షాజహానా కవిత చమ్కీ

శనివారం, ఫిబ్రవరి 18, 2012, 14:22 [IST]
Shajahana
కలల కుచ్చుముడి వీడి
దారాలు దారాలుగా జీవితం
నాలుగ్గోడలకు రోజులను బిగించి
పట్టి పట్టి చేస్తున్న కలల కార్చోప్

రాత్రి చిక్కటి చీకటి మీద
మెరుపులుగా మెరుస్తున్న
కట్ దానా కుందన్‌లను
ఆలోచనల జరీతో కలబోసి చేస్తున్న కార్చోఫ్

సాదా చమ్కీ ... దేవదాసి చమ్కీ..
రకరకాల రంగుల మెరుపు కలలు

సాదా జీవితానికి
అరబ్ దీనార్ల రంగుల కలలు
రాకుమారుడి రాక కోసం
ఆకాశం తానులో నేసిన నక్షత్రాల స్వాగతం

అన్ని చమ్కీలు చీర మీదకు చేరవు
దారి తప్పి కింద పడి - ఊడ్పలో మాసి -
బజారులో ఎండకు మెరసి -
ఏ గాలి వేగానికో
బురద గుంటల్లో ఆత్మహత్య చేసుకుంటాయి

బతుకు చీరకు వేసిన కట్‌దానాలానో
బజారున పడ్డ చమ్కీలానో
ఏ ఎగుమతిలో ఎక్కడి దాకా వెళ్తుందో తెలియదు
ఏ బురద గుంట వడిలో మునుగుతుందో తెలియదు
కానీ మెరవడం దాని జీవలక్షణం
పాత బస్తీ నిండా మెరుస్తున్న చమ్కీలే
English summary
Shajahana taking Chamki as symbol explains about Muslim girls pathetic situation.
User Comments
Gullakota Laxman 26 Mar 2012 07:25 pm
చమ్కీల జీవన వేదనని ఎంత ఆర్ద్రంగా రాశారు ఇన్నాళ్ళు 'షాజహానా' అనే కలం పేరుతొ ఎవరో రాస్తున్నారనుకున్నాను...మీకలం ఈ కాలానికే తలమానికం ...లోతైన జీవన పార్శ్వాలను స్పృశించ టంలో మిమ్ము మించినవారు లేరు ..మీ కవితా సంకలనాలుంటే తెలియజేయండి ... డా . సింహాచలం లక్ష్మణ్ స్వామి ,జగిత్యాల dr.laxmanswamy@gmail.com
[ మీ వ్యాఖ్య రాయండి ]
1st Preliminary Final , Subrata Roy Sahara Stadium, Gahunje
Kolkata Knight Riders won by 18 runs