కెసిఆర్‌కు షాక్ ఇవ్వడానికే బిజెపి...

మంగళవారం, ఫిబ్రవరి 21, 2012, 12:45 [IST]
K Chandrasekhar Rao
ఉప ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుకు షాక్ ఇవ్వడానికే బిజెపి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. పోటీ నుంచి విరమించుకోవాలని తెరాస నాయకత్వం చేస్తున్న విజ్ఞప్తులకు బిజెపి లొంగడం లేదు. మంగళవారంనాడు బిజెపి అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డితో తెరాస శాసనసభ్యులు ఈటెల రాజేందర్, హరీష్ రావు తదితరులు మాట్లాడారు. వారి విజ్ఞప్తిని కిషన్ రెడ్డి తోసిపుచ్చినట్లు తెలుస్తోంది. తమ క్యాడర్‌ను నిలుపుకోవడానికి ఉప ఎన్నికల్లో పోటీ చేయడం అవసరమని బిజెపి కేంద్ర నాయకత్వం కూడా భావిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా కెసిఆర్ వ్యవహార శైలి పట్ల బిజెపి నాయకత్వం తీవ్ర అసంతృప్తితో ఉంది.

రాష్ట్రంలోని ఏడు స్థానాలకు జరుగుతున్న ఉప ఎన్నికల్లో నాలుగు స్థానాలకు పోటీ చేయాలని బిజెపి నాయకత్వం భావిస్తోంది. ఉప ఎన్నికలు జరిగే ఏడు స్థానాల్లో ఆరు స్థానాలు తెలంగాణలోనే ఉన్నాయి. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలకు రాజీనామా చేసినవారే తెరాస తరఫున ఉప ఎన్నికల్లో అభ్యర్థులుగా ముందుకు వస్తున్నారని, వారు తెలంగాణ కోసం తిరిగి పోటీ చేయడం లేదని బిజెపి వాదిస్తోంది. అందువల్ల తాము పోటీ చేయక తప్పదని అంటోంది.

బిజెపి పోటీ చేయదలుచుకున్న నాలుగు స్థానాల్లో తెలంగాణకు మూడు స్థానాలు స్టేషన్ ఘనపూర్, మహబూబ్ నగర్, కామారెడ్డి స్థానాలు ఉన్నాయి. నెల్లూరు జిల్లాలోని కొవ్వూరులో కూడా పోటీ చేయాలని బిజెపి అనుకుంటోంది. ఈ స్థితిలో తెరాసకు చెందిన కొంత మంది కీలక నేతలు, మాజీ శాసనసభ్యులు బిజెపిలో చేరుతారనే ప్రచారం కూడా ఊపందుకుంది. ఇది కూడా కెసిఆర్‌కు తలనొప్పిగానే పరిణమించే అవకాశాలున్నాయని అంటున్నారు. ఉప ఎన్నికల్లో పోటీ చేస్తామని లోకసత్తా అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ కూడా ప్రకటించారు.
English summary
It is said that BJP has decided to contest in bypolls rejecting to TRS plea.
User Comments
[ మీ వ్యాఖ్య రాయండి ]
ఈ ఆర్టికల్ మీద మీరే మొదటి వ్యాఖ్య రాయండి .
1st Preliminary Final , Subrata Roy Sahara Stadium, Gahunje
Kolkata Knight Riders won by 18 runs