'సాక్షి'లో నాగార్జున!

శుక్రవారం, జనవరి  16, 2009, 17:29 [IST]
Nagarjuna
హైదరాబాద్: ప్రముఖ దినపత్రిక "సాక్షి"ని పొద్దున్నే కళ్ళు నులుముకుని చూడగానే అగ్రభాగాన హీరో నాగార్జున ఫోటో ప్రముఖంగా కన్పించింది. నాగార్జునకు ఏదైనా అంతర్జాతీయ అవార్డు వచ్చిందా లేకపోతే రామలింగరాజు లాగా ఆయన ఏదైనా కుంభకోణంలో చిక్కుకుపోయారా అనుకుంటూ కిందికి వెళ్ళి వార్త చదివితే అది ఆయన సాక్షి ప్రతినిధులకు ఇచ్చిన "ప్రత్యేక ఇంటర్వ్యూ". శీర్షిక "హ్యాట్సాఫ్ టు వైఎస్". వైఎస్ పథకాలన్నీ తనకెంతో నచ్చాయని, వైఎస్ మహానుభావుడని నాగార్జున విడిచిన పొగడ్తలను బ్యానర్ వార్తగా ప్రచురించి "నవ్వు పోదురుగాక నాకేటి సిగ్గు" అని చక్కగా చాటుకున్నారు.

వార్తాపత్రికను స్వప్రయోజనాలకు వాడుకున్నవాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ మరీ ఇంత బరితెగించి జనం సహనాన్ని పరీక్షించేలా ఇలాంటి ఇంటర్వ్యూను పతాక శీర్షికగా ప్రకటించడం విడ్డూరంగా ఉంది. అన్నపూర్ణ స్టూడియోస్ భూమికి ప్రభుత్వం తరఫున ఫేవర్లు పొందిన నాగార్జున రాజశేఖరరెడ్డి చుట్టూ చిడతలు పుచ్చుకుని హరిదాసులా తిరుగుతున్నాడని ఇప్పటికే లోకం కోడై కూస్తోంది. ఒకరి ప్రయోజనాలు ఒకరు కాపాడుకోవచ్చు కానీ అన్ని వర్గాల వారు చదివే వార్తా పత్రికను ఇంతగా దిగజార్చడం దిగ్భ్రాంతి కలిగించే విషయం.

చంద్రబాబు నాయుడు "జన్మభూమి" పథకాన్ని అట్టహాసంగా ప్రారంభించినప్పుడు తన సొంత ఊరు రామాపురంలో ఆ కార్యక్రమాన్ని ప్రారంభించి ఒంటి మీద బట్టలు లేనంతగా పులకించిపోయి మాట్లాడిన చరిత్ర అక్కినేని నాగేశ్వరరావుది. ఆయన వంటి ఎంతో మంది సినీ దిగ్గజాలు కష్టపడినా చంద్రబాబు నాయుడిని రెండోసారి గట్టెక్కించుకోలేకపోయారు. ఇప్పుడు వ్యాపార ప్రయోజనాల కోసం కుటుంబసభ్యులను కాంగ్రెస్ కు అనుకూలంగా ట్యూన్ చేసి ఆయన హాయిగా విశ్రాంతి తీసుకుంటున్నారు.

రేపు పరిస్ధితులు మారి చంద్రబాబు నాయుడు మహాకూటమి అధికారంలోకి వస్తే మొదట పుష్పగుచ్చంతో చంద్రబాబు వద్ద ప్రత్యక్షమయ్యేది అక్కినేని నాగేశ్వరరావే. ఒక వారం తర్వాత నాగార్జునను కూడా ఆయన వద్దకు తీసుకెళ్ళి మరో కీర్తన పాడించే బాధ్యత కూడా నాగేశ్వరరావుదే. త్వరలో సాక్షిలో మహేష్ బాబు ఇంటర్వ్యూ పతాక శీర్షికతో వచ్చినా ఆశ్చర్యం లేదు. లబ్దిదారులూ జిందాబాద్, రాజకీయ నాయకులూ వర్ధిల్లండి.
User Comments
balayya 10 Jun 2010 03:00 pm
ore eeti kodite yahoo serch lo kuda kanapakunda potaru.. balayya
jay 06 Feb 2010 01:08 am
సొంత డబ్బా ఎక్కువ న్యూస్ తక్కువ, పైగా అదొక సాక్షి
[ మీ వ్యాఖ్య రాయండి ]
1st Preliminary Final , Subrata Roy Sahara Stadium, Gahunje
Kolkata Knight Riders won by 18 runs