట్టిన తర్వాతే.

పిల్లల బాధ్యతలను పూర్తిచేసి..ఇక కొద్దిగా ఊపిరిపీల్చుకుని ప్రశాంతంగా గడుపుదామని అనుకుంటూండగానే,

జీవితంలో చటుక్కున కమ్ముకొచ్చింది చీకటి.

పిల్లలిద్దరూ వాళ్ళవాళ్ళ జీవితాల్లో స్థిరపడ్డతర్వాత..కొడుకు వరంగల్ లో "గణేష్ వైన్ మర్చంట్స్" అని ఓ బ్రాందీ షాపును పెట్టుకుని సెటిలైపోయి..బిడ్డ హైదరాబాద్ లోని పటాన్ చెరువు ఇండస్ట్రియల్ ఏరియాలో తామే చూచి పెళ్ళి చేసిన ఎలక్ట్రీషియన్ తో కాపురం చేసుకుంటూ,

ఎక్కడివాళ్ళక్కడ,

మిగిలింది..వయసుమళ్ళిన వృద్ధ తల్లిదండ్రులు..తామిద్ద రు.

వీళ్ళనేం చేయాలె..అదీ ప్రశ్న ఈ సమాజంలోని ప్రతి ఇంట్లో.

తమ వెంట వరంగల్ వచ్చి తమతోపాటే ఉండమంటాడు ఒక్కగానొక్క కొడుకు ఈశ్వర్.కోడలుకూడా.కాని బతుకంతా ఒకచోట గడిపి ఏండ్లకొద్ది ఆ ఊరితో ఏర్పడ్డ అనుబంధాన్ని వదులుకుని వెళ్ళిపోవడమంటే అలా రైలుదిగి వెళ్ళిపోయినట్టుకాదుగదా.అక్కడి నేలతో..గాలితో..ఇరుగుపొరుగు మనుషులతో..పొలం పుట్రాతో..చెట్టూచేమతో ఏర్పడ్డ ప్రేమ అంత సుళువుగా తెంచుకుని పోయేది కాదు.అదే చెబుతూ వచ్చేది రేవతి పిల్లలతో.

నారాయణ ఆర్ ఎం పి.రెండెకరాల పొలం.చిన్న కిరాణ దుకాణం.తను కుట్టుమిషన్ తో జాకెట్లు..గౌన్లు కుట్టుకుంటూ..ఒక ఎడ్లబండి..రెండెడ్లు.ముందట విశాలమైన వాకిట్లో చేతులు విప్పుకుని ఎప్పటిదో వేపచెట్టు.ఏమీ తినకున్నా అలా వాకిట్లోకొచ్చి నిలబడి నలుగురు మనుషుల్తో నాలుగు మాటలు మాట్లాడి అలా పొలంలోకెళ్ళి పచ్చగడ్డిపై నడుస్తే..తృప్తి.తలెత్తి నిండు నీలాకాశంలోకి అలా తేరిపార చూస్తే మనసు నిమ్మళం.ఊరిని ఆవరించి చుట్టూ పహరాకాస్తున్నట్టు నిలబడ్డ గుట్టలనూ..తాటి చెట్ల వనాలనూ చూస్తే గుండెనిండా ధైర్యం.తమ ఊరుపేరే వాగూరు.ఎప్పుడూ ఎండిపోకుండా ఏడాదిపొడుగునా గలగలా పారే హనుమన్న వాగు.తెల్లగా చల్లగా పసిపిల్లల నవ్వులా నీళ్ళు..తీయగా.

తమ వాగూరును విడిచి స్వర్గానికైనాసరే ఎవరికీ వెళ్ళబుద్దికాదు.

అదే చెప్పేది పిల్లలతో.ఈ ఊరువిడిచి..ఈ నేల విడిచి..ఈ గాలి విడిచి..ఉహూ..అని.అర్థమౌతుంది వాళ్ళకు.ఎందుకంటే వాళ్ళకూ తెలుసు ఊరి మమకారం ఏమిటో.

పన్నెండేండ్లు..ఎలా గడిచాయో.పన్నెండు ఘడియలవలె.

మనుషులకు తెలియకుండానే ముసలితనం భూమిలోకి నీటిజలలా ముంచుకొస్తుంది. సూర్యుడుదయిస్తాడు.. వెలుగునూ,వేడినీ,శక్తినీ ప్రసాదిస్తాడనే ఆశేగాని సూర్యుడు అస్తమిస్తాడనే స్పృహే ఉండదు.ఇక అస్తమిస్తున్నపుడు ముసురుకుంటున్న చీకట్లతో చింత.

వేపచెట్టునిండా..ప్రక్కనే చింతచెట్టుపైనా..ఎన్ని పక్షులో.చీకటిపడుతూండగా విపరీతమైన గోల.

ప్రతి సాయంకాలం ఆ గుంపు పక్షుల సామూహిక రొద వింటుంటూంటే శరీరంలోనుండి ఏదో వాత్సల్యం గంగలా పొంగివస్తున్న అనుభూతి.చీకటి పడ్తున్నప్పుడు పక్షులు ఒకదానితో ఒకటి కొట్లాడుకుంటున్నట్టు గొడవ..ఉదయం..తెల్లవారుతూండగా కిచకిచల చిరు ధ్వనులతో ఒక వాత్సల్యం నిండిన పులకింత.పల్లె..తల్లి..ప్రశాంత పాలవెల్లి.

నదిలో నావలా సాగుతున్న సంసారంలో చటుక్కున ఒక సుడిగుండం పుట్టి..అకస్మాత్తుగా వరద..ఉప్పెన..అన్నీ కలగలిసి ముంచుకొచ్చాయి రేవతికి.

ఒకరోజు "గొంతులో ఏదో తట్టుకుంటున్నట్టనిపిస్తాందే రేవతీ..స్వరంలోపలకూడా ఏదో మార్పు..బొంగురుపొతున్నట్టు"అన్నాడు నారాయణ పొలంకాడికి వెళ్ళి వస్తూ వస్తూనే.అప్పటికే ఐదారుగురు పేషంట్స్ కూడా ఉన్నారు ముందుగదిలో.అనుకుంటూనే క్లినిక్ లోకెళ్ళి..గంట తర్వాత వచ్చి భోజనానికి కూర్చుంటూ "ఇవి మంచి లక్షణాలు కావు" అన్నాడు.

అప్పుడు గమనించింది రేవతి నారాయణ గొంతును.నిజమే గొంతు బొంగురుపోయినట్టు..ముదురు ధ్వని.

"అంటే" అంది ప్రశ్నార్థకంగా.

"ఒక్కోసారి అది నోటి లేదా గొంతు కేన్సర్ కు దారితీస్తది..ఎందుకైనా మంచిది రేపొకసారి వరంగల్లు పోయి పరీక్ష చేసుకొనస్త.అట్లనే ఈశ్వర్ నూ పిల్లల్నీ చూసస్త" అన్నడు నారాయణ.

నారాయణ రేవతికి భర్త..స్నేహితుడు..సఖుడు..సహచరుడు..పిల్లలు పెద్దై వెళ్ళిపోయిన తర్వాత ఒక్కోసారి చిన్న పిల్లాడు.అన్నింటినీ మించి తోడు.శ్వాస.

మర్నాడే వెళ్ళిపోయిన నారాయణ నాల్గురోజులదాకా రాలేదు తిరిగి. ఫోన్ చేసి ఏవో పరీక్షలకోసం హైదరాబాద్ వెళ్ళి అలాగే బిడ్డ ఇంటికికూడా వెళ్ళొస్తానన్నడు.

సరే అనుకుని తనపనిలో తాను పడిపోయింది రేవతి.

ఐదవరోజు అత్యంత దీనంగా..పాలిపోయిన ముఖంతో..బస్సుదిగి వ్రేలాడుతూ వచ్చాడు నారాయణ ఇంటికి.వచ్చి మంచంలో వెల్లగిలా చెట్టు కూలిపడ్డట్టు ఒరిగి..భోరున ముఖాన్ని రెండుచేతులనడుమ దాచుకుని ఏడుస్తూ "నాకు కేన్సర్ రేవతీ..నోటి కేన్సర్.పట్నంల బయాప్సీ చేసి చెప్పిండ్లు..ఐపోయిందే,జీవితం కుప్పకూలింది."అన్నాడు.

ఎదుట భూమి బద్దలైనట్టు..తామిద్దరూ ఏ పాతాళంలోకో కూలిపోతున్నట్టు..ఏ ఇసుక తుఫానులోనో కూరుకుపోతున్నట్టు.,

కళ్ళనిండా నీళ్ళతో రేవతి ఎక్కెక్కిపడ్తూ చూచింది.

నారాయణ ముఖంనిండా ఒట్టి శూన్యం..ఆ క్షణం.

కాని ఆనాడు రేవతి ఊహించలేదు మున్ముందు నారాయణ అనుభవించవలసి ఉన్న నరక సదృశ జీవితం గురించి.ఇక మొదలైంది దుఃఖ యాత్ర.

జీవితం గాజుబొమ్మ. ఏ క్షణం చేజారి కిందపడి భళ్ళున పగిలిపోతుందో తెలియదు.

గూడు చెదిరిపోతున్నట్టు అర్థంకావడం..ఏదో తెలియని ప్రమాదం ముంచుకురావడం..తెలుస్తోంది రేవతికి.

కలిసి నలభై ఏండ్లు నడిచి..చేయికి చేయి ఆసరాగా..కాలికి కాలు తోడుగా..శరీరంవెంట నీడవలె..శరీరంలో కనిపించకుందా ఉండే ప్రాణంవలె సాగీ సాగీ..అకస్మాత్తుగా ఎదురైన వీధి మలుపులో చటుక్కున ఏ లారీనో గుద్దుకుని అంతా ఛిద్రమై చితికిపోయినట్టు.,

హైదరాబాద్..రేడియం చికిత్స..అమెరికన్ ఆంకాలజీ దవాఖాన..కెమో థెరపీ..బయట ఇంకేవో కాయకల్ప చికిత్సలు.

ఏ పుట్టలో ఏ పాముందో..ఎవరి మందు పనిచేసి..ఏ పుణ్యాత్ముని చేతి చలువతో ఏ మేలో జరిగి..ఏ మహత్తుతోనో బ్రతికి బయటపడ్తామోనన్న ఆశ.

'కారణాలు తెలియవు రేవతీ..మనిషికి ఇటువంటి రోగాలు ఎందుకొస్తాయో అర్థంకాదు..ఏ వయసులో వచ్చి ఎప్పుడు తీసుకెళ్తాయో తెలియదు.ఈ ఘటనల వెనుక హేతువులేమిటో తెలియదు..అంతా ఖర్మ అనుకోవడమే.'అని భయం భయంగా చూశాడు నారాయణ ఆ రాత్రి రేవతి వంక.రేవతి నిశ్శబ్దంగా కుమిలి కుమిలి ఏడ్చింది ఎవరికీ కనబడకుండా.

సికింద్రాబాద్ బన్సీలాల్ పేటలో ఒక రూం కిరాయి తీసుకున్నాడు ఈశ్వర్.తనూ ఉన్నాడు రెండు మూడు రోజులు.కోడలుకూడా ఉంది.ఒక ఆటో మనిషిని పక్కా మాట్లాడాడు.దినం తప్పించి దినం..హాస్పిటల్ కు వెళ్ళి రేడిఏషన్ చేయించాలె.అప్పుడు నరకం.యాతన.శరీరం నొప్పితో మంటతో కనలి కనలిపోతూ బీభత్స క్షోభ.క్షోభతో సుళ్ళు తిరిగిపోయేవాడు నారాయణ.చిన్న పిల్లాడిలా భోరున ఏడ్చేవాడు.గిలగిలా తన్నుకునేవాడు.ఐదారు రేడిఏషన్ల తర్వాత మనిషి ముఖంలో ఎంతో వికృతమైన మార్పొచ్చింది.మనిషి శరీరం ఎంత అస్థిరమైందో అర్థమై రేవతికి ఒక రకమైన వైరాగ్య భావనతోపాటు భయం..అసహ్యం కలిగాయి.నారాయణ గొంతులోకి ఒక పొక్క చేశారు.దాని చుట్టూ ఒక ప్లాస్టిక్ బిళ్ళ.లోపలికి ఒక గొట్టం.గొంతుపై..చెంపలపై కర్రుతో కాల్చినట్టు మచ్చలు.అంతా..వికారం.

నారాయణ స్వతహాగా అందగాడు.కాని ఆ సకల సౌందర్యాలన్నీ ఒక్క నెలరోజుల్లో ధ్వంసమై భరించరాని వికృతి.లోపలినుండి ఏదో ఒక రాక్షసి అతని శరీరాన్ని మెల్లమెల్లగా తింటూ వస్తున్నట్టు క్షయం.

రెండు నెలలు గడిచేలోగా పరిస్థితులు చేయిదాటిపోతూండడం తెలిసింది రేవతికి.

"పేషంట్ ఈజ్ క్రానిక్" అని డాక్టర్లు అంటూంటే వింది.ఇంగ్లిష్ రాదామెకు.కాని అర్థమైంది.

మనిషిని నడిపించేది కేవలం మనసే అని బోధపడుతున్నకొద్దీ రేవతిలో నిశ్శబ్ద దుఃఖం అగ్నిపర్వతంలో లావావలె మరిగి దహించడం మొదలైంది.మరి ఏమైందోగాని ఆ రాత్రే రేవతికి ఒక చేయి ఒక కాలు స్వాదీనంతప్పి..మాటకూడా పడిపోయింది.

డాక్టర్లన్నారు"పెరాలిసిస్..పక్షవాతం"అని.

ఇంకో దెబ్బ.దెబ్బ మీద దెబ్బ.రాయి తగిలి రక్తం చిమ్మి ఛిద్రమైనచోటనే ఇంకో రాతిదెబ్బ.

రేవతికి కూడా చికిత్స ఇక.బోలెడు డబ్బు ఖర్చు.వాగూరులోని ఇల్లు పోయింది.అప్పటికే రెండు లక్షల పైన ఖర్చు.బాధ..దుఖం..ఇక ఈ యాతన తప్పదన్న రోదన అలవాటైపోయింది అందరికి.

వరంగల్లు తీసుకెళ్ళి అక్కడే రేడిఏషన్ చేయించండి..ఈమెకు కూడా అక్కడే చికిత్స..అని ఎవరో సలహా.కరక్టే..ఎన్నాళ్ళని ఈ నిత్య నరకం ఈ హైదరాబాద్ లో.

ఒక వర్షం కురుస్తున్న రాత్రి..కిరాయి కారులో వెనుక సీట్లో అపస్మారక స్థితిలో నారాయణ..ప్రక్కన చచ్చుబడిపోయిన అర్థ శరీరంతో రేవతి.

దుఃఖం వెంట మనుషులు..మనుషుల వెంటే దుఃఖం.

పెనుగాలిలో తెగిపోయిన గాలిపటం.. జీవితం.

ఎం జి ఎం..ఎంకేదో ప్రైవేట్ దవాఖాన..ఆరోగ్యశ్రీ..తెల్ల కార్డ్..ఇక్కడకాదు..అక్కడ..ఇటుకాదు..అటు.చివరికి నాల్గునెలల్లో శరీరాలు కృషించి..శిథిలమై..ఒట్టి బొక్కలు తేలి..ఒక చిత్రమైన సమస్యేర్పడింది.

నారాయణనుండి భరించరాని వాసన.కేన్సర్ రోగం మనిషిని తినేస్తూ తినేస్తూ ముఖంలో చెంపలు పోయి..ముక్కు కొంతభాగం మాయమై..కన్ను కింది భాగం నశించి..కనుగ్రుడ్డు బయటికి కనబడ్తూ..చూసేవాళ్ళకు ఒళ్ళు గగుర్పాటు.భయం..అసహ్యం..రోత.

ఏం చేయాలిప్పుడు..అన్న మీమాంస.

శారీరక యాతనను భరించలేక నారాయణ ఒకటే అరుపు..గొడ్డువలె..రాత్రింబవళ్ళు.

ఈశ్వర్ ఇల్లు కిరాయిది.ఇంటి ఓనర్ వెంటనే ఈ రోగులను తీసుకుని ఎటైనా వెళ్ళండి..ఖాళీ చెయ్ నా ఇల్లు..ఖాళీ..అని ఒకటే గోల.

వాగూరు కు వెళ్తే..ఇల్లు అమ్మేశాం కదా.పొలం దగ్గర ఒక పాక ఉంది.పశువుల పాక.

అక్కడికే..అక్కడికే.అక్కడికెళ్తే..అందరికీ దూరంగా..తమదైన విసర్జిత ప్రపంచంలోకి.

అతి దుఃఖంలోకూడా రవ్వంత సంతోషం కలిగి..మాట పడిపోయిన నోటితో..చచ్చుబడ్డ చేతితో సైగ చేసింది రేవతి కొడుకు ఈశ్వర్ తో..తమను అక్కడికి ఆ గొడ్ల పాకలోకే తీసుకుపొమ్మని.

మర్నాడే షిఫ్ట్..ఒక ఆటోలో.

వాగూరు..తమ ఇల్లును కోల్పోయి..ఊరిబయట..గొడ్లపాక..బావి ప్రక్కన..మొరంగడ్డమీద.

అన్నీ..ఒళ్ళూ..ఇల్లూ..డబ్బూ..మనసూ..మతీ..అన్నీ పోయినందుకు రేవతి దుఃఖించలేదా క్షణం. కనీసం ఈ గొడ్ల పాకైనా మిగిలి తలదాచుకునేందుకు చారెడు భూమి లభించినందుకు పరమానంద పడింది.

కాని మనుషుల జీవితాల్లో..ఒక్క నాల్గైదు నెలల్లోనే ఎంత మార్పు..ఓడ బండికాదు..పూచిక పుల్లై..సర్వమూ ధ్వంసమై..సముద్రమన్ని కన్నీళ్ళు ఆమె ఎండిపోయిన కళ్ళలో. ,

తెగిపోయాయి..అన్నీ తెగిపోయాయి.. బంధాలూ.. సంబంధాలూ.. ప్రేమలూ.. మమతలూ.. మానవానుబంధాలూ.. అన్నీ.

తెగిపోయాయి ఆలోచనలు పుటుక్కున.

అప్పటిదాకా అరిచి అరచి..నొప్పితొ వడితిరిగి..సుడితిరిగి తల్లడిల్లిన నారాయణ కొద్దిగా ఊరటపడి..నిద్రపోతున్నాడా.?

రేవతికి అంతులేని జాలి కలిగి అతనివంక చూచే ప్రయత్నం చేసింది..బలవంతంగా మెడలను తిప్పుతూ.దీపం గుడ్డివెలుగులో లేత ఎరుపుగా నారాయణ ముఖం..పాలిపోయి..సగమే.మిగతా సగం ముఖాన్ని రోగం తినేసింది.కొలుకుల్లో వ్రేలాడుతూ కనుగ్రుడ్డు..తెల్లగా..ఎర్రని జీరతో..బయటికి కనిపిస్తూ.

తను లేవలేదు.మంచం దిగలేదు.స్వేచ్ఛగా కదలలేదు.మాటరాదు.

పశుల పాపన్న రాత్రి తొమ్మిద్దాకా తమతో గడిపి..మాటప్రకారం పది రూపాయలను గూట్లోని మట్టి గల్లాలోనుండి తీసుకుని..వెళ్తూ వెళ్తూ గుడిసెకు తడిక తలుపును తాడుతో కట్టి పొతే..ఇక మర్నాడు ఉదయం ఆర్ ఎం పి రాజన్న వచ్చి నారాయణ యొక్క నిండా మురుగువంటి నురుగు నిండిన కేన్సర్ ముఖాన్ని శుభ్రం చేసి.,

రాజన్న దేవుడు..అనుకుంది రేవతి.లేకుంటే ఏ మానవమాత్రుడూ..భార్య ఐన తనతో సహా ఎవరూ భరించలేని ఆ దుర్గంధాన్ని ఎలా సహిస్తూ అంతా శుభ్రం చేసి..ఏదో మందు రాసి..చేతులెత్తి మొక్కాలతనికి.. అనుకుంది.

టైం ఎంతో..చుట్టూ చిమ్మట్ల చిత్రమైన చప్పుడు..బయట మోటబావి గట్టుచెట్టుమీద ఇంకా నిద్రలేవని పక్షుల సవ్వడి.

మూడు గంటలై ఉంటుందేమో.

తన గురించి ఆలోచించింది రేవతి క్షణంసేపు.

ఒకప్పటి దేవకన్యవంటి తన దేహం..ఇప్పుడు వట్టి ఎండిన కట్టె..కదలని ప్రాణమున్న మాంసపు ముద్ద.

సరిగా అప్పుడే నారాయణ కొద్దిగా కదిలి..ఒత్తిగిల్లి..మూల్గి..చటుక్కున అరవడం మొదలెట్టాడు బాధతో.మాటరాదుకదా..అరవడమొక్కటే అతను చేయగలిగేది.

తను అదికూడా చేయలేదు.నోరే పడిపోయింది.

చూస్తూండగానే మనిషి నొప్పితో సుడితిరిగిపొతూ ఒకటే యాతన.వివిధ రకాల కేకలు.. అరుపులు.. ఆక్రందనలు.

వింటూంటే గుండె తరుక్కుపోతూ,

ఎన్నాళ్లిలా..ఈ నరక యాతన.శారీరక క్షోభ..హింస.

విముక్తి ఉందా దీనికి.

ఒక భార్యగా..స్త్రీగా..తోటి మనిషిగా ఏమైనా చేయగలదా తను.

పిల్లలు..కొడుకు,కోడలు,బిడ్డ,అల్లుడు..అందరూ చేసీ చేసీ అలసి..ఎవరుమాత్రం ఏమి చేయగలరు.ఎన్నాళ్ళు చేయగలరు.

కాని ఎలా.?

నొప్పి ఎక్కువైనట్లున్నది..మనిషి ఇంకా గట్టిగా బిగ్గరగా అరుస్తూ కొట్టుకుంటున్నాడు మంచంపై.

కిందపడిపోతాడా..పడకుండా ఆర్ ఎం పి రాజయ్య నారాయణను తను వేళ్ళేప్పుడు..రాత్రి మంచానికి తాళ్ళతో కడతాడు రోజూ.

ఆలోచిస్తోంది రేవతి..తీవ్రంగా.

గడ్డకట్టిన రెండే శబ్దాలు ఆమె చుట్టూ..ఒకటి నిశ్శబ్దం..రెండు ఆకాశం బద్దలౌతుందా అన్న స్థాయిలో నారాయణ అరుపులు.

రేవతి గుండెనిండా దుఃఖం..వేదన..బాధ..కన్నీళ్ళు.

ఏదో ఆవ హించినట్టయిందామెకు క్షణకాలంలో.ఏదో చేవ లోపల నరనరాల్లో ఉరుకుతూ..తన్నుకుని తన్నుకుని..శక్తినంతా పుంజుకుని..కదిలి లేచింది మెల్లగా.ఆశ్చర్యంగా లేచి కూర్చుంది.బలం ఎట్లొచ్చిందో లేచి నిలబడింది.అడుగు..మళ్ళీ అడుగు..కాళ్ళు కదులుతూ..ఇంకో అడుగు..నారాయణకు దగ్గరగా వచ్చింది.పైకి వంగింది.తేరిపార నారాయణ ముఖంలోకి చూచింది.

సుడితిరిగిపోతున్నాడు నొప్పితో..బాధతో శరీరం కంపిస్తోంది.ముఖం లేదు.దాదాపు అంతా నురుగే.కంపు వాసన.రసి.గిలగిలా తన్నుకుంటున్నాడు.

లిప్తకాలం అలా చూసింది తీక్షణంగా.దీర్ఘంగా నిట్టూర్చి..పైకి వంగి చటుక్కున నారాయణయొక్క సగమే మిగిలిఉన్న ముక్కును గట్టిగా పట్టుకుని..మూసి..ఊపిరాడకుండా అదిమిపట్టి.,

అతను గిలగిలా..తన్నుకుని తన్నుకుని.,

నొప్పి..నొప్పి..యాతన..అరికాళ్ళ దగ్గరినుండి..మెదడులోపలిదాకా..మంటలు వ్యాపించి దహిస్తున్నట్టు,

అలాగే పట్టుకుంది ముక్కును మూసి ఊపిరాడకుండా.

ఒక్క క్షణం..రెండు క్షణాలు.,

ఐపోయింది.

నారాయణ శరీరం అచేతనమై..అరుపు ఆగి..నిశ్శబ్దం ఆవరించి.,

రేవతి అలా చచ్చిపోయిన నారాయణ వంక చూస్తూ..విహ్వల..భ్రాంత..స్తబ్ద ఐ.,

దుఃఖం ముంచుకొచ్చిందామెకు..అప్పటిదాకా నోరు పెగలని గొంతులోనుండి విపరీతమైన ఏడుపు తన్నుకొస్తూ,

కుప్పకూలిపోయింది రేవతి నేలపై..దభాల్న.

బయట మోటబావి మొరంగడ్డపైనున్న చింతచెట్టుమీది పక్షులు రెక్కలను విప్పుకుంటున్నాయి..కిచకిచ చప్పుడుచేస్తూ.

ఇంకా చీకటే.

- రామా చంద్రమౌళి

English summary
A prominent Telugu poet and short writer Rama Chandramouli from Warangal in Telangana state short story Anivaryam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X