వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బిసిసిఐ షాక్: కెప్టెన్ ధోనీ ఖేల్ ఖతమ్?

By Pratap
|
Google Oneindia TeluguNews

ముంబై: టీమిండియా కెప్టెన్ ఎంఎస్ ధోనీకి బిసిసిఐ షాక్ ఇచ్చింది. హెడ్ కోచ్ డంకెన్ ఫ్లెచర్ విషయంలో ధోనీ చేసిన వ్యాఖ్యను బిసిసిఐ కొట్టిపారేసింది. అది ధోనీ వ్యక్తిగత అభిప్రాయమంటూ తీసిపారేసింది. ఈ స్థితిలో భారత క్రికెట్ క్రీడలో మరోసారి ప్రచ్ఛన్న యుద్ధం ప్రారంభమైనట్లు భావిస్తున్నారుకెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) అధికారుల మధ్య దూరం క్రమంగా పెరుగుతున్నట్టు తాజా పరిణామాలు తెలియజేస్తున్నాయి.

ధోనీకి బిసిసిఐ చాలా కాలంగా పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తూ వస్తోంది. విదేశాల్లో ఎన్ని పర్యాయాలు విఫలమైనా, ఎంత ఘోరంగా పరాజయాలను ఎదుర్కొన్నా ధోనీ కెప్టెన్సీకిగానీ, జట్టులో అతని స్థానానికిగానీ ఎలాంటి సమస్య ఎదురుకాలేదు. సుప్రీం కోర్టు ఆదేశాలతో బిసిసిఐ అధ్యక్ష బాధ్యతల నుంచి వైదొలగిన ప్రస్తుత అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) చైర్మన్ శ్రీనివాసన్‌తో ధోనీకి సత్సంబంధాలున్నాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీకి శ్రీనివాసన్ యజమాని. ఆ జట్టు కెప్టెన్ ధోనీ. వారి మధ్య గాఢానుబంధాన్ని ఇవి తెలియజేస్తున్నాయి.

BCCI stuns MS Dhooni on Fletcher issue

ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా దేశాల్లో పర్యటించి పరాభవాలను మూటగట్టుకున్న టీమిండియా తాజాగా ఇంగ్లాండ్ పర్యటనలో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 1-3 తేడాతో చేజార్చుకుంది. ఈ సిరీస్ సందర్భంగా ధోనీ తీసుకున్న పలు నిర్ణయాలపై విమర్శలు చెలరేగాయి. రెండు టెస్టులను ఇన్నింగ్స్ తేడాతో కోల్పోవడం భారత క్రికెటర్లలో అంకిత భావం లేదని, సమష్టిగా పోరాడాలన్న కనీస బాధ్యతను కూడా వారు పట్టించుకోలేదని స్పష్టం చేస్తున్నది. తుది జట్టు కూర్పుపై విమర్శలు వెల్లువెత్తాయి. నలుగురు బౌలర్లతోనే ఆడాలన్న వ్యూహాన్ని ధోనీ మార్చుకోకపోవడం చాలా మంది మాజీ క్రికెటర్లు, అధికారులకు ఆగ్రహం తెప్పించింది. పరాజయాలు ఎదురవుతున్నప్పటికీ తీరు మార్చుకోకపోవడం ఏమిటని ప్రతి ఒక్కరూ ప్రశ్నించారు. అయినా అతను పట్టు వీడలేదు.

అంతకు ముందు పలు సందర్భాల్లో గౌతం గంభీర్ జట్టులోకి రావాలన్న అభిప్రాయాన్ని ధోనీ వ్యక్తం చేశాడు. అతని లాంటి సీనియర్ ఆటగాడు జట్టులో ఉండాలని దక్షిణాఫ్రికా పర్యటన సమయంలో ధోనీ వ్యాఖ్యానించాడు. ఈ విషయంలో సెలక్టర్లపై అతను ఒత్తిడి తెచ్చారన్న వాదన కూడా ఉంది. కారణాలు ఏవైనా, చాలాకాలం తర్వాత గంభీర్‌కు మళ్లీ టీమిండియాలో స్థానం దక్కింది. ఆ అవకాశాన్ని అతను సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఇంగ్లాండ్ పర్యటనలో దారుణంగా విఫలమయ్యాడు. గంభీర్ ఫామ్‌ను కోల్పోయినప్పటికీ ధోనీ ప్రాపకం వల్లే అతను టెస్టు జట్టుకు ఎంపికయ్యాడన్న విమర్శలున్నాయి.

కోచ్ డంకన్ ఫ్లెచర్‌కు చాలా సన్నిహితంగా ఉంటూ, అతనికి కొమ్ముకాయడం కూడా ధోనీ పట్ల వ్యతిరేకతను పెంచుతోంది. విదేశాల్లో భారత జట్టు వైఫల్యాలకు ధోనీ బాధ్యత వహించాలని ఎంతోమంది మాజీ క్రికెటర్లు డిమాండ్ చేశారు. ఫ్లెచర్‌ను తొలగించాలన్న డిమాండ్ ఊపందుకుంది. కానీ, వచ్చే ఏడాది జరిగే ప్రపంచ కప్ చాంపియన్‌షిప్ ముగిసే వరకూ అతనే కోచ్‌గా కొనసాగుతాడని ప్రకటించిన ధోనీ కొత్త వివాదానికి పునాది వేశాడు.

ధోనీకి ఉన్న అధికారం ఏమిటి...

జట్టు కోచ్‌గా ఎవరిని ఉంచాలి? ఎవరిని తొలగించాలి? అన్న కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకునే అధికారం భారత జట్టు కెప్టెన్‌గా ధోనీకి ఉందా? నిబంధనల ప్రకారమైతే లేదు. బిసిసిఐ పాలక మండలి, జాతీయ సెలక్షన్ కమిటీ ఈ అంశంపై నిర్ణయం తీసుకుంటుంది. అలా లేనప్పుడు ఫ్లెచర్ పదవీ కాలంపై ప్రకటన చేయడం వెనుక ధోనీకి ఏదైనా స్పష్టమైన వ్యూహం ఉందా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. సిరీస్ మధ్యలో కోచ్‌ని తొలగిస్తారన్న వార్త ప్రచారమైతే, దాని ప్రభావం ఆటగాళ్లపై ఉంటుందని ధోనీ భావిస్తే ఆ విషయాన్ని ముందుగా బిసిసిఐ దృష్టికి తీసుకెళ్లాలి. వారి నుంచి ప్రకటనలు ఇప్పించాలి. కానీ, తనంతట తానుగా అతను ఎందుకు స్పందించాడన్నది ప్రశ్న.

ఫ్లెచర్‌ను కొనసాగిస్తున్నట్టుగానీ, తొలగిస్తున్నట్టుగానీ బిసిసిఐ ఎక్కడా చెప్పలేదు. జట్టు వ్యవహారాలను చూసే సంధాన కర్తగా బాధ్యతలను డైరెక్టర్ హోదాలో మాజీ కెప్టెన్ రవి శాస్ర్తీకి అప్పగించింది. అతను కూడా ఫ్లెచర్ స్థాయిని తగ్గించడం లేదని స్పష్టం చేశాడు. బిసిసిఐకిగానీ, రవి శాస్ర్తీకిగానీ లేని తొందర ధోనీకి ఎందుకనేది ప్రశ్న. రవి శాస్ర్తీని డైరెక్టర్‌గా నియమించే విషయంలో ధోనీ అభిప్రాయాలను బిసిసిఐ పరిగణలోకి తీసుకోలేదని అంటున్నారు.

అదే నిజమైతే, తన ఆధిపత్యం దెబ్బ తింటుందనే భయం ధోనీని వెంటాడుతుండవచ్చు. ఆ క్రమంలోనే అతను ఫ్లెచర్ కొనసాగింపుపై ప్రకటన చేసి ఉండవచ్చు. నిజానిజాలు ఎలావున్నా, ధోనీతో బిసిసిఐ మధ్య సంబంధాలు మునుపటి మాదిరి బలంగా లేవన్నది వాస్తవం. ధోనీ కెప్టెన్సీపై వినిపిస్తున్న డిమాండ్లు కూడా బోర్డు పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. రాబోయే ప్రమాదాన్ని గుర్తించి ధోనీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాడని కొందరి వాదన. ఏమైనా, ధోనీ నాయకత్వానికి, నాయకత్వాన్ని ఆసరా చేసుకుని చెలాయిస్తున్న ఆధిపత్యానికి తెర పడినట్లేనని భావిస్తున్నారు.

English summary
Latest developments in Indian Cricket is indicating the cold war between Team India captain MS Dhoni and BCCI officials.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X